ఇప్పటివరకు పెద్దగా చడీ చప్పుడు లేని పంజాబ్ ఎన్నికల రంగం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇప్పటివరకు పెద్దగా చడీ చప్పుడు లేని పంజాబ్ ఎన్నికల రంగం ఒక్కసారిగా వేడెక్కింది. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలనుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా పిలుపునిచ్చారు. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేజ్రీవాల్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
పంజాబ్‌లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా, ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న గట్టిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద జాతీయ స్థాయిలోనే నమ్మకం కొరవడిన ప్రజలు.. అటు పంజాబ్‌లో కూడా వాళ్లు ఇంతకుముందు చేసింది, తర్వాత చేసేది ఏమీ లేదనే భావిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీని సరైన ప్రత్యామ్నాయంగా భావించడం లేదు. ఆమ్ ఆద్మీపార్టీ పంజాబ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మీద కూడా అవినీతి ఆరోపణలు రావడంతో, ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఊపు తేవాలనే అన్నారో, లేదా నిజంగానే కేజ్రీవాల్ పంజాబ్ వెళ్తారో గానీ మనీష్ సిసోదియా వ్యాఖ్యలు కలకలం రేపాయి.