కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలైన ‘జమిలి ఎన్నికల’ చర్చ మళ్లీ తెరపైకొచ్చింది. ఈసారి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ప్రస్తావన చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్‌డీఏ భాగ స్వామ్యపక్షాల సమావేశంలో కూడా దీనిపై మాట్లాడారు. నిజానికి ఈ ప్రతిపాద నను చాన్నాళ్లక్రితమే బీజేపీ తీసుకొచ్చింది. ఏకకాలంలో ఎన్నికలు అవసరమంటూ 2012లో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ రెండేళ్లక్రితం ఈ అంశాన్ని మరోసారి ఎజెండా లోకి తెచ్చారు.
ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు అనే ప్రతిపాదనను సమర్థించే పార్టీలు, నాయకులూ ఉన్నట్టే వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. దీనికి అనుకూలంగా మాట్లాడేవారి వాదనల్లోని అంశాలే రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఉన్నాయి. తరచు ఎన్నికల వల్ల ఖజానాపై భారం పడటం, మానవ వనరులను వాటిపై కేంద్రీ కరించాల్సి రావడం, ప్రతి ఎన్నికలకూ అమల్లోకొచ్చే నియమావళి కారణంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడటం ఇందులో ముఖ్యమైనవి. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుండగా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి.
మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధి వేర్వేరు రకాలుగా ఉంటున్నది. 2016లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు జరిగాయి. నిరుడు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్, గుజ రాత్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో త్రిపుర, మేఘాలయ, నాగా లాండ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటి తర్వాత కర్ణాటక, మిజోరం ఎన్నికలుం టాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలొస్తాయి. ఆ వెంటే లోక్‌సభ ఎన్నికలుంటాయి. ఇలా ఎన్నికలు జరిగినప్పుడల్లా లక్షలాదిమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది అవసరం ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీ సులనూ, పారా మిలిటరీ దళాలనూ తరలించాల్సి వస్తుంది. ఈ ఏర్పాట్లన్నిటికీ భారీ మొత్తం వ్యయమవుతుంది.
ఒకేసారి ఎన్నికల వల్ల మన ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుందని, జాతీయ అంశాలు ప్రాంతీయ ఆకాంక్షలను మింగేస్తాయని జమిలి ఎన్నికల వ్యతిరేకులు చెబుతారు. ఈ వాదనలో వాస్తవం ఉంది. అలాగే ఒకేసారి ఎన్నికలవల్ల ఓటర్లు ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ ఉన్నాయని ఎన్నికల ఫలితాలను విశ్లే షించే నిపుణులు తేల్చిచెప్పారు. పైపెచ్చు వేర్వేరు ఎన్నికల వల్ల పాలకుల్లో జవా బుదారీతనం పెరుగుతుంది. త్వరలోనే మళ్లీ జనం ముందుకు వెళ్లకతప్పదన్న స్పృహ ఉంటే ఇష్టారాజ్యం చేసే అవకాశాలు తక్కువ. జనం నెత్తిన పెనుభారం పడే విధానాల అమలుకు సాహసించరు. నియమావళి వల్ల పాలన కుంటుపడుతుం దన్న వాదనలో పసలేదు. అత్యవసరమైనవాటికి ఎన్నికల సంఘం మినహాయింపు ఇస్తూనే ఉంది. పాలకులే ప్రతి ఎన్నికనూ ప్రతిష్టగా భావిస్తూ హడావుడి చేస్తు న్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని దగ్గరనుంచి ముఖ్యనేతలు తరలిరావడం, ఉప ఎన్నికలు జరిగేచోట సీఎంలు తమ కేబినెట్‌లను మోహరించడం వేలం వెర్రిగా మారింది. నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసు. నిజానికి ఇలాంటి చర్యలవల్లే పాలన కుంటుబడుతోంది.
దేశంలో వివిధ అసెంబ్లీల కాలపరిమితులు వేర్వేరుగా ఉండటం, లోక్‌సభ ఎన్నికలతో పొంతన లేకపోవడం తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత కొద్దికాలానికే మొదలైంది. 1951–52లో లోక్‌సభకూ, అసెంబ్లీలకూ జమిలి ఎన్నికలు జరగ్గా... ట్రావెన్‌కూర్ కొచ్చిన్, పటియాలా తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పీఈపీ ఎస్‌యూ)లు కేరళ, పంజాబ్‌లుగా ఆవిర్భవించడం, ఆ రాష్ట్రాల్లో కొత్తగా అధికారం లోకొచ్చినవారు మెజారిటీ కోల్పోవడం వంటి పరిణామాలతో అక్కడి అసెంబ్లీలకు 1954లో మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. అప్పుడు కేరళలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ చీలిపోవడంతో ఆ ప్రభుత్వమూ 1956లో పడిపోయింది. 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు కేరళ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారి కమ్యూనిస్టులు అధికారంలోకొచ్చారు. 1959లో నెహ్రూ ప్రభుత్వం ఆ సర్కారును రద్దుచేయడంతో ఆ మరుసటి ఏడాది మధ్యంతర ఎన్నిక లొచ్చాయి. 1962లో మూడో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం ఒరిస్సాలో ప్రభుత్వం కుప్పకూలి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు తప్ప లేదు. 1967 తర్వాత తరచు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం, ఎన్నికలు రావడం ఒక ధోరణిగా మారింది. 1969లో కాంగ్రెస్ నిట్టనిలువుగా చీలిపోవడం వల్ల లోక్ సభకే మధ్యంతర ఎన్నికలు తప్పలేదు.
కొన్ని దేశాల్లో పౌరులకు రీకాల్ హక్కుంది. ఎన్నికైన ప్రభుత్వాలు వాగ్దానాలు గాలికొదిలితే... అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే రిఫరెండమ్ ద్వారా వాటిపై అసమ్మతిని ప్రకటించి ఆ ప్రభుత్వాలను రద్దు చేయించడం ఈ రీకాల్ హక్కు సారాంశం. మన దేశంలో ఇలాంటి విధానం లేదు సరికదా చట్టసభల్లో తగినంత మెజారిటీ లేనపుడు విపక్ష సభ్యులను లోబర్చుకోవడం రివాజైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దీన్ని మరింత దిగ జార్చారు. అసెంబ్లీలో తమకు తగినంత మెజారిటీ ఉన్నా కేవలం ప్రతిపక్షాన్ని బల హీనపరిచే ఉద్దేశంతో ఫిరాయింపులకు తెరతీశారు. ఈ బాపతు చర్యలపై మౌనం వహిస్తూ జమిలి ఎన్నికల అంశాన్ని చర్చకు తీసుకురావడంలో అర్ధం లేదు. ముందు ఎన్నికల వ్యవస్థపైనా, చట్టసభలపైనా దేశ పౌరుల్లో విశ్వాసమూ, గౌరవమూ ఏర్పడటానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమ యంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, తప్పుడు వాగ్దానాల్విడం, విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం, హింసకు దిగడం వంటి ధోరణులు నానాటికీ పెరుగుతు న్నాయి. వీటిని కట్టడి చేయడంపై ముందుగా దృష్టి సారిస్తే... ఆ ఎన్నికలు ఏకకా లంలో జరగాలో, ఇప్పటిలా వేర్వేరుగా ఉంటే సరిపోతుందో ఆలోచించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment