ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఆ అంశంపై అందరూ అధ్యయనం చేయాలని కోరారు. న్యూఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన స్పీకర్ల సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో చట్టసభలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరగడం మన దేశానికి ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. ఇప్పుడే కాదు... అధికారంలో లేనప్పుడు కూడా బీజేపీ జమిలి ఎన్నికలుండాలని కోరుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత ఎల్.కె. అడ్వాణీ ఈ అంశంపై 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఎక్కడో ఒకచోట కొన్ని నెలల వ్యవధిలో ఎన్నికలు జరుగుతుంటే వాటి ప్రభావం అభివృద్ధి కార్యకలాపాలపై పడుతున్నదని, వేర్వేరు ఓటర్ల జాబితాల వల్ల వృధా వ్యయం తప్ప ఉపయోగంలేదని మోదీ భావన.
మన దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ విధానంవుంది. ఆ రాష్ట్రాల్లో కూడా పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు తీరు వేర్వేరుగా వుంటోంది. వాస్తవానికి 1952 తొలి సార్వత్రిక ఎన్నికలతో మొద లుపెడితే 1967 వరకూ చట్టసభలకు జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే 1972లో ముగియాల్సిన లోక్‌సభను నాటి ప్రధాని ఇందిరాగాంధీ సంవత్సరకాలం ముందే రద్దు చేయడంతో 1971లోనే ఎన్నికలు వచ్చాయి. 1984లో రాజీవ్ గాంధీ కూడా ఆ పనే చేశారు. గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేశారు. అనంతరకాలంలో ఏర్పడిన ప్రభుత్వాలు మూన్నాళ్ల ముచ్చటగా ముగిశాయి.
(చదవండి: ఒకే దేశం.. ఒకే ఎన్నిక)
1989, 1999ల్లో ఏర్పడ్డ ప్రభుత్వాలు రెండేళ్ల వ్యవధిలోనే కుప్పకూలడంతో మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. మధ్యలో 1991 ఎన్నికల అనంతరం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అయిదేళ్లూ పాలించారు. తిరిగి 1996 ఎన్నికల తర్వాత 1998 వరకూ రెండేళ్లలోనే ఏబీ వాజపేయి, హెచ్‌డీ దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వరసగా ప్రధానులయ్యారు. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. ఆ తర్వాత నుంచి సుస్థిర ప్రభుత్వాల యుగం వచ్చింది. అసెంబ్లీలు సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. తగినంత మెజారిటీ లేక రాజీనామా చేయాల్సిరావడం, కేంద్రంలో అధికారం చలాయించే పాల కులకు ఆగ్రహం కలిగినప్పుడు ప్రభుత్వాలు బర్తరఫ్ అయి, ఎన్నికలు రావడం... ఇదంతా మన కళ్ల ముందే సాగిన చరిత్ర.
ఇప్పుడు ప్రధాని చేస్తున్న ప్రతిపాదన తీరుతెన్నులేమిటో ఎవరికీ తెలియదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అనంతరకాలంలో అర్ధాంతరంగా ఏర్పడే రాజకీయ సంక్షోభాలకూ, అనిశ్చితికీ ఆ ప్రతిపాదనలో ఎటువంటి పరిష్కారం చూపదల్చుకున్నారో తెలియదు. ఇవి తెలిస్తే తప్ప జమిలి ఎన్నికలపై ఎవరూ సానుకూలంగా స్పందించలేరు. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఏదో కారణంతో అసెంబ్లీని రద్దు చేస్తే ఏం చేస్తారు?
ఒకవేళ అధికారంలో వున్నవారు మెజారిటీ కోల్పోయి, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే అక్కడి అసెంబ్లీ ఏమవుతుంది? అక్కడ ఎలాంటి పాలన వుంటుంది? మరో నాలుగేళ్లు లేదా మూడేళ్లు ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండా రాష్ట్రపతి పాలనలో ఆ రాష్ట్రం మనుగడ సాగించాలా? అలాగైతే అది ప్రజా స్వామ్యం అవుతుందా? అసలు కేంద్రంలోనే అనిశ్చితి ఏర్పడితే ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ సందేహాలకు స్పష్టమైన సమాధానాలుండాలి. అన్నిటికీ అమెరికాతో పోలిక తెచ్చుకోవడం మనకున్న అలవాటు. అది చిరకాలంగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతున్న దేశమైతే...మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అక్కడ జమిలి ఎన్నికలు లేకపోయినా మనతో పోలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగ్గా వుంది. నాలుగేళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో రెండేళ్లకోమారు ప్రతి నిధుల సభకు ఎన్నికలుంటాయి.
రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ఆ మాదిరే వుంటాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఎన్నికల నిబంధనల్లో, నిర్వహణలో ఎన్నో వ్యత్యాసాలుంటాయి. అయితే అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలూ ఏకమవుతాయి. మన దగ్గర ఫెడరల్ వ్యవస్థ నానాటికీ కుంచించుకుపోతుంటే అక్కడ అది నిరంతరాయంగా వర్థిల్లుతోంది. భిన్న సమయాల్లో ఎన్నికల వల్ల అభివృద్ధి కార్యకలాపాలకు అక్కడ కలగని విఘాతం మన దేశంలో ఎందుకు కలుగుతోంది? పాలకులు ఒప్పుకోరుగానీ... నిరంతర ఎన్నికల వల్ల విధాన సంబంధమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం వారికి సమస్యగా పరిణమిస్తోంది. ఒక రాష్ట్రంలో ఎన్నికలయ్యాక తీసుకునే విధాన నిర్ణయం మరో రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గుదిబండగా మారుతోంది.
అయితే ప్రజలెదుర్కొంటున్న సమస్య వేరు. ఎప్పుడూ జరిగే ఎన్నికల వల్ల అనవసర ఉద్రిక్తతలు పెరగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, పర్యవసానంగా శాంతిభద్రతల సమస్య తలెత్తడం సాధారణ ప్రజానీకానికి సమస్యగా మారుతోంది. అలాగే ఆచరణసాధ్యంకాని వాగ్దానాలతో మేనిఫెస్టోలు నిండిపోవడం వారికి ఎబ్బెట్టుగా అనిపి స్తోంది, డబ్బు, మద్యం పంపిణీ వంటివి సరేసరి. ఇవన్నీ ఎన్నికలను జాతరగా మారుస్తుంటే... ఆ తర్వాత ఏర్పడే చట్టసభలు సైతం కర్తవ్య నిర్వహణలో విఫలమవుతున్నాయి. ఎంతో కీలకమైన బిల్లులనుకున్నవి కూడా అరకొర చర్చలతో ఆమోదం పొందుతున్నాయి.
కొన్నిసార్లు గిలెటిన్లతో ముగుస్తున్నాయి. వాగ్దానాలు నెరవేర్చని పాలకులపై ఏవిధమైన చర్యలూ వుండవు. ఈ దుస్థితిని మార్చడానికి పాలకులు ముందుగా ప్రయత్నించాలి. జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లీలను జోడిస్తే స్థానిక ఆకాంక్షలు, సమస్యలు మరుగున పడతాయి. ఇందువల్ల ఫెడరల్ స్ఫూర్తి అటకెక్కుతుంది. జమిలి ఎన్నికల్లో ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77 శాతం వరకూ వున్నాయని 1999 తర్వాత జరిగిన ఎన్నికలను డేటా పరిశీలించిన విశ్లేషకులు సైతం తేల్చారు. కనుక ఈ విషయంలో అన్ని కోణాల్లోనూ లోతైన చర్చ జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment