సాక్షి, అమలాపురం: ‘అట్టడుగు నుంచి సమాచారం తెప్పించుకుంటాను. మూడు నాలుగు సర్వేలు చేయిస్తాను. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ఐవీఆర్‌ఎస్ సర్వే చేయించి, డేటా విశ్లేషణ చేయడం ద్వారా పార్టీ ఇన్‌చార్జిలను, అభ్యర్థులను నిర్ణయిస్తాను’ ఇది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాట. కానీ ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. అభ్యర్థులను నిర్ణయించడం అటుంచి కనీసం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలను సైతం ధైర్యంగా నియమించే స్థితిలో టీడీపీ అధినేత లేరు. ఆయన నాన్చుడు ధోరణి పార్టీ పుట్టి ముంచుతోందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. తొలి రోజు మండపేట, గురువారం కొత్తపేట, శుక్రవారం అమలాపురంలో రచ్చబండ, రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆవిర్భావం నుంచీ పలు ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సొంతం చేసుకున్న జిల్లాలో టీడీపీ ఎదురీతకు సంస్థాగత లోపాలు, ప్రజా విశ్వాసం కోల్పోవడం ప్రధాన కారణం కాగా.. పార్టీ అధినేత నాన్చుడు ధోరణి కూడా దీనికి తోడవుతోందని తమ్ముళ్లు అంటున్నారు.
అన్నిచోట్లా సమస్యలే..
► ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కూడా జిల్లాలోని ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులు, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నాయి. రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాలకై తే దిశానిర్దేశం చేసే నాయకులే లేరు. జిల్లా కేంద్రం అమలాపురంతో పాటు కొత్తపేటలో కూడా నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జిల తలలపై పొత్తుల కత్తులు వేలాడుతున్నాయి.
► గత ఎన్నికల తరువాత నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. ప్రస్తుతం టూమెన్ కమిటీ పేరుతో అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి గంటి హరీష్ మాధుర్, జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి నేలపూడి స్టాలిన్‌బాబు పోటీ చేశారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆయన పార్టీని వీడారు.
తరువాత ఇన్‌చార్జి కోసం పలువురు పేర్లు తెర మీదకు వచ్చినా చెప్పుకునే స్థాయి నాయకులు లేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హరీష్‌కు అప్పగించారు. రాజకీయ అనుభవం లేకపోవడం.. అటు పార్లమెంటరీ నియోజకవర్గానికి, ఇటు అసెంబ్లీ నియోజకవర్గానికి తిరగాల్సి రావడంతో హరీష్ సైతం సమర్థంగా పని చేయడం లేదు. నామన చురుకుగా ఉండడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకాన్ని చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా గాలికి వదిలేయడం క్యాడర్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది.
► మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పరిస్థితి మరీ దారుణం. పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కుతుందనే భరోసా లేదు. జనసేనతో పొత్తు ఉంటే రాజోలును ఆ పార్టీకి కేటాయిస్తారని, గొల్లపల్లికి పి.గన్నవరంలో అవకాశం కల్పిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు పి.గన్నవరం ఊసు కూడా లేదు. ఆయన నాయకత్వంపై పార్టీ అధిష్టానానికి నమ్మకం లేదని చెబుతున్నారు. 2014లో సైతం ఆయనకు టీడీపీ అన్యాయమే చేసింది. ఆ ఎన్నికలకు ఏడాది కన్నా ముందే గొల్లపల్లిని అమలాపురం ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి మొండిచేయి చూపించారు.
► ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)దీ ఇదే పరిస్థితి. పార్టీ టిక్కెట్‌కు మరొకరితో పోటీ లేకున్నా జనసేనతో పొత్తు రూపంలో ఆయనపై కూడా కత్తి వేలాడుతోంది.
► అమలాపురంలో పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న పరమట శ్యామ్ మధ్య విభేదాలు రోడ్డున పడుతున్నాయి. శ్యామ్ వెనుక ఇదే నియోజకవర్గానికి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వర్గీయులు మద్దతుగా నిలుస్తున్నారు. వీరిద్దరిలో అభ్యర్థి ఎవరనే సందిగ్ధత పార్టీ క్యాడర్‌లో నెలకొని ఉంది. దీనికి తెర దించాల్సిన చంద్రబాబు ఇద్దరినీ పని చేయండని ప్రోత్సహిస్తున్నారు.
► రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ పార్టీని వీడిన తర్వాత స్థానికంగా నాయకత్వం లేకుండా పోయింది. శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఇన్‌చార్జిగా నియమించినా ఆయన ఆ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా పార్టీని నడిపించేందుకు సరైన నాయకుడు లేకుండా పోయాడు.
► కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు టిక్కెట్ పరంగా పోటీ లేకున్నా ఇదే నియోజకవర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యంతో ఆధిపత్య పోరు నడుస్తోంది.
► జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకై క నియోజకవర్గం మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇటు ఇంట, అటు బయట విమర్శల పాలవుతున్నారు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే క్యాడర్‌తో పాటు నియోజకవర్గంలోని పలువురిలో అసంతృప్తి నెలకొంది. ఇటీవల సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారంటే వేగుళ్ల మీద సొంత వారిలో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment