ఆరోగ్యశ్రీ కింద చికిత్స అనంతరం పేషెంట్‌కు ఇంకా అదనంగా మెడికేషన్ అవసరమైన పక్షంలో సంబంధిత వైద్యాధికారితో ఏఎన్‌ఎం మాట్లాడాలి. తగిన చికిత్స అందించేలా చూడాలి. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల వివరాలను విలేజ్ హెల్త్ క్లినిక్, సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ఇందుకు సంబంధించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో హోర్డింగ్ పెట్టాలి. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వెంటనే సమీపంలో ఎంప్యానెల్ ఆస్పత్రి ఎక్కడుందో వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న వాటిలో కూడా ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి టీచింగ్ ఆస్పత్రి కేన్సర్ కేర్ అండ్ ట్రీట్‌మెంట్‌కు సెంటర్ కావాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో ఇదివరకే ఉన్న క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయడంతో పాటు, లేని వాటిలో సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 4 లైనాక్ మెషీన్లు (రేడియేషన్ ఇచ్చే యంత్రాలు) ఏర్పాటు చేయడానికి.. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లో లైనార్ బంకర్ల (వైద్య అవసరాలు తీర్చే గది.. ఉదా: హై ఎనర్జీ – ఎక్స్‌రే) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో 7 పాత మెడికల్ కాలేజీల్లో కేన్సర్ శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ల అప్‌గ్రేడేషన్, పాథాలజీ డిపార్ట్‌మెంట్లలో ఆధునిక సౌకర్యాలు, కీమో థెరపీ, డ్రగ్స్ తదితర సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి టీచింగ్ ఆస్పత్రి ఆ జిల్లాకు సంబంధించిన వైద్య కార్యకలాపాలకు సెంటర్‌గా వ్యవహరించాలని, విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఆస్పత్రి కూడా బోధనాస్పత్రి పరిధిలోకి రావాలన్నారు. దీనివల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులను గుర్తించి, వైద్యం అందించడం సులభతరమవుతుందని చెప్పారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 12 రకాల రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
విలేజ్ క్లినిక్స్ విధివిధానాల్లో పారిశుధ్యం, తాగునీటి నాణ్యతపై నిరంతర పరిశీలన ఉండాలని, ప్రతి నెలా తప్పనిసరిగా నివేదికలు పంపాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్
రక్తహీనత కేసులు ఉండకూడదు
► చిన్నారులు, మహిళల్లో రక్తహీనత నివారణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రక్తహీనత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనంగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
► వైద్యాధికారుల సిఫార్సు మేరకు వైద్య పరంగా, ఆహార పరంగా వారిపై దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్రంలో రక్తహీనత కేసులు రాకుండా చూడాలి. వ్యవసాయానికి ఆర్బీకేలు ఎలా అండగా నిలుస్తున్నాయో ప్రజారోగ్యం విషయంలో విలేజ్ క్లినిక్‌లు కూడా అలాగే కీలక పాత్ర పోషించాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం అనుకున్న రీతిలో పూర్తి చేయాలి.
► స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ జరగాలి. పిల్లల ఆరోగ్య పరిస్థితులను కనుక్కోవడంతోపాటు నిరంతరం కంటి పరీక్షలు చేయాలి.
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ఇందుకు సంబంధించి వెంటనే నియామకాలు పూర్తి చేయాలి. (అక్టోబర్ 15లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు) సదుపాయాలను మెరుగు పరచాలి. అప్పుడే ప్రజలు ప్రభుత్వాస్పత్రుల సేవలను మెరుగ్గా వినియోగించుకుంటారు.
► ఆరోగ్య శ్రీ కింద అక్టోబర్ 2 నాటికి మొత్తం 3,118 వైద్య ప్రక్రియలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి.
‘నాడు–నేడు’పై ప్రతివారం సమీక్ష
► రాష్ట్రంలో చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాల పురోగతితో పాటు ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో నాడు–నేడు పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రతివారం సమీక్ష చేయడంతో పాటు నిర్దేశించుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి.
► ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్‌మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య శ్రీ మరింత పటిష్టం
‘ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు వర్చువల్ అకౌంట్లు క్రియేట్ చేశాం. ఈ అకౌంట్ల ద్వారా ఆరోగ్య శ్రీ డబ్బు నేరుగా ఆస్పత్రులకు వెళ్తుంది. డబ్బులు డిడక్ట్ అవగానే పేషెంట్ సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. రోగులు డిశ్చార్జి అయ్యేటప్పుడు వారికి అందిన వైద్య సేవలపై కన్సెంట్ లెటర్ కూడా తీసుకుంటున్నాం. లంచాలు లాంటి ఘటనలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఏసీబీ 14400 నంబర్ పెట్టాం.
పేషెంట్ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఏఎన్‌ఎం వారి ఇంటికి వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఆరోగ్య పరిస్థితులపై, అందిన వైద్య సేవలపై, ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రల పనితీరుపై అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్ చేస్తారు’ అని అధికారులు సీఎంకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment