సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన మ్యాన్యువల్‌ను విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రి రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు తోడ్పడతాయని పేర్కొంది.
రాష్ట్రంలో అక్కడక్కడా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, ఇటీవల మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు ఇన్ఫెక్షన్‌కు గురై మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, రోగుల చికిత్సలకు ఉపయోగించే పరికరాలను స్టెరిలైజ్ చేయడం, పీపీఈ కిట్లు వాడటం, లాండ్రీ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి చేయడం వంటివి చేపట్టాలని మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ముఖ్యమైన మార్గదర్శకాలు...
►రోగుల మూత్ర నమూనాలు, ఆసుపత్రుల్లోని నీటి నమూనాలు, వెంటిలేటర్లపై ఉన్న రోగుల మందుల నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబ్‌లో పరీక్షించి వాటి ఫలితాలపై ఆసుపత్రి అంటువ్యాధుల నియంత్రణ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
►రోగులకు అందించే ఆహారాన్ని ప్రతి 4 నెలలకోసారి పరీక్షించాలి.
►తాగునీటిలో ఉండే బ్యాక్టీరియాపై నెలవారీ నిఘా చేపట్టాలి. పేషెంట్ కేర్ యూనిట్లు, హాస్పిటల్ కిచెన్, క్యాంటీన్లు, హాస్టళ్ల నుంచి ల్యాబ్‌లో ప్రతి నెలా ఒకసారి తాగునీటి పరీక్ష నిర్వహించాలి.
►వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులకు చేతి శుభ్రత శిక్షణా కార్యక్రమాన్ని నెలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలి.
►బయో వ్యర్థాల నిర్వహణ, పారబోత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. సెంట్రల్ స్టోరేజీ ఏరియాలో బయోమెడికల్ వ్యర్థాలను నిల్వ చేయడానికి సురక్షితమైన, వెంటిలేషన్ ఉన్న ప్రాంతం కేటాయించాలి. ఆయా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి.
►అంటువ్యాధుల తీవ్రత ఉన్నప్పుడు రోగులు, సిబ్బంది, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి.
►అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్న సమయంలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలి.
►ఒకేసారి అవుట్‌బ్రేక్ జరిగితే వ్యాప్తిని గుర్తించి ప్రమాదంలో ఉన్నవారెవరో తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment