ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు
న్యూఢిల్లీ, సాక్షి: నోట్ల రద్దు అంశంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న తరుణంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నింటికీ కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
పదవీ కాలం ముగుస్తున్న అయిదు రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖంఢ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. అయిదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలున్నాయి. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ అసెంబ్లీ 117, ఉత్తరాఖంఢ్ 70, మణిపూర్ 60, గోవా 40 స్థానాలున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం 27 మే 2017 నాటికి పూర్తవుతుంది. అలాగే ఉత్తరాఖంఢ్ రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం 26 మార్చి 2017 నాటికి పూర్తవుతుండగా, మిగిలిన మూడు రాష్ట్రాలకు 18 మార్చి 2017 తో పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తయ్యే ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఎన్నిక ప్రక్రియ ముగించాల్సి ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూలును ప్రకటించింది.