సాక్షి, పుట్టపర్తి: అధినేత అరెస్టు కావడంతో ‘తమ్ముళ్ల’లో వణుకు పుట్టింది. రాబోవు ఎన్నికల్లో గెలవలేమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు అందడంతో పోటీ చేయాలా? వద్దా? అనే సందేహంలో కొందరు సీనియర్ నాయకులు పడ్డారు. ఈ క్రమంలో బేరం కుదిరితే పొత్తుల పేరుతో జనసేన, కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులకు టికెట్ త్యాగం చేసేందుకూ వెనుకాడడం లేదు. ఇవే అంశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల టికెట్ ఆశిస్తున్న వారికే బాధ్యతలు ఇచ్చి తప్పుకోవాలని ప్రస్తుత ఇన్‌చార్జిలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డీల్ కుదిరితే ఓకే..
ధర్మవరం, పెనుకొండ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే ఆశావహుల మధ్య జరిగిన బేరసారాల్లో డీల్ కుదరక అయోమయంలో పడినట్లు సమాచారం. ఇన్నాళ్లూ పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని ఒకరు.. ఎన్నికల్లో ఖర్చు చేయాలని ఇంకొకరు.. బేరసారాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా టికెట్‌లు అమ్మడం, కొనడం చేయడమే ఈజీగా ఉంటుందని ‘తమ్ముళ్ల’ మధ్య కొన్ని రోజులుగా సంభాషణ జోరుగా జరుగుతోంది. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. మరో వైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో తెలియని పరిస్థితి. పొత్తులో భాగంగా ధర్మవరాన్ని జనసేనకు కేటాయిస్తే తాను బరిలో ఉంటానని చిలకం మధుసూదన్‌రెడ్డి ఇప్పటికే ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు.
పోటీ చేయబోమంటూ..
ఎస్సీ రిజర్వుడు స్థానమైన మడకశిరలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన ఈరన్నను కాదని.. బీసీ వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. గుండుమల తిప్పేస్వామి సూచించిన వారికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకోలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈరన్న కూడా తనకు టికెట్ వద్దని.. ఎవరు పోటీ చేసినా తనకు సంబంధం లేదని అనుచరుల వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం. పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
స్పష్టత లేదాయె..
కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో కార్యకర్తలను కాపాడుకోవడంలో ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న నాయకులు విఫలం అవుతున్నారు. ఫలితంగా ఉన్న క్యాడర్ కూడా ఊడిపోయింది. చంద్రబాబు అరెస్టుతో ధర్నాలు, నిరసనలు తెలపాలన్న అధిష్టానం ఆదేశాలను ఈ రెండు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు బేఖాతరు చేశారు. నాయకులు తప్ప కార్యకర్తలు రాకపోవడంతో టీడీపీ నేతల బలం తేలిపోయింది. దీంతో టీడీపీలో సెకండ్ క్యాడర్‌లో ఉన్న నాయకులు కూడా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. టీడీపీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయం వారిని వెన్నాడుతోంది.
జత కట్టేదెవరితో?
వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే గెలవలేమని టీడీపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. దీంతో కాంగ్రెస్ లేదా, జనసేనతో జత కట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో ఆ పార్టీలకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏయే స్థానాలు కట్టబెడతారు? అనే దానిపై పలు సందేహాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్నవారు పార్టీ బలోపేతానికి ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించినా రోడ్డెక్కకుండా ఇంటికే పరిమితమితమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment