బీజేపీ అధ్యక్షుడి రాజీనామా.. అంతలోనే తూచ్
అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా రెండు వారాల సమయం కూడా లేని తరుణంలో పంజాబ్ బీజేపీ రాజకీయం పలు రకాల మలుపులు తిరుగుతోంది. టికెట్ల పంపిణీలో తీవ్ర అసంతృప్తికి లోనైన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు విజయ్ సంప్లా రాజీనామా చేసినట్లు కథనాలు వచ్చినా, అంతలోనే ఆయన తన రాజీనామా వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. తాను వేరే పనిమీద వెళ్లాను తప్ప.. రాజీనామా చేయడానికి కాదని చెప్పారు. తన రాజీనామా విషయంలో వచ్చినవన్నీ రూమర్లే తప్ప ఏవీ నిజం కాదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
అంతకుముందు, ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు పంపినట్లు, దాన్ని ఆయన ఆమోదించలేదని కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 117 స్థానాలున్న అసెంబ్లీకి పోటీ చేసేందుకు తాను సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం పట్టించుకోకుండా తన సొంత జాబితా విడుదల చేయడంతో సంప్లా ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం అక్కడ పాలకపక్షమైన అకాలీదళ్-బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన విజయ్ సంప్లా, కేంద్రంలో సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు.