సాక్షి, అమరావతి: ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ), లెప్రసీ, థైరాయిడ్ సహా పలు వ్యాధులతో బాధపడేవారు మందుల కోసం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల కోసం వెళ్లాల్సిన తిప్పలు తప్పనున్నాయి. ఈ తరహా వ్యాధులకు వాడే మందులను ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోనే అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులో ఉండే మందుల రకాలను 67 నుంచి 105కు పెంచింది. పెంచిన రకాల మందులను అన్ని విలేజ్ క్లినిక్స్‌కు పంపిణీ చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామీణులకు వైద్యసేవలను మరింత చేరువ చేస్తూ 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో 10,032 విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)ను ప్రతి క్లినిక్‌లో నియమించారు. ఈ క్లినిక్స్ ద్వారా గ్రామాల్లోనే 12 రకాల వైద్య, 14 రకాల నిర్ధారణ పరీక్షలను అందబాటులోకి తెచ్చారు. టెలీమెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, పీహెచ్‌సీ వైద్యుడి కన్సల్టేషన్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో రోజుకు సగటున ఒక్కో క్లినిక్‌లో 20 నుంచి 30 ఓపీలు నమోదవుతున్నాయి.
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా
పల్లె ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానంలో ప్రతి విలేజ్ క్లినిక్‌ను నెలలో రెండుసార్లు పీహెచ్‌సీ వైద్యులు సందర్శిస్తున్నారు. రోజంతా ఆ గ్రామంలో ఉండి ఓపీలు నిర్వహించడంతో పాటు, మంచానికే పరిమితమైన వారికి కూడా వైద్యం చేస్తున్నారు.
చదవండి: జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు
దీంతోపాటు మిగిలిన రోజుల్లో టెలీమెడిసిన్ కన్సల్టేషన్‌లో వైద్యులు వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలున్న వారికి మందులను ప్రిస్క్రెబ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల మందులు క్లినిక్స్‌లో అందుబాటులో లేకపోతే బాధితులు ప్రత్యేకంగా మందుల కోసం 5–10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీ, అంతకంటే దూరంలో ఉండే ఏపీవీవీపీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టడానికి విలేజ్ క్లినిక్స్‌లోనే అదనంగా 38 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment