‘ఫ్యామిలీ డాక్టర్‌’తో పల్లెకు రక్ష | Primary medical services in Andhra Pradesh Villages Family Doctor | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ డాక్టర్‌’తో పల్లెకు రక్ష

Published Sun, Aug 27 2023 4:23 AM | Last Updated on Sun, Aug 27 2023 10:52 AM

Primary medical services in Andhra Pradesh Villages Family Doctor - Sakshi

(పమిడివారిపాలెం, పెదపాలెం, కాకుమాను గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్‌): ‘ఏం తాత.. ఆరోగ్యం ఎలా ఉంది? మందు బిళ్లలు సమయానికి వేసుకుంటున్నావా?’ అని డాక్టర్‌ అడిగితే.. ‘ఆరోగ్యం బాగానే ఉంది’ అనేలా రెండు చేతులు కదిలిస్తూ సైగల ద్వారా ఆరి నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న నాగేశ్వరరావు భార్య విమల మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినట్టే మాత్రలు సమయానికి వేస్తున్నాం. రోజులో 3 సార్లు పడుకునే స్థితి (పొజిషన్‌)లో మార్పులు చేస్తున్నాం’ అని వివరించింది. 

గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు రెండేళ్లుగా ఆర్థో, న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. వీటికి తోడు బీపీ సమస్య కూడా ఉంది. వయోభారం, అనారో­గ్య సమస్యల రీత్యా మంచానికి పరిమితం అ­య్యాడు. దీంతో క్రమం తప్పకుండా వైద్య పరీ­క్షలు చే­యించుకుని, మందులు తీసుకోవడం కోసం వై­ద్యుడి వద్దకు నాగేశ్వరరావు వెళ్లాలంటే ఈ కుటుం­­బానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంటికి కిలోమీటర్‌కు పైగానే దూరంలో ఉన్న పీహెచ్‌సీకి వెళ్లడానికి ప్రత్యేకంగా ఓ ఆటో మాట్లాడుకోవాలి.

రాను పోను సుమారు రూ.300 అవుతుంది. కదల్లేని స్థితిలో ఉన్న నాగేశ్వరరావును ఆటో ఎక్కించి, ఆస్పత్రిలో చూపించుకునిగి మళ్లీ ఇంటికి చేర్చాలంటే ఇద్దరు వ్యక్తులు కచ్చితంగా తోడుండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానంలో ఈ వ్యయ ప్రయాసలు ఏమీ లేకుండా కాకుమాను పీహెచ్‌సీ డాక్టర్‌.. వృద్ధుడైన నాగేశ్వరావు ఇంటికి క్రమం తప్పకుండా వస్తున్నాడు. బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొలె్రస్టాల్, రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించే మాత్రలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో నాగేశ్వరావు భార్య విమల మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఆయన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆ రోజు మా పిల్లలు పనులు వదులుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. డాక్టరే మా ఇంటికి వస్తున్నారు. మా ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటోంది. నెల నెలా వలంటీర్‌ ఇంటికే వచ్చి పెన్షన్‌ కూడా ఇచ్చి వెళుతున్నారు.

గతంలో ఆయన కిందపడి కాలు విరిగినప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించి ఆదుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానంపై ‘సాక్షి’ గుంటూరు జిల్లాలోని పొన్నూరు, పెదకాకాని, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించగా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది.  

గుంటూరుకు వెళ్లే బాధ తప్పింది.. 
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామానికి చెందిన కావూరి శేషగిరిరావుకు 90 ఏళ్లు. ఆయన సతీమణి వెంకాయమ్మకు 70 ఏళ్లుపైనే ఉంటాయి. పిల్లలందరూ వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. వృద్ధులు ఇద్దరే ఉంటారు. వయో భారానికి తోడు శేషగిరిరావుకు బీపీ, షుగర్‌ ఉన్నాయి. వెంకాయమ్మ గుండెకు కొన్నేళ్ల క్రితం స్టెంట్‌ వేశారు. దీంతో వీరిద్దరూ క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లి చెకప్‌ చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి. ప్రతి నెలా గుంటూరులోని మిలటరీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని వీరి ఇంటికి వైద్యుడు వచ్చి మందులు ఇచ్చారు. ఈ మందులను తీసుకెళ్లి గుంటూరు మిలటరీ ఆస్పత్రిలో చూపిస్తే తామిచ్చే మందులు కూడా అవే అన్నారు. దీంతో వెంకాయమ్మ దంపతులు గుంటూరుకు వెళ్లడం మానేశారు. క్రమం తప్పకుండా ఫ్యామిలీ డాక్టర్‌ వీరి ఇంటికి వెళుతున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. ‘ఒకప్పుడు గుంటూరు మిలటరీ ఆస్పత్రికి పోయి రావడానికి రోజంతా సరిపోయేది.

బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గరకే డాక్టర్‌ వస్తుండటం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎందరికో చాలా మంచి చేస్తోంది’ అని వెంకాయమ్మ అభిప్రాయపడింది. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం వల్ల వృద్ధులు, వ్యాధిగ్రస్తులున్న ఊరు, ఇంటి వద్దకే వెద్యులు వచ్చి సేవలు అందిస్తూ, ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్‌ పుణ్యమా అని ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  
 
వ్యయ, ప్రయాసలకు ఫుల్‌స్టాప్‌ 
పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉంటారు. వీరిలో 170 మందికి పైగా బీపీ, షుగర్‌తో బాధ పడుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 కి.మీ దూరంలో ఉండే పెదనందిపాడు పీహెచ్‌సీ, 20 కి.మీకు పైగా దూరంలో ఉండే ప్రత్తిపాడు సీహెచ్‌సీ, పొన్నూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. ఇంట్లో మోటార్‌ సైకిల్‌ ఉంటే పర్వాలేదు. లేదంటే ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సిందే. ఒకసారి ఆటోలో ఆస్పత్రికి పోయి రావాలంటే రూ.500 పైనే ఖర్చవుతుంది.

ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్‌ వల్ల ఈ వ్యయ, ప్రయాసలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఈ విధానంలో పెదనందిపాడు పీహెచ్‌సీ డాక్టర్‌ ప్రతి నెలా క్రమం తప్పకుండా నాలుగో శుక్రవారం గ్రామానికి వస్తున్నారు. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. మరోవైపు పక్కనే మూడు కి.మీ దూరంలో ఉన్న పుసులూరు గ్రామంలో ప్రభుత్వం వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 
 
తొలగిన ఆర్థిక భారం.. ఇబ్బందులు..  
ఫ్యామిలీ డాక్టర్‌తో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి రావడానికి అయ్యే రవాణా వ్యయం రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరి్థక భారం, ఇతర ఇబ్బందులకు విముక్తి లభించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 105 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి.

టెలీ మెడిసిన్‌ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తోంది. పీహెచ్‌సీ డాక్టర్‌ ప్రతి నెలా గ్రామాలకే వెళుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్‌ పేషెంట్‌(ఓపీ) క్లినిక్‌ నిర్వహించి, ఆ తర్వాత మంచానికి పరిమితం అయిన వారికి వైద్య సేవలు అందించడానికి గృహాలు సందర్శిస్తున్నారు  అదే విధంగా అంగన్‌వాడీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.   
 
ఇప్పటి వరకు 2.04 కోట్ల మందికి వైద్యం 
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌రన్‌ గత ఏడాది అక్టోబర్‌ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చింది. కాగా గత ఏడాది అక్టోబర్‌ 21 నుంచి ఇప్పటి వరకు పీహెచ్‌సీ వైద్యులు 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ పరిధిలో 1,82,459 సార్లు సందర్శించారు. 2,10,75,065 మందికి వైద్య సేవలు అందించారు.  
 
‘ఫ్యామిలీ డాక్టర్‌’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు 
► జనరల్‌ అవుట్‌ పేషెంట్‌ సేవలు 
► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్‌ 
► గర్భిణులకు యాంటినేటల్‌ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్‌ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు 
► రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు 
► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం 
► పాలియేటివ్‌ కేర్‌ 
► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌ నిర్ధారణ 
 
ఇవీ 14 రకాల వైద్య పరీక్షలు  
► గర్భం నిర్ధారణకు యూరిన్‌ టెస్ట్‌ 
► హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ 
► ర్యాండమ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌ (షుగర్‌) 
► మలేరియా టెస్ట్‌ 
► హెచ్‌ఐవీ నిర్ధారణ 
► డెంగ్యూ టెస్ట్‌ 
► మలీ్టపారా యూరిన్‌ స్ట్రిప్స్‌ (డిప్‌ స్టిక్‌) 
► అయోడిన్‌ టెస్ట్‌ 
► వాటర్‌ టెస్టింగ్‌ 
► హెపటైటిస్‌ బి నిర్ధారణ 
► ఫైలేరియాసిస్‌ టెస్ట్‌ 
► సిఫ్లిస్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ 
► విజువల్‌ ఇన్‌స్పెక్షన్‌ 
► స్పుటమ్‌ (ఏఎఫ్‌బీ) 
 
‘ఫ్యామిలీ డాక్టర్‌’ కోసం ప్రభుత్వ చర్యలు ఇలా..  
► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్‌సీలకు అదనంగా 88 కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రతి పీహెచ్‌సీలో తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన భవనాలు నిర్మాణంలో ఉంటుండగానే కార్యక్రమం అమలు కోసం వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. 

► మరోవైపు మండలంలో ఒక పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉన్న చోట 63 చోట్ల వైద్యులను నియమించి వారిని సీహెచ్‌సీలో కో లొకేట్‌ చేసి సేవలు అందిస్తున్నారు. ఎవరైనా వైద్యులు సెలవు పెడితే కార్యక్రమానికి ఇబ్బంది రాకుండా పూల్‌ అప్‌ వైద్యులను అందుబాటులో ఉంచారు.  

► 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ)తో పాటు వైద్యులు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను నెలలో రెండుసార్లు సందర్శించడానికి వీలుగా అప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా 260 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.  

► అన్ని విలేజ్‌ క్లినిక్స్‌లో 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు.  

► ఎన్‌సీడీ సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్‌ చేపట్టింది. వీరిలో గుర్తించిన బీపీ, షుగర్, ఇతర సమస్యల బాధితులను ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానించారు. వారికి నిరంతర ఫాలో అప్‌ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.    

పెద్ద సమస్య అయితే తప్ప ఊరు దాటం  
15 ఏళ్లుగా బీపీ, షుగర్‌ సమస్యలున్నాయి. గతంలో రెగ్యులర్‌ చెకప్‌ కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేవాడిని. ప్రతి నెలా వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండేది. కొన్ని సందర్భాల్లో చెకప్‌కు వెళ్లడం మానేసి మందులు మాత్రం వాడేవాన్ని. అలా నిర్లక్ష్యం చేయడంతో కొన్నిసార్లు ఇబ్బంది అయింది. ప్రభుత్వం కొద్ది నెలల నుంచి డాక్టర్‌ను గ్రామానికే పంపుతోంది. దీంతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. డాక్టర్‌ గ్రామానికి వచ్చే ముందు రోజు మైక్‌లో ప్రకటిస్తారు. ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయితేనే మా ఊరి వాళ్లు పొన్నూరు, గుంటూరు వెళుతున్నారు.  
– పారి జలందర్, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా 
 
చాలా ఆనందంగా ఉంది 
రెండేళ్లుగా బీపీ సమస్య ఉంది. దీంతో మందులు వాడుతూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్‌ చెప్పారు. మా ఊళ్లోనే ప్రభుత్వం విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేసింది. ఇక్కడే పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. పొన్నూరు నుంచి ప్రభుత్వ డాక్టర్‌ కూడా క్లినిక్‌కు వస్తారు. ముందు రోజు ఆశ, ఏఎన్‌ఎం సమాచారం ఇస్తారు. బీపీ స్థాయిని బట్టి డాక్టర్‌లు మందులు ఇస్తున్నారు. మందులు బాగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను తేకపోయినట్లైతే పొన్నూరుకు పోవాల్సి వచ్చేది. దీంతో రాను, పోను ఆటో చార్జీల రూపంలో అదనపు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు.  
– రత్నకుమారి, పెదపాలెం, గుంటూరు జిల్లా 
 
చాలా మంచి పని చేశారు 
రెండేళ్ల నుంచి బీపీ, షుగర్‌తో బాధ పడుతున్నాను. నెలనెలా చెకప్‌లు చేయించుకోవాలి. రోజూ మందులు వేసుకోవాలి. వైద్యం కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేదాన్ని. నన్ను చెకప్‌కు తీసుకుని వెళ్లడానికి మా ఇంట్లో ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఊర్లోనే మందులు ఇస్తున్నారు. టెస్ట్‌లు చేస్తున్నారు. డాక్టర్‌ కూడా మా ఊరికే వస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఈ విధానం లేకుంటే మా ఇబ్బందులు వర్ణాతీతం. 
– ముప్పలనేని సుబ్బాయమ్మ, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా 
 
మంచి కార్యక్రమం 
మన దేశంలో ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఏఎన్‌ఎం, ఆశ, ఎంఎల్‌హెచ్‌పీ వ్యవస్థ మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలోనే వైద్యులు నేరుగా ప్రజలకు సంరక్షణ అందించే వ్యవస్థ లేదు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా డాక్టర్‌లను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించడం మంచి నిర్ణయం. ప్రజారోగ్య వ్యవస్థలో ప్రాథమిక వైద్య సేవలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ఆ దశలోనే రోగికి సరైన వైద్య సేవలు అందించడం కీలకం.

ఈ నేపథ్యంలో వైద్యులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకం అవ్వడంతో చాలా వరకు జబ్బులు, సమస్యలు ప్రారంభ దశలోనే బయటపడతాయి. దీనికి తోడు బీపీ, షుగర్, ఇతర నాన్‌ కమ్యూనికబుల్‌ డిసిజెస్‌తో బాధపడే వారికి నిరంతర ఫాలోఅప్‌ సేవలు అందుతాయి. తద్వారా భవిష్యత్‌లో వారు గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత పెద్ద జబ్బులు ఎదుర్కోకుండా కాపాడటానికి వీలుంటుంది. ప్రజలపై ఆరి్థక భారం పడదు.   
– డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు 
 
ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటున్నాం 
ఫ్యామిలీ డాక్టర్‌ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలను తెలుసుకుంటున్నాం. ఇందుకోసం బోధనాస్పత్రుల్లోని ఎస్పీఎం విభాగాన్ని కార్యక్రమంలో భాగస్వామిని చేశాం. ప్రతి జిల్లాలో ర్యాండమ్‌గా ఒకటి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు పొందిన వారి నుంచి వైద్య విద్యార్థులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సేవలు పొందిన వారిలో అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌కు కారణాలు అన్వేషించి, పరిష్కరిస్తున్నాం.  
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement