గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన. ఈ పథకం కింద ప్రతి మహిళ మొదటి కాన్పుకు రూ.6వేలు ఇస్తారు. అయితే, వివిధ కారణాలతో గర్భిణుల నమోదు జిల్లాలో నామమాత్రంగా జరుగుతోంది. దీనికితోడు పీఎంఎంవీవై పథకం గురించి చాలా మంది మెడికల్ ఆఫీసర్లకే సరైన అవగాహన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్నూలు(హాస్పిటల్): ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం కర్నూలు జిల్లాలో రెండు నెలల నుంచి అమలవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్ష చేయించుకున్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. అది కూడా మొదటి కాన్పుకు మాత్రమే. మహిళ గర్భం దాల్చాక ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షకు వెళ్లిన మొదటిసారి రూ. 1000 ఇస్తారు. ఆ తర్వాత ఆరు నెలలకు పరీక్షకు వెళ్లిన సమయంలో మరో రూ.2వేలు ఇస్తారు. ప్రసవం అయ్యాక రూ.1000 శిశువుకు 6, 10, 14వారాల వ్యాక్సిన్ పూర్తయిన తర్వాత మిగిలిన రూ.2వేలు అందజేస్తారు. గర్భిణికి పోషకాహారం అందించి మాతాశిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందజేస్తోంది.
రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు
జిల్లాలో గత నెల వరకు ఈ పథకం కింద 17శాతం మంది గర్భిణులు మాత్రమే నమోదు అయ్యారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ ఒత్తిడి పెంచాక ఆ మొత్తం 30 శాతం దాటింది. పరీక్ష నిమిత్తం ఆసుపత్రికే వచ్చే గర్భిణులు ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ల వివరాలను తీసుకురాకపోవడం, తెచ్చినా అందులో తప్పులు ఉండటం, ఆధార్‌కు, బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉత్పన్నమ వుతున్నాయి. దీనికితోడు ఇప్పటి వరకు ఈ పథకం ఒకటుందని చాలా మంది మెడికల్ ఆఫీసర్లకే అవగాహన లేకపోవడం.. సర్వర్ సమస్య వేధిస్తున్నాయి. దీంతో రోజుకు ఒక్కో పీహెచ్‌సీల్లో నలుగురు గర్భిణుల వివరాలు మించి నమోదు చేయలేకపోతున్నారు. నమోదు బాధ్యతను ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మెడికల్ ఆఫీసర్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చిన ఎవ్వరైనా నమోదుచేయవచ్చు. కానీ చాలా చోట్ల వీటి నమోదు నామమాత్రంగా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ ఉద్యోగుల ఆవేదన
‘అయ్యా డీపీఎంఓ ఆఫ్ డీపీఎంయూ(ఎన్‌ఆర్‌హెచ్ సెక్షన్) గారూ.. పీఎంఎంవీవై అప్లికేషన్స్ అప్‌లోడింగ్ విషయంలో మీరు హైరానా పడిపోతూ పీహెచ్‌సీలను కంగారు పెట్టిస్తున్నారు. సీఎఫ్‌డబ్ల్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీఎం సమీక్ష ఉందంటూ ఏడాదికి సంబంధించిన మొత్త్తం లబ్ధిదారుల వివరాలన్నీ ఒక్కసారిగా అప్‌లోడ్ అయిపోవాలంటే పనవ్వదు. డీఈఓలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ల ముందు కూర్చున్నా సర్వర్ సమస్యతో నాలుగైదు దరఖాస్తులకు మించి అప్‌లోడ్ కావడం లేదు. మిమ్మలను ఎవరైతే కంగారు పెడుతున్నారో ముందు సర్వర్ కెపాసిటీ పెంచాలని చెప్పండి. ఈ సమస్య పరిష్కరించకుండా మాపై ఒత్తిడి పెంచడం న్యాయమా’..? అని ఉద్యోగులు అడుగుతున్నారు. ఈ మొర వాట్సాప్ గ్రూపుల్లో సైతం చక్కర్లు కొడుతోంది.
గర్భిణుల రిజిస్ట్రేషన్ పెరిగింది
ఆధార్, బ్యాంకు ఖాతాల్లో సమస్యలు ఉండటంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ సమస్య ఏర్పడింది. వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్‌ను వేగంగా చేస్తున్నాము. వారం క్రితం 17 శాతం ఉన్న రిజిస్ట్రేషన్ శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. మొత్తం గర్భిణులకు రూ.18,93,000 లను పంపిణీ చేశాము. –డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment