సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్రణాళికతో సన్నద్ధమైంది. త్వరలో ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రత్యేక యాప్ కూడా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్లు అందచేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పిస్తున్నారు.
ఇప్పటికే టెలి మెడిసిన్ సేవలు.. టాప్‌లో ఏపీ ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వైద్య ఆరోగ్య రంగంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం ఇప్పటికే రాష్ట్రంలో ఉంది. టెలీ మెడిసిన్ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందించేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా సచివాలయం యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను ప్రభుత్వం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు సుమారు రూ.3 కోట్లతో 2,300 ఫోన్లను అందచేస్తోంది. ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తై పంపిణీ కొనసాగుతోంది. ఒకవేళ వైద్యుడు మారినా ఫోన్ నంబర్ మారకుండా శాశ్వత నంబర్ కేటాయిస్తోంది.
విలేజ్ క్లినిక్స్‌లో వివరాలు..
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా పీహెచ్‌సీలో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని సచివాలయాలను విభజిస్తున్నారు. ప్రతి వైఎస్సార్ విలేజ్ క్లినిక్/సచివాలయంలో ఆ గ్రామానికి కేటాయించిన వైద్యుడి పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ప్రదర్శిస్తారు. గ్రామంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఫోన్ నంబర్ ద్వారా వైద్యుడిని సంప్రదించవచ్చు. తమ సమస్యను వివరించి సలహాలు, సూచనలు పొందవచ్చు. విలేజ్ క్లినిక్‌కు వెళ్లి వైద్యుడు సూచించిన మందులను తీసుకోవచ్చు. మరోవైపు స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సేవలు అవసరమైనవారు విలేజ్ క్లినిక్‌లో సంప్రదిస్తే టెలీ మెడిసిన్ ద్వారా ఆయా వైద్యులతో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) మాట్లాడిస్తారు.
ప్రత్యేక యాప్
ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం వైద్య శాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తోంది. సచివాలయాల వారీగా వలంటీర్ల క్లస్టర్ల ప్రాతిపదికన ప్రజల వివరాలను యాప్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (జీవన శైలి జబ్బులు) సర్వేలో భాగంగా వైద్య శాఖ ప్రజలను స్క్రీనింగ్ చేస్తోంది. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తోంది. ఆ వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానిస్తున్నారు.
యాప్‌లో వైద్యాధికారులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఎంఎల్‌హెచ్‌పీలు, సచివాలయ ఏఎన్‌ఎంలు.. ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా లాగిన్ ఉంటుంది. పీహెచ్‌సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు రోగి ఏ క్లస్టర్ పరిధిలో ఉంటారో చెబితే చాలు దాని ఆధారంగా ఎన్‌సీడీ సర్వేతో సహా సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఆరోగ్య సమస్య ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తారు.
ఆ వివరాలతో పాటు అవసరమైన మందులను కూడా యాప్‌లో నమోదు చేస్తారు. మందుల ప్రిస్క్రిప్షన్ ఎంఎల్‌హెచ్‌పీ లాగిన్‌కు వెళుతుంది. దాని ఆధారంగా రోగికి ఎంఎల్‌హెచ్‌పీ మందులను అందిస్తారు. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు తదితర వివరాలన్నీ సంబంధిత వ్యక్తి డిజిటల్ హెల్త్ ఐడీలో అప్‌లోడ్ చేస్తారు. ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే వైద్యుడే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేసే ఆప్షన్‌ను కూడా యాప్‌లో కల్పిస్తున్నారు.
ఇబ్బందులు ఎదురవకుండా..
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్‌సీ పరిధిలోని గ్రామ సచివాలయాలను ఇద్దరు వైద్యులకు విభజిస్తారు. రోజు మార్చి రోజు పీహెచ్‌సీ వైద్యుడు తనకు కేటాయించిన సచివాలయాలను సందర్శించాలి. వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో పాటు గ్రామాలకు వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే గ్రామంలో ఉండి వైద్యసేవలు అందిస్తారు.
ఈ నేపథ్యంలో వారికి సచివాలయాల్లోనే హాజరు నమోదుకు వీలు కల్పిస్తున్నారు. వైద్యుడితో పాటు ఏఎన్‌ఎంలు గ్రామంలో సేవలు అందించేలా ఉదయం 9 గంటలు, సాయంత్రం 4 గంటలకు బయోమెట్రిక్ నమోదు చేసుకునేలా పనివేళలు మార్పు చేయనున్నారు.
ప్రజలకు వైద్య సేవలు చేరువే లక్ష్యం
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రతి పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్ ఫోన్‌ను అందిస్తున్నాం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు వెళ్లలేనివారు వైద్యుడికి ఫోన్ చేయవచ్చు. గ్రామాల్లో పాము కాట్లు, గర్భిణులకు పురిటి నొప్పులు తదితర సందర్భాల్లో 108 అంబులెన్స్ చేరుకునేలోపు పీహెచ్‌సీ వైద్యుడిని ఫోన్ ద్వారా సంప్రదిస్తే ప్రాథమిక చికిత్స చర్యలను సూచిస్తారు. తద్వారా బాధితుల విలువైన ప్రాణాలను కాపాడవచ్చు.
– విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
మెరుగైన సేవల కోసమే..
ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మెరుగైన సేవలందించేలా ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నాం. చికిత్స, వైద్య పరీక్షలు, సూచించిన మందులు ఇలా అన్ని వివరాలను వ్యక్తిగత డిజిటల్ హెల్త్ ఐడీల్లో నిక్షిప్తం చేస్తాం. బయోమెట్రిక్ ద్వారా సంబంధిత వ్యక్తి అంగీకారంతో అప్‌లోడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రయోగాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చే ఏడాది జనవరిలో పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ అమలుకు ప్రణాళిక రూపొందించాం. వైద్యులకు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరుకు వీలు కల్పించడంతో పాటు ఏఎన్‌ఎంల హాజరు వేళల్లో మార్పుపై సచివాలయాల శాఖకు లేఖ రాశాం.
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
ప్రజలకు ఎంతో మేలు..
పీహెచ్‌సీ వైద్యులకు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ల పంపిణీ, శాశ్వత ఫోన్ నంబర్ కేటాయింపు ప్రజలకు ఎంతో ఉపయోగకరం. అత్యవసర సమయాల్లో పీహెచ్‌సీ వైద్యుడికి ఫోన్ చేసి ఏం చేయాలో తెలుసుకోవచ్చు. వైద్యులు బదిలీపై వేరే చోటకు వెళ్లినా ఫోన్ నంబర్లు మారవు.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, జీజీహెచ్ కర్నూలు
నిరంతర ఫాలోఅప్..
మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలున్న వారి ఆరోగ్యం గురించి నిరంతరం వాకబు చేసేందుకు యాప్‌లో మరో ఆప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కోమార్బిడిటీస్ (దీర్ఘకాలిక జబ్బులు) బాధితుల వివరాలు సచివాలయాల వారీగా ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో ఉంటాయి. పీహెచ్‌సీ వైద్యుడు గ్రామానికి వెళ్లినప్పుడు యాప్‌లో నమోదైన వివరాలను పరిశీలించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు.
అనారోగ్య సమస్యలతో శిశువు జన్మిస్తే వెంటనే నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స అందిస్తారు. ఆ వివరాలు కూడా యాప్‌లో నమోదు చేస్తారు. గర్భిణులు, బాలింతలకు చెకప్‌లు, విద్యార్థుల ఆరోగ్యం.. ఇతర అంశాలనూ యాప్ పరిధిలోకి తెస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment