ఆక్ పాక్ కరివేపాక్ ఫిలాసఫీని అలానే కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి కోలుకోలేని షాకిచ్చారాయన. నంద్యాల నియోజక వర్గం భూమా అఖిలప్రియ- భూమా బ్రహ్మానందరెడ్డిలో ఒకరికి ఇస్తానన్నట్లు చెబుతూ వచ్చిన చంద్రబాబు చివరకు ఎన్.ఎం.డి.ఫరూక్ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం పార్టీకోసం కష్టపడితే ఇపుడు తమని పక్కన పెట్టి మోసం చేశారని భూమా బ్రహ్మానంద రెడ్డి లోలోనే కుత కుత లాడిపోతున్నారు.
అవసరానికి వాడుకోవడం ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. కర్నూలు జిల్లాలో 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత కొంత కాలానికి ఆయన్ను రక రకాలుగా ప్రలోభాలు పెట్టి వేధించి టిడిపిలో చేరేలా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు ఆయన కూతురు భూమా అఖిల ప్రియ కూడా టిడిపిలో చేరారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి గెలిచిన అఖిల ప్రియ చంద్రబాబు ప్రలోభాలతో టిడిపిలో చేరారు.
2017లో భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు. కాకపోతే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అయినా టిడిపినే అంటిపెట్టుకుని ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నుండి తానే పోటీ చేయాలని బ్రహ్మానందరెడ్డి ఆశపడుతూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం జిల్లాలో భూమా కుటుంబం నుండి ఒకరికే టికెట్ ఇస్తామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే భూమా అఖిల ప్రియ చేత నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రహ్మానందరెడ్డి-అఖిల ప్రియ మధ్య రచ్చ రాజేసి ఇద్దరి మధ్య పోటీ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇపుడు హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే ఎన్. ఎం.డి. ఫరూక్ ను నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో ఫరూక్ కు టికెట్ కేటాయించినట్లే అంటున్నారు పార్టీ నేతలు. అయిదేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం తాను పార్టీలోనే ఉంటే ఇపుడు తనను పక్కన పెట్టడం ఏం న్యాయమని బ్రహ్మానంద రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి వెన్నుపోటుకు తెగబడ్డారని బ్రహ్మానంద రెడ్డి తన అనుచరులతో చెప్పుకుని బాధ పడుతున్నారట.
ఫరూక్ కు టికెట్ ఇస్తే మాత్రం ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని బ్రహ్మానందరెడ్డి తన కోటరీ సభ్యులతో అంటోన్నట్లు ప్రచారం జరుగుతోంది . మొత్తానికి వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల నియోజక వర్గం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment