సిద్ధుకు మరో ఆఫర్
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధుకు మాంచి డిమాండ్ ఏర్పడింది. బీజేపీకి గుడ్ బై చెప్పిన సిద్ధుకు మరో ఆఫర్ వచ్చింది. ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేక డైలమాలో ఉన్న సిద్ధుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. సిద్ధు డీఎన్ఏలో కాంగ్రెస్ ఉందని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ అన్నారు. సిద్ధు తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, సిద్ధు చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, అతని కోసం కాంగ్రెస్ తలుపులు ఓపెన్గా ఉన్నాయని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకే సిద్ధును పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధు పేరును ప్రకటించవచ్చని వార్తలు వచ్చాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సిద్ధు ఇటీవల కలిసి చర్చించాడు. కాగా ఆప్లో చేరే విషయంలో అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్లో చేరే విషయాన్ని కూడా సిద్ధు పరిశీలిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. సిద్ధు రెండు సార్లు ఎంపీగా గెలవగా, ఆయన భార్య బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇవ్వడంతో పాటు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంట్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని, సిద్ధుకు స్థాయికి తగినట్టుగా ప్రాధాన్యం ఇస్తామని అమరీందర్ సింగ్ చెప్పారు. ఇంతకీ సిద్ధు ఏ పార్టీలో చేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.