పంజాబ్‌లో ఎవరికి ఎన్ని?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ - బీజేపీ కూటమి మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇన్నాళ్ల బట్టి అందరూ చెబుతున్నా.. ఎన్నికల పండితులు మాత్రం ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న సర్వేలలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వీళ్ల అంచనాలు విపరీతమైన తేడాగా కనిపిస్తున్నాయి. ఒకరు చెప్పేదానికి, మరొకరు చెప్పే ఫలితాలకు పొంతన లేకుండా పోయింది.
పంజాబ్‌లో ప్రధానమైన పోటీ ఎస్‌ఏడీ-బీజేపీ కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మధ్యే ఉంటుందని ఏబీపీ న్యూస్-లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడోస్థానానికే పరిమితం అవుతుందని అంచనా వేశారు. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలుండగా.. వాటిలో ఎస్‌ఏడీ-బీజేపీకి 50-58 స్థానాలు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 12-18 వస్తాయని చెప్పారు.
కానీ ఇండియాటుడే-యాక్సిస్ సర్వే మాత్రం పంజాబ్‌లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ఉంటుందని అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు, ఎస్‌ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు రావచ్చని అంటున్నారు. అయితే.. మొత్తమ్మీద ఏ సర్వే చూసినా ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించడంలేదు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో అధికారం చేపట్టాలంటే కనీసం 59 స్థానాలలో విజయం సాధించాలి. ఇన్ని సీట్లు ఏ ఒక్క పార్టీ లేదా కూటమికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటుందని ఇండియాటుడే- యాక్సిస్ సర్వే చెప్పింది. అక్కడి అసెంబ్లీలో మొత్తం 70 సీట్లుండగా, వాటిలో బీజేపీకి 35-43, కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు.