
రాజకీయ నాయకుడు (పొలిటీషియన్) వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు (స్టేట్స్‌మన్) రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. ఈ సూక్తి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరించడమే కాదు, స్వార్థపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారనడానికి పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు విషయంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రబల నిదర్శనం. విలువలు లేని రాజ కీయం వల్ల నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నట్టే, రాబోయే ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయంతో పోలవరం అనే సుడిగుండంలో చిక్కుకున్నారు. 2018 లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటూ పదేపదే హామీలు ఇవ్వడం, ప్రతి పక్షం అడ్డుపడుతోందంటూ ఆరోపణలు చేయడం, పవన్ కల్యాణ్ మంచి బాలుడంటూ కితాబులు ఇవ్వడం తప్ప అసలు పోలవరంలో ఏమి జరుగుతోందో ప్రజలకు చెప్పలేదు. పోలవరంపైన శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ అడిగినా అక్కరలేదని కొట్టిపారేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు చూసి నిర్ఘాంతపోయాను. వాస్తవానికి అక్కడ పని బొత్తిగా జరగడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు మిన్నకుండి అకస్మాత్తుగా పోలవరం పూనకం వచ్చినట్టు అదేపనిగా కలవరించడం ప్రారంభించారు చంద్రబాబు. అనేక విడతల క్షేత్ర పర్యటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రతింపులు జరిపారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పని తీరును సమీక్షిస్తూ సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఆర్భాటం గమనించినవారికి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా దూసుకుపోతోందనే అభిప్రాయం కలుగుతుంది. శుక్రవారం ఉదయం ఇద్దరు జర్నలిస్టు మిత్రులతో కలసి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తిరిగి, అన్ని విషయాలూ వివరంగా అడిగి తెలుసుకున్న తర్వాత ప్రాజెక్టు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో అర్థమైంది.
మేము అక్కడ ఉన్నప్పుడే కేంద్ర జలవిద్యుత్తు కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మండలి ప్రతినిధి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కోసం పదిహేను వాహనాలలో అట్టహాసంగా చేరుకుంది. వారి వెంట రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇంజనీర్–ఇన్–చీఫ్ నాగేశ్వరరావు, ఉన్నతాధికారి రమేష్ కేంద్ర అధికారులకు ప్రాజెక్టు ‘పురోగమనం’ గురించి వివరిస్తున్నారు. అక్కడక్కడ టిప్పర్లు కనిపిస్తున్నాయి. రెండు ప్రొక్లేన్లు పని చేస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ బోర్డు వెలసిపోయి నిర్వికారంగా కనిపించింది. సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ కదులుతోంది కానీ కాంక్రీట్‌ను తయారు చేయడంలేదు. కేంద్ర అధికారులకు ఆ ప్లాంట్ ఎట్లా పని చేస్తోందో చూపించేందుకే దానిని నడిపిస్తున్నారని అక్కడున్నవారు చెప్పారు. కాఫర్ డ్యామ్ అవసరమా అని కేంద్ర అధికారులు ప్రశ్నించారనే శీర్షికతో శనివారం నాటి పత్రికలు వార్త ప్రచురించాయి. కాఫర్‌డ్యామ్ అవసరం తెలియని అమాయకులా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు? కాదు. వారు అడగడం వెనుక బలమైన కారణం ఉంది.
ఎన్నికలే ప్రధానం
మా ముఖ్యమంత్రిగారు 2018 జూన్ కల్లా కాఫర్‌డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి, నదీ ప్రవాహం మళ్ళించి గురుత్వాకర్షణశక్తి (గ్రావిటీ) సహాయంతో నీరు సరఫరా చేయాలని సంకల్పించారనీ, ఆ సంకల్పం సాకారం కావాలంటే కాఫర్ డ్యామ్‌ను అనుమతించాలనీ మంత్రి కోరారు. ఎర్త్ అండ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగాలంటే కాఫర్‌డ్యామ్ కట్టితీరాలి. అప్పుడే నీటిని అరికట్టి డ్యామ్ నిర్మాణం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాఫర్‌డ్యామ్ అంటే తాత్కాలికమైన మట్టి కట్ట. ఎగువన ఒక వరుసలో, దిగువన మరో వరుసలో పసుపు పచ్చ జెండాలు కనిపించాయి. అదే వరుసలో ఎగువ కాఫర్‌డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగాలి. శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో అసలు డ్యామ్ నిర్మాణం ముందు కాఫర్‌డ్యామ్ కట్టారు. మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యామ్‌ను పడగొట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని తుపాకులగూడెంలో సైతం కాఫర్‌డ్యామ్ నిర్మించిన తర్వాతే మెయిన్ డ్యామ్ నిర్మిస్తున్నారు. కాఫర్‌డ్యామ్‌ను మెయిన్ డ్యామ్‌లో భాగంగా నిర్మించవచ్చుననే సూచన కూడా కేంద్ర అధికారుల నుంచి వచ్చింది. ఈ ప్రతిపాదనను ప్రారంభంలో పరిశీలించారు. అనంతరం విరమించుకున్నారు.
కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంచాలని ఏపీ సర్కార్ పట్టుబట్టడంతోనే పేచీ వచ్చింది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రముఖ ఇంజనీరు సీతాపతి ఖరారు చేసిన డిజైన్ ప్రకారం 31 మీటర్ల ఎత్తున కాఫర్‌డ్యామ్ నిర్మించాలి. దానిని 41.5 మీటర్ల ఎత్తుకు పెంచాలని చంద్రబాబు పథకం. ఎందుకు? కుడి, ఎడమ కాలువల లోతు (స్పిల్ లెవల్) సుమారు 35 మీటర్లు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎత్తులో కాఫర్ డ్యామ్ ఉంటే కానీ అందులో నీటిమట్టం 35 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అప్పుడే కాఫర్‌డ్యామ్ నిలువ చేసిన నీరు భూమ్యాకర్షణశక్తి ప్రభావంతో కాలువలలోకి ప్రవహిస్తుంది. కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంచాలన్న ఎత్తుగడలోని ఆంతర్యం ఏమిటి? పోలవరం ప్రధాన ప్రాజెక్టు వచ్చే ఎన్నికల లోపు పూర్తికాదని రాష్ట్ర ప్రభుత్వాధినేతకు స్పష్టంగా తెలుసు. కానీ పోలవరం నీరు ఎన్నికలలోపే విడుదల చేసి శభాష్ అనిపించుకోవాలి. ఓటర్లను మెప్పించాలి. ఓట్లు సంపాదించాలి. 31 మీటర్ల ఎత్తు కాఫర్‌డ్యామ్ నిర్మించడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు అయితే 41.5 మీటర్ల ఎత్తు కట్టడానికి కనీసం రూ. 500 కోట్లు అవుతుంది. ఇప్పటికే వ్యయం పెరిగిపోతున్నదని కేంద్రం గొడవ చేస్తోంది. దుబారాను తగ్గించాలని ఆలోచిస్తున్నది. అవినీతి జరిగినట్టు రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. లెక్కలు చెప్పమని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అడుతున్నదీ, అధికారులు కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంచడం అవసరమా అని అడుగుతున్నదీ అందుకే.
బరువు నెత్తికెత్తుకోవడం ఎందుకు?
రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ తెలంగాణకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంది. ఇందుకు పరిహారంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి, దాని నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా సరే కేంద్ర ప్రభుత్వమే భరించాలని 2014 మే 5 న మంత్రిమండలి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈ అంశాన్ని యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది. పాత రేట్లు కాకుండా కొత్త రేట్ల ప్రకారమే వ్యయం అంచనా వేయాలని కూడా తీర్మానించింది. ఈ విషయం చంద్రబాబునాయుడు స్వయంగా శాసనసభలో చదివి వినిపించారు. దీనికి తోడుగా ప్రత్యేక హోదా కూడా మంజూరు చేయడానికి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో అంగీకరించారు. తర్వాత మంత్రిమండలిలో నిర్ణయం చేశారు. చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రానికి అప్పగించవలసిందిగా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మిస్తుందంటూ నీతి ఆయోగ్‌కు చెప్పి, దాని ద్వారా కేంద్రాన్ని ఒప్పించి బరువైన బాధ్యత తలకెత్తుకున్నారు.
2014 ఏప్రిల్ 1 నాటి రేట్ల ప్రకారం ఎంత నిర్మాణ వ్యయం అవుతుందో అంతే భరిస్తామంటూ ఎన్‌డిఏ ప్రభుత్వం స్పష్టం చేసినప్పుడైనా ఏపీ ప్రభుత్వం తన నెత్తి మీది బరువు దించుకొని కేంద్రం నెత్తిమీద పెట్టి ఉంటే సరిపోయేది. ఆ పనీ చేయలేదు. పని చేసే శక్తి లేని ట్రాన్స్‌ట్రాయ్ అనే సంస్థను మార్చాలనే ఆలోచన మూడున్నర సంవత్సరాలు రాలేదు. నరసరావుపేట తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆ సంస్థ స్థాయికి ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని తెలిసినా కిరణ్‌కుమార్‌రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారు. వైఎస్ హయాంలో ముందు సత్యం అధినేత రామలింగరాజుకు చెందిన మేటాస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థ కష్టాలపాలు కావడంతో అప్పటి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీకి అప్పగించారు. ఆ సంస్థ కూడా పనులు చేయలేకపోతున్నదని గ్రహించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నాగేశ్వరరావును తప్పుకోమన్నారు. ఆయన తప్పుకున్నారు. కొత్త కాంట్రక్టర్‌ను నియమించే లోపుగానే వైఎస్ హఠాన్మరణం సంభవించింది. ట్రాన్స్‌ట్రాయ్ సబ్–కాంట్రాక్టర్లను నియమించుకుంది. సాంబశివరావు ఎల్–1గా కాంట్రాక్టు సంపాదిస్తారు. ఆనక ఖర్చులు పెరిగాయనీ వ్యయం పెంచాలనీ ప్రభుత్వాలను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు.
2010లో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010 కోట్లు కాగా, అది 2014 నాటికి రూ. 23,000 కోట్లు, 2017 నాటికి రూ. 58,000 కోట్లు అయింది. భూసేకరణకూ, పునరావాసానికే ఇందులో సగానికి పైగా (రూ. 33,000 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. కొంత కాలం తర్వాత సాంబశివరావును పక్కన పెట్టి ప్రభుత్వం నేరుగా సబ్–కాంట్రాక్టర్లతో వ్యవహారం చేయడం ఆరంభిం చింది. ప్రభుత్వం నియమించిన సబ్–కాంట్రాక్టర్లకు చెల్లింపులు టంచనుగా జరుగుతున్నాయి. ప్రధాన కాంట్రాక్టర్ నియమించిన సబ్–కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనితో విసిగిపోయిన సాంబశివరావు గడ్కరీని కలుసుకొని తన కష్టాలు చెప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత లేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం, అవసరాల ప్రకారం నిర్ణయాలు జరిగాయి.
బాబు ఆగ్రహం, సంయమనం
టెండర్లను పిలిచిన విధానాన్ని తప్పుపడుతూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖ చంద్రబాబునాయుడిని ఆందోళనకూ, ఆగ్రహానికీ గురి చేసింది. పోలవరం నిర్మాణం బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తే నమస్కారం పెట్టి అప్పగిస్తానంటూ పరుషంగా మాట్లాడారు. అంతలోనే సంభాళించుకొని సంయమనం పాటించాలంటూ తోటి మంత్రులకూ, పార్టీ సహచరులకూ హితవు చెప్పారు. కానీ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలన్న నిర్ణయం విషయంలో రాజీ పడటం లేదు. బహుళార్థ సాధక నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల మొదటి నుంచీ చంద్రబాబునాయుడికి విశ్వాసం లేదు. 2004 ఎన్నికలకు ముందు వరంగల్లులో దేవాదులకూ, తూర్పు గోదావరిలో తాడిపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకూ హడావుడిగా శంకుస్థాపన చేసి ఓటర్ల మదిలో ఆశలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. నా మనవలూ, మీ మనవలు కూడా పోలవరం చూడలేరంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్టుడు అప్పట్లో వ్యాఖ్యానించేవారు. చాలా విషయాలలో చంద్రబాబునాయుడికీ, రామకృష్ణుడికీ భావసామ్యం ఉంది. పోలవరం పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాలు వ్యర్థం. ఈ పథకాల కోసం తవ్విన కాల్వలు పోలవరం కాల్వలకు పిల్ల కాల్వలుగా పనికి రావచ్చు. అంతవరకే. అంతకు మించి ప్రయోజనం ఉండదు.
పట్టిసీమ కోసం రూ.1500 కోట్లు, పురుషోత్తపట్నం పేరుతో రూ. 1600 కోట్లు వృ«థా చేసి సంబరం చేసుకున్న చంద్రబాబునాయుడు ఆ నిధులనే పోలవరం ప్రాజెక్టుపైన ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు ఎంతో కొంత ప్రగతి సాధించేది. ఎన్నికల ప్రయోజనాలను విస్మరించి జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాఫర్‌డ్యామ్‌ను 31 మీటర్ల ఎత్తు నిర్మించడానికి అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరావచ్చు. ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి కాదు. కానీ ఎంతో కొంత పని జరుగుతుంది. ఆ మేరకు చంద్రబాబునాయుడికి ఖ్యాతి దక్కుతుంది. అట్లా కాకుండా ఎన్నికల కోసం మాయోపాయం చేసి హడావుడిగా పనులు చేయించినా, కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచి నీరు సరఫరా చేసి పబ్బం గడుపుకున్నా రాష్ట్ర ప్రజలకు తీరని అపకారం చేసినవారు అవుతారు. పోలవరం వంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును ఏ రకమైన లోపాలూ లేకుండా, సమున్నత ప్రమాణాలతో నిర్మించాలి. నిర్ణయాలు ఇంజనీర్లు తీసుకోవాలి. వారి పర్యవేక్షణలో పనులు జరగాలి. రాజకీయ ప్రయోజనాలను పూర్వపక్షం చేయాలి. లేకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాధినేతలను చరిత్ర క్షమించదు.
- కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment