యూపీలో ఎవరికి మెజారిటీ రాదా!
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పటికీ ప్రజల అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారం ఏ పార్టీని వరించనుందన్న విషయంలో అనేక విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై అనేక సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 9 వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు వాటిని వెల్లడించడానికి వీలులేదు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా... ఫలితాలు మాత్రం తేలేది 11 వ తేదీన మాత్రమే.
నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో దాదాపు మూడేళ్ల బీజేపీ సర్కారు, యూపీలో అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం, అంతకుముందున్న బీఎస్పీల మధ్య పోరు హోరాహోరీగానే సాగిందని ప్రాథమిక అంచనాలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. మోదీ ప్రచారం, తమ పాలన, అనుసరించిన రాజకీయ వ్యూహం తమకు అనుకూలమైన ఫలితాలను అందిస్తాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల తరహాలో దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓటర్లే లక్ష్యంగా అనుసరించిన రాజకీయ ఎత్తుగడ ఫలిస్తుందని బీఎస్పీ ఎంతో నమ్మకంతో ఉంది. ఇకపోతే, సమాజ్ వాది పార్టీలో ప్రారంభంలో మొదలైన లుకలుకలు కనిపించినప్పటికీ అవేవీ ఫలితాలపై ప్రభావం చూపించబోవని, అఖిలేష్ నాయకత్వం పట్ల అనేక వర్గాలు అనుకూలంగా ఉన్నాయని, దానికి తోడు కాంగ్రెస్ పొత్తు మరింత సానుకూల ఫలితాలను అందిస్తుందని ఎస్పీ ఆశాభావంతో ఉంది.
ఏది ఏమైనప్పటికీ ప్రాథమికంగా వస్తున్న సమాచారం, రాజకీయ విశ్లేషకుల అంచనాల మేరకు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా, ఒక్కో దశలో ఒక్కో పార్టీకి మెరుగైన అవకాశాలు కనిపించాయి. తుదిగా మాత్రం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అత్యధిక సీట్లు సాధించే (సింగిల్ లార్జెస్ట్) రాజకీయ పార్టీగా ఎవరుంటాయన్నది కూడా కీలకం కానున్నది.
ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చర్చకు వచ్చిన నోట్ల రద్దు వంటి అంశాలు కేవలం రాష్ట్రానికి మాత్రమే సంబంధించనివి కాకపోవడం దీనికి కారణమంటున్నారు. అలాగే పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుల్లో కులమతాల ఆధారంగా చోటుచేసుకున్న కొత్త సమీకరణాలు కూడా ఫలితాన్ని త్రిశంకు స్వర్గంలోకి నెట్టనున్నాయని విశ్లేషకుల అంచనా. ఎస్పీలో అంతర్గత కుమ్ములాట నేపథ్యంలో ముస్లింలు ఆ పార్టీవైపు మొగ్గుచూపాలో, లేకపోతే తమ సామాజిక వర్గానికి దాదాపు 100 టికెట్లు ఇచ్చిన బీఎస్పీవైపు మొగ్గు చూపాలో తేల్చులేకపోయారు.
బీఎస్పీ, ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీల మధ్య ప్రధానంగా పోరు నెలకొన్న యూపీలో ఏ పార్టీ అయినా సగం సీట్లు (202) గెలవాలంటే 35 శాతం ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుందని అంచనా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం ఆప్నా దళ్‌లు రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాలకుగాను 73 స్థానాలను, 42 శాతం ఓట్లును గెలుచుకోవడం తెలిసిందే. ఈ లెక్కన కాషాయదళానికి తాజా ఎన్నికల్లో 7 శాతం ఓట్లు కోల్పోయినా విజయానికి ఢోకా ఉండదు.
2012 ఎన్నికల్లో ఎన్నికల్లో 29 శాతం ఓట్లతో(226 సీట్లు) అధికారంలోకి వచ్చిన ఎస్పీ.. ఈసారి గెలవాలంటే కాంగ్రెస్‌తో కలసి మరో 6 శాతం ఓట్లు ఎక్కువగా సంపాదించాలి. గత ఎన్నికల్లో 26 శాతం ఓట్లు(80 సీట్లు)సాధించిన బీఎస్పీ అధికారంలోకి రావాలంటే మరో 9 శాతం ఓట్లు తెచ్చుకోవాలి. 14 ఏళ్లపాటు హంగ్ తీర్పు ఇచ్చిన యూపీ ప్రజలు 2007లో దానికి స్వస్తి పలికి బీఎస్పీకి 206 సీట్లతో పట్టాభిషేకం చేశారు. మొత్తంమీద ఈ ఫలితాలు యూపీ అధికారపక్షమేదో తేల్చడంతోపాటు కాకుండా మరో రెండేళ్ల తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గాలి ఏ పార్టీ వైపు వీస్తుందో కూడా చెప్పనున్నాయి.