సాక్షి, అమరావతి: ఎంత ఖరీదైన వైద్యం అయినా సరే పేదలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, కాలేయ మార్పిడి వంటి అత్యాధునిక, ఖరీదైన వైద్యం కూడా వర్తింప చేయాలని చెప్పారు. ఆ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రులను గుర్తించి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అమలు తీరు తెన్నులపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.వెయ్యి ఖర్చు దాటే వైద్యం ప్రతి నిరుపేదకు ఉచితంగా అందించే దిశగా అడుగులు వేయడమే మన ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రులు సహా ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో ఉన్న ప్రతి ఆస్పత్రి పూర్తి ప్రమాణాలు పాటించాలని, ఎన్‌ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్) గుర్తింపు పొందాలన్నారు. ఆరోగ్యశ్రీకి గ్రామాల్లో ఏఎన్‌ఎంలు రిఫరల్ పాయింట్ అని, అందువల్ల వారికి తగిన శిక్షణ ఇచ్చి.. వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. ట్యాబ్‌ల వినియోగంపై కూడా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే రోగి దగ్గర వివరాలు తీసుకుని, టెలి మెడిసిన్ ద్వారా వైద్య నిపుణులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్‌కు సంబంధించి టెలి మెడిసిన్ కొనసాగుతోందని, అదే విధంగా ఇతర వ్యాధులకు కూడా ఆ సదుపాయాన్ని విస్తరించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ బలోపేతం
► టెలీ మెడిసిన్ కాల్ సెంటర్‌ను ఇంకా బలోపేతం చేయాలి. రోగులు, ఏఎన్‌ఎంలు ఫోన్ చేస్తే వెంటనే అటెండ్ చేసే విధంగా రోజంతా వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలి. రోగి నంబర్ నుంచి మిస్డ్ కాల్ రాగానే 5 నిమిషాల్లోపు కచ్చితంగా వారికి ఫోన్ వెళ్లాలి.
► అన్ని చోట్ల ‘టు వే’ ఇంటరాక్షన్ సదుపాయం ఉండాలి. అందుకు అవసరమైన నెట్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. అలా ఉంటే రోగిని టెలీ మెడిసిన్ సెంటర్‌లో ఉండే వైద్యుడికి నేరుగా చూపించి, వెంటనే వైద్య సహాయం అందివ్వచ్చు.
► రోగులకు మంచి ఆహారం, డిశ్చార్జ్ తర్వాత రవాణా సదుపాయం, ఆరోగ్య ఆసరా.. ఈ మూడు ఆరోగ్యశ్రీ పథకం ప్యానెల్‌లో ఉన్న ఆస్పత్రులలో (ప్రభుత్వ ఆస్పత్రులు సహా) పక్కాగా అమలు కావాలి. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్ర (హెల్ప్ డెస్క్)లు రోగులకు పూర్తి స్థాయిలో సేవలందించాలి.
ఆరోగ్యశ్రీపై అధికారుల ప్రజెంటేషన్
► రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఇప్పటి వరకు 1.35 కోట్ల స్మార్ట్ హెల్త్ కార్డులు (క్యూఆర్ కోడ్‌తో సహా) జారీ చేశామని తెలిపారు.
► ఆరోగ్యశ్రీ పథకంలో హైదరాబాద్‌లో 77, బెంగళూరులో 26, చెన్నైలో 27 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను గుర్తించామని, వాటిలో 716 చికిత్సలు అందుతున్నాయని చెప్పారు.
► సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఖరీదైన వైద్యానికీ ఆరోగ్యశ్రీ వర్తింపు
Published Wed, Nov 11 2020 2:28 AM | Last Updated on Wed, Nov 11 2020 10:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment