
నంద్యాల దేనికి నాంది?
త్రికాలమ్
నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని రోజులుగా అక్కడే మకాం ఉండి నిత్యం రోడ్‌షోలు నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం చేరుకున్నారు. రెండు శిబిరాలలో ఆఖరి పోరాటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం కారణంగా జరుగుతున్న ఉపఎన్నిక తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికీ, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డికి మధ్య పోరాటంలా కనిపించడం లేదు.
ఇది చంద్రబాబుకూ, జగన్‌మోహన్‌రెడ్డికీ మధ్య యుద్ధం. ప్రచారంలో ప్రస్తావనగా అప్పుడప్పుడు అభ్యర్థుల పేర్లు రావచ్చు కానీ ప్రధాన యోధులు వారిద్దరే. అమరావతిలో ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం యావత్తూ కొన్ని రోజులుగా నంద్యాలలోనే విడిది చేసింది. మరో పాతికమంది అధికారపార్టీ శాసనసభ్యులూ అక్కడే తిష్ఠ వేశారు. జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తమ అభ్యర్థి విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒక ఉప ఎన్నికలో ఇంతటి తీవ్రమైన పోటీ, స్పర్థ, ప్రచారం, ఆవేశం మునుపెన్నడూ కనీవినీ ఎరగం.
చంద్రబాబు ఎన్టీ రామారావును గద్దె దింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి ఉపఎన్నిక ప్రకాశం జిల్లా దర్శిలో 1996లో జరి గింది. ఆ రోజుల్లోనే అక్కడ విపరీతంగా డబ్బు ఖర్చు చేశారు. కాంగ్రెస్ దీటైన పోటీ ఇవ్వలేదు. తొమ్మిదివేల ఓట్ల తేడాతో టీడీపీ గెలిచింది. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా కొన్ని సందర్భాలలో విజయం వరించకపో వచ్చు. అదే సంవత్సరం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉపఎన్నికలో నందమూరి లక్ష్మీపార్వతి టీడీపీ అభ్యర్థిపైన 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి అన్ని వేళలా అధికారం, డబ్బూ, దబాయింపూ పని చేయవని నిరూపించారు. 2001లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఇండి పెండెంట్ అభ్యర్థిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీడీపీ అభ్యర్థి కె శ్రీని వాసరెడ్డిపైన 52,712 ఓట్ల భారీ మెజారిటీతో ఢంకా బజాయించారు.
పదవిలో ఉన్నారు కనుక ప్రతిసారీ విజయం చంద్రబాబునే వరిస్తుందనే వాదనలో పసలేదు. గట్టి ప్రతిఘటన ఉన్న సందర్భాలలో ఓటమి తప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వాధికారాన్నీ, పోలీసు బలగాన్నీ, అర్థబలాన్నీ నిస్సం కోచంగా వినియోగిస్తున్నారు. జగన్‌మోహన్ రెడ్డి శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద నువ్వా–నేనా అన్నట్టు సాగుతున్న సమరంలో రెండు పక్షాలూ చావోరోవో తేల్చుకునేందుకు సిద్ధమై తలపడుతున్నాయి. అందుకే ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.
నంద్యాల ప్రత్యేకత
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి కేంద్రం. ఈ స్థానం నుంచి ఎన్నికైన ఇద్దరు వ్యక్తులు దేశానికి రాష్ట్రపతిగా (నీలం సంజీవరెడ్డి), ప్రధాని (పీవీ నరసింహారావు)గా సేవలందించారు. దేశంలోని మరే ఇతర లోక్‌సభ స్థానానికీ ఇటువంటి ప్రత్యేకత లేదు. ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికలలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలలో ఒక్కటంటే ఒక్కటే ప్రతిపక్షానికి దక్కింది. నంద్యాలలో జనతాపార్టీ టిక్కెట్టుపైన పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ నీలం సంజీవరెడ్డి నలభై వేల ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. తక్కిన 41 స్థానాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. నీలం ఏకగ్రీవంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైనారు. ఆ తర్వాత మూడు మాసాలకే నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కన్నుమూశారు. 1977 జూలై 21న సంజీవరెడ్డి ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికైనారు. 1969లో రాష్ట్రపతి ఎన్ని కలలో వివి గిరిని పోటీ చేయించి కాంగ్రెస్ అధికార అభ్యర్థి సంజీవరెడ్డిని ఓడించిన ఇందిరాగాంధీ 1977లో సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నికకు సహక రించడం విశేషం. 1967–69 మధ్య మొదటిసారి స్పీకర్‌గా పని చేసిన సంజీవ రెడ్డి అప్పట్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి లోక్‌సభకు ఎన్నికై నారు. నంద్యాలనుంచి సంజీవరెడ్డి తర్వాత పెండేకంటి వెంకటసుబ్బయ్య ఎన్నికై ఇందిర మంత్రిమండలిలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఏడేళ్ళ అనంతరం నంద్యాలకు మరోసారి మహర్దశ పట్టింది.
1991 ఎన్నికలకు దూరంగా ఉండిన పీవీ తమిళనాట శ్రీపెరంబదూరులో రాజీవ్‌గాంధీ హత్య జరగడంతో మైనారిటీ ప్రభుత్వ సారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నిక కావలసి వచ్చింది. ఆనాటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి నంద్యాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి చేత రాజీనామా చేయించి పీవీని అక్కడ పోటీ చేయించారు. ప్రధాని స్థాయికి చేరిన ఒక తెలుగు ప్రముఖుడికి పోటీ పెట్టకూడదని ఎన్టీఆర్ నిర్ణయించారు. ఫలితంగా పీవీ 5.8 లక్షల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 1996లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పీవీ నంద్యాల నుంచి తక్కువ మెజారిటీతోనూ, బరంపురం నుంచి ఎక్కువ ఆధి క్యంతోనూ గెలిచారు. బరంపురం స్థానం ఉంచుకొని నంద్యాలను వదులు కున్నారు.
అధికారం అన్నివేళలా లాభించదు
దర్శి నుంచి నంద్యాల వరకూ చంద్రబాబు ఎత్తుగడలూ, వ్యూహాలూ గమ నించినవారికి కొన్ని అంశాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఒకటి, ఆయనకు సెంటిమెంట్లు లేవు. రెండు, రాజకీయ విలువలు కానీ నైతిక విలువలు కానీ ఆయనకు శిరోధార్యం కాదు. మూడు, ఎన్నికలలో గెలుపే ప్రధానం. విజయం సాధించే క్రమంలో ఏమి చేసినా చెల్లుతుందనే విశ్వాసం బలంగా ఉంది. నాలుగు, ప్రజలు అమాయకులనీ, ఎన్నికలలో మాట్లాడినవన్నీ చేసితీరాలని పట్టుపట్టరనీ, ఆటలో ఆరటిపండు అనుకు ంటారనీ అభిప్రాయం. ఈ విషయంలో ఆయన నమ్మకం ఇంతవరకూ వమ్ముకాలేదు. చంద్రబాబు రాజ కీయ వ్యక్తిత్వంలో ఇది ప్రధాన పార్శ్వం. ఒకటి చెప్పడం వేరొకటి చేయడం చాలామంది రాజకీయ నాయకులకు అలవాటు.
చెప్పిన దానికి పూర్తి భిన్నంగా చేయడం, చేసిన దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడటం, దాన్ని సమ ర్థించుకోవడం బాబు ప్రత్యేకత . 1994లో అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్య మంత్రిగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన ఎన్టీఆర్‌ను ఎట్లా గద్దె దించిందీ తెలుగు ప్రజలు జాగ్రత్తగా గమనించారు. పదవీచ్యుతి తర్వాత అల్లుడి గురించి ఆయన ఏమి మాట్లాడారో జగద్విదితం. యూట్యూబ్‌లోకి వెడితే లెక్కలేనన్ని క్లిప్పింగ్‌లు దొరుకుతాయి. రామారావు అస్తమయం అనం తరం కొన్ని మాసాలకు ఆయనను కీర్తించడం ప్రారంభించిన చం ద్రబాబు ఆయనను అధికారం లాగివేసిన ఉదంతాన్ని పిచ్చి ప్రజలు విస్మరించి ఉంటారని భావించారు.
ఆ భావనకు అనుగుణంగానే 1996 లోక్‌సభ ఎన్ని కలలోనూ, 1999 అసెంబ్లీ పోరులోనూ విజయం కట్టబెట్టారు. గెలుపొందడా నికి కారణాలు వేరే ఉండవచ్చును. కానీ రామారావును దేవుడిని చేసి పూజిం చడం ద్వారా ఆగస్టు సంక్షోభం జ్ఞాపకాలను చెరిపివేశానని బాబు నమ్ము తున్నారు. ఇదే ప్రయోగం రాష్ట్ర విభజన సమయంలోనూ చేశారు. రాష్ట్రాన్ని విభజించమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారు. దమ్ముంటే విభజిం చాలని సోనియాగాంధీని సవాలు చేశారు. తాను లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం ఏర్ప డేది కాదని తెలంగాణలో, అన్యాయంగా, అశాస్త్రీయంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడారు.
ఈ ద్విపాత్రాభినయనాన్ని రెండుచోట్లా స్వీకరించి తన విధానాన్ని బలపర్చుతారని ఆయన భావించారు. అందుకే తెలంగాణలో కూడా పట్టు కొనసాగించాలని ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ శాసనసభ్యుడిని కొనుగోలు చేసే దుస్సాహసం చేశారు. కానీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని న గదుతో సహా టేపులలో ఇరికించి తాను ఆడియాలో దొరికిపోయారు. నీతినియమాల గురించి ఆలోచించడం లేదు. ఎక్కడ పోటీ జరిగితే తాను అక్కడ ఉండాలనీ, ఎట్లాగైనా గెలిచి తీరాలనే జూదరి స్వభావం. చంద్రబాబు అదృష్టం కొద్దీ ‘ఓటుకు కోట్లు’ కేసు ముందుకు సాగడం లేదు. తప్పు చేసినా ఏదో ఒక విధంగా తప్పుకునే చాకచక్యం ఉంది.
మాట వేరు, బాట వేరు
విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టి, అయిదు, పది సంవ త్సరాలు సరిపోదు పదిహేనేళ్ళు ఇచ్చి తీరాల్సిందేనంటూ వాదించిన చంద్ర బాబు ఇప్పుడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీకి మారిన శిల్పా మోహన్‌రెడ్డిని శనివారం ప్రచారంలో ధనదాహం ఉన్న స్వార్థపరుడుగా అభి వర్ణించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసనమండలి అధ్యక్ష పదవి ఇస్తానన్న చంద్రబాబు మాజీ మంత్రి ఫారూఖ్ వైపు మొగ్గు చూపారు. నంద్యాల నియోజకవ ర్గంలో ముస్లింలు అధికంగా ఉన్నారు కనుక ఫారూఖ్ గుర్తుకొ చ్చారు. ఇదే ఫారుఖ్‌కు ఆయన 2014లో మొండిచేయి చూపారు. ఇప్పుడు ఏకంగా శాసనమండలి చైర్మన్ పదవి వాగ్దానం చేశారు.
1995 ఆగస్టులో వైస్రాయ్ డ్రామాలో ఏమి జరిగిందో ఫారూఖ్‌కి తెలుసు. ఎన్టీఆర్‌కు ఎసరుపెట్టడంలో సహకరించిన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఉపముఖ్యమంత్రి పదవీ, బావమరిది హరికృష్ణకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీ ఇవ్వజూపారు. ఒకరి తర్వాత ఒకరికి జెల్లకొట్టారు. నెల తిరగకుండానే రామారావు దగ్గరికి దగ్గుబాటి తిరిగి వెళ్ళిపోతే, హరికృష్ణ 1999లో సొంతపార్టీ పెట్టుకొని తిరుగుబాటు ప్రకటించారు. 1996 ఎన్నికలకు కొన్ని మాసాల ముందే రామారావు మరణించడంతో చంద్రబాబుకి పెద్ద అడ్డంకి తప్పిపోయింది. ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసినా ఫారూఖ్ ప్రలోభాలకు లొంగిపోయారు. ఆయన వాస్తవిక దృష్టిలో ఆలోచించి ఉంటారు. ఇప్పుడు ఏమీ లేని స్థితి కంటే శాసనమండలి సభ్యత్వం కొంత మెరుగు. ఆ తర్వాత కౌన్సిల్ అధ్యక్ష పదవి బోనస్. రాకపోయినా పర్వాలేదని అనుకొని ఉంటారు.
అన్నగారికి సహాయం చేసేందుకు చక్రపాణిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని వెడితే మండలి సభ్వత్వానికి రాజీనామా చేసి రావాలంటూ జగన్ మోహన్‌రెడ్డి షరతు విధించారు. ఈ ఆదర్శప్రాయమైన ఉదంతానికి ప్రచారం రాకుడా బాబు మీడియాను కట్టడి చేయగలిగారు. 21మంది వైఎస్‌ఆర్‌సీపీ శాస నసభ్యులను ఫిరాయించేందుకు ప్రోత్సహించిన నీతిమాలిన చర్య ప్రస్తావన కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. నంద్యాలలో కోట్లు ఖర్చు చేస్తూనే తనకు వస్తు వ్యామోహం లేదనీ, చేతికి ఉంగరం, వాచీ కూడా ఉండదనీ చెబుతారు. అఖిలప్రియ చెప్పిన అభ్యర్థికి టిక్కెట్టు ఇచ్చినా ఎన్నికల తంత్రం ఇతర నేతలకు, మంత్రులకూ అప్పగించారు. భూమా కుటుంబానికి రాజకీయ శత్రు వైన గం గుల ప్రతాపరెడ్డికి అర్జంటుగా పచ్చకండువా కప్పారు.
విద్యార్థులను సర్వేయర్ల రూపంలో పంపి ఓటర్లను బెదిరిస్తున్నారు. ఇన్ని పరస్పర విరుద్ధమైన అంశాలను సమన్వయం చేసుకోవడం చాకచక్యం కావచ్చును కానీ రాజనీతి మాత్రం కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అసలే కాదు. నంద్యాల ఎన్నికలో ఓటమి ఎదురైతే బాబు తన వైఖరిని సమీక్షించుకొని, తప్పు తెలుసుకొని, సవరించుకునే అవకాశం ఉంటుంది. గెలిచినట్లయితే తన వైఖరికి తిరుగులేదని భావించి అదే మార్గంలో ప్రయాణిస్తారు కాబోలు. 28వ తేదీన నంద్యాల ఓటర్ల తీర్పు ఎట్లా ఉండబోతోందనేదే ఉత్కంఠ కలిగించే అంశం.
కె. రామచంద్రమూర్తి