సిద్ధూను వాడుకుని కర్వేపాకులా పారేశారా? | siddhu denied deputy cm, given unimportant portfolios | Sakshi
Sakshi News home page

సిద్ధూను వాడుకుని కర్వేపాకులా పారేశారా?

Published Fri, Mar 17 2017 8:11 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

సిద్ధూను వాడుకుని కర్వేపాకులా పారేశారా? - Sakshi

సిద్ధూను వాడుకుని కర్వేపాకులా పారేశారా?

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు గానీ.. ఇంత భారీ విజయం సాధిస్తుందని అనుకోలేదు. ఈ విజయంలో మాజీ క్రికెటర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూది కూడా కీలకపాత్ర అన్నది చెప్పక తప్పని విషయం. బీజేపీలో ఉండి ఎంపీ పదవి అనుభవిస్తూ.. దాన్ని వదిలిపెట్టి ఎక్కడకు వెళ్లాలా అని ఆలోచించి చివరకు కాంగ్రెస్ పంచన చేరారు. ఇతర పార్టీల మీద గట్టిగా దుమ్మెత్తిపోయడమే కాకుండా కాంగ్రెస్ విజయానికి ఇతోధికంగా సాయపడ్డారు. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిస్తే కెప్టెన్ అమరీందర్ సింగే ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ బహిరంగంగా ప్రకటించి, ఆ మాట నిలబెట్టుకున్నారు. దాంతో అంతా సిద్ధూను ఉపముఖ్యమంత్రి చేస్తారని భావించారు. కానీ.. ఆయనకు ఇచ్చిన మంత్రిత్వశాఖలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. సిద్ధూకు నెంబర్ 2 స్థానం ఇచ్చి ఆయనను ఉప ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని పంజాబ్ పీసీసీ చీఫ్ ప్రతాప్ సింగ్ బజ్వా లాంటి వాళ్లు కూడా భావించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉండటంతో సిద్ధూ పదవికి ఎసరు వచ్చింది.

మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన సిద్ధూ ప్రస్తుతం ప్రభుత్వంలో మూడోస్థానంలో కొనసాగుతున్నట్లు అనుకోవాల్సి వస్తుంది. సహాయ మంత్రి హోదాలో ఉన్న రజియా సుల్తానా లాంటి వాళ్లకు పబ్లిక్ వర్క్స్ శాఖతో పాటు సామాజిక భద్రత, మహిళాభివృద్ధి లాంటి కీలక శాఖలు లభించాయి. సిద్ధూకు మాత్రం పర్యాటకం, సాంస్కృతిక శాఖ, స్థానిక సంస్థల వ్యవహారాల శాఖలు మాత్రమే ఇచ్చారు. మరో సహాయ మంత్రి అరుణా చౌదరికి స్వతంత్ర హోదాతో విద్యాశాఖ ఇచ్చారు. సిద్ధూకు కీలక శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తే.. కెప్టెన్ కంటే ఎదిగిపోతారని, అది ఇబ్బందికరమని భావించడం వల్లే ఇలా చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారని కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు అడ్డు పడినట్లు కూడా తెలుస్తోంది. ఇదే విషయాన్ని వాళ్లు కెప్టెన్ అమరీందర్‌తో చెప్పారని, దాంతో ఆయన పార్టీ అధిష్ఠానం వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లి, కావాలంటే ఆయనకు మూడో స్థానం ఇస్తాను తప్ప ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోనని చెప్పి దానికి ఆమోదం తీసుకున్నారని కూడా అంటున్నారు. తాను ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందువల్ల ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ ఉంటే అది తనకే దక్కాలని బ్రహ్మ మొహీంద్ర వాదిస్తున్నారు. ఇలా చాలామంది ఉండటంతో సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవి దక్కలేదు. అయితే శాఖల విషయంలో కూడా ఆయనను పట్టించుకోకుండా.. ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలు తగిలించడంతో తనను కూరలో కర్వేపాకులా ఎన్నికల్లో వాడుకుని తర్వాత పక్కన పెట్టేశారన్న భావనలో సిద్ధూ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేకపోవడంతో ఊరుకున్నారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement