ఫిరాయింపుల క్రీడ ఇంకానా?
త్రికాలమ్
శనివారం ప్రారంభమైన వైఎస్‌ఆర్‌సీపీ రెండురోజుల ప్లీనరీకి హాజరైన ప్రతినిధులలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఆహ్వానితుల కంటే అధికంగా పార్టీ కార్యకర్తలు హాజరు కావడం పార్టీ నడుస్తున్న తీరుపట్ల సంతృప్తికి నిదర్శనం. పాలకపక్షం పట్ల ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తికి కూడా ఇది నిదర్శనం. క్షేత్రస్థాయిలోని రాజకీయ నాయకులకు ప్రజల నాడి తెలుస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతోందంటే ప్రతిపక్షానికి అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వారు గ్రహిస్తారు. అటువంటి వాతావరణం ప్రతిపక్ష కార్యకర్తలలో ఉత్సాహం నింపడం సహజం. గతంలో జరిగిన రెండు ప్లీనరీల కంటే ఈసారి ప్లీనరీ పద్ధతి ప్రకారం ప్రారంభమైనదని చెప్పవచ్చు. ప్రసంగాలు క్లుప్తంగా, సూటిగా ఉన్నాయి. తీర్మానాలు అర్థవంతంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిపైనా, ఆయన కుమారుడిపైనా వ్యక్తిగత విమర్శలు చేయకుండా వక్తలు విధానాలకూ, పాలనకూ మాత్రమే పరిమితమైతే ఇంకా బాగుండేది.
పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం రెండు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఒకటి, పార్టీ ఫిరాయింపుల నిరోధం. రెండు, ఎన్నికల వాగ్దానాలు చేయడంలో వాస్తవిక దృక్పథం ఉండాలనీ, చేసిన వాగ్దానాలు అమలు చేయని పాలకులపైన శిక్షాత్మక చర్యలు ఉండాలనీ తీర్మానం ప్రతిపాదించింది. ఈ రెండు రుగ్మతలూ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనవి కావు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఇటువంటి అప్రజాస్వామిక ధోరణులు మితిమీరుతున్నాయి.
పార్టీ ఫిరాయింపుల నిరోధం బిల్లు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న బ్రిటన్‌లో లేదు. ఆస్ట్రేలియా, కెనడాలలోనూ లేదు. పార్టీ ఫిరాయించిన ఎంపీలు బ్రిటన్ పార్లమెంటులో విడిగా కూర్చుంటారంతే. ఫలానా పార్టీ టిక్కెట్టుపైన గెలిచారు కనుక అదే పార్టీకి అంకితం కావాలన్న నిబంధన లేదు. అవి ప్రవృద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలు కనుక డబ్బు కోసమో, పదవి కోసమో పార్టీ ఫిరాయించే సంస్కృతి అంతగా లేదు కనుక పార్టీ విధేయతకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీ కంటే ప్రజలకూ, దేశానికీ విధేయంగా చట్టసభలలోని ప్రజాప్రతినిధులు వ్యవహరించాలన్నది ఆ సమాజాల విశ్వాసం. అందుకే అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా కొంతమంది రిపబ్లికన్ సెనేటర్లూ, అనుకూలంగా ప్రతిపక్షంలోని డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లు కొందరూ ఓటు వేయడం ఆనవాయితీ. బ్రిటన్‌లోనూ ఇదే వరస. చట్టాల రూపకల్పనలోనూ, విధాన నిర్ణయాలలోనూ పార్లమెంటు సభ్యులు తమ విచక్షణాజ్ఞానం వినియోగించకపోతే, కేవలం ఓటర్ల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే అది దేశాన్ని దగా చేసినట్టు అవుతుందంటూ 1774లోనే నాటి బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడూ, రాజనీతిజ్ఞుడూ ఎడ్మండ్ బర్క్ హెచ్చరించాడు.
మన దేశంలో పరిస్థితులు వేరు. డబ్బు కోసం, పదవుల కోసం పార్టీ ఫిరాయించడాన్ని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీలూ, ఫిరాయిస్తున్న ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులూ, శాసనసభ, శాసనమండలి సభ్యులూ అనేకమంది ఉన్నారు. ఫిరాయింపుల కారణంగా రాజకీయ అస్థిరత ఏర్పడటంతోపాటు ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి వల్ల 1970లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతగా అపహాస్యం పాలైనదో గమనించిన తర్వాత ఫిరాయింపుల నిరోధం తప్పనిసరి సంస్కరణ అని విజ్ఞులు నిర్ణయించారు.
ఫిరాయింపుల నిరోధక చట్టాలు
రాజీవ్‌గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ వచ్చింది. రాజ్యాం గంలోని 101, 102, 190, 191 అధికరణలను సవరించి, రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్‌ని చేర్చి పార్టీ ఫిరాయించిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించారు. పార్లమెంటరీ లేదా లెజిస్లేచర్ పార్టీలో మూడింట ఒక వంతు మంది సభ్యులు పార్టీని వీడితే దాన్ని పార్టీలో వచ్చిన చీలికగా గుర్తించాలని అప్పటి ఫిరాయింపుల చట్టం నిర్దేశించింది. ఆ విధంగా పార్టీని చీల్చినవారి పైన అనర్హత వేటు ఉండదు. పెద్ద పార్టీలైతే మూడింట ఒక వంతు మందిని పార్టీ ఫిరాయించడం కోసం సమీకరించడం కష్టం కానీ చిన్నాచితకా పార్టీలను చీల్చడం తేలిక. చిన్న రాష్ట్రాలలో ఫిరాయింపులను 1985 నాటి చట్టం నిరోధించలేకపోయింది. రాష్ట్రాలలో అస్థిరతనూ, అనిశ్చితినీ ఈ సవరణ చట్టం అరికట్టలేకపోయింది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. 2003లో వాజపేయి సర్కార్ టెన్త్ షెడ్యూల్‌లో సవరణ చేసింది. మూడింట రెండు వంతుల మంది వైదొలిగితేనే పార్లమెంటరీ లేదా లెజిస్లేచర్ పార్టీ చీలినట్టు పరిగణించాలంటూ కొత్తచట్టం తెచ్చారు. ఈ చట్టంలో ఒక లొసుగు వదిలివేసిన కారణంగా ఫిరాయింపులు నిస్సిగ్గుగా కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన చట్టసభ సభ్యుడిపైన అనర్హతవేటు వేయడమా లేదా అని నిర్ణయించే అధికారం సభాపతులకు చట్టం ప్రసాదించింది. ఫలానా పక్షానికి చెందిన సభ్యుడు ఫిరాయిస్తే ఆ సభ్యుడిపైన అనర్హత వేటు వేయాలంటూ ఆ పక్షం నాయకుడు సభాపతికి లేఖ ఇస్తారు. ఆ లేఖపైన సభాపతి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చట్టం నిర్దేశించలేదు. ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కూడా లేదు. అందువల్ల స్పీకర్లు ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలను నిరవధికంగా వాయిదా వేస్తూ కాలయాపన చేస్తున్నారు. రాజీవ్, వాజపేయి తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాలు నిష్ఫలమై రాజ్యాంగ వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి.
లొసుగులను ఎందుకు తొలగించరు?
చట్టాలలోని లోపం ఏమిటో స్పష్టంగా తెలుసు కదా. దాన్ని సవరించే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? ఎవరు చేయాలి ప్రయత్నం? అధికార పార్టీ చేయాలి. ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండటమే అధికారపార్టీలకు అవసరం. అందువల్ల ఈ లోపాలను సవరించాలన్న ఆతృత, ఉత్సుకత వాటికి ఉండదు. పైగా ఆ లొసుగులను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కేంద్రంలోని పాలకపక్షాలకూ, రాష్ట్రాలలోని అధికారపక్షాలకూ సమంగా వర్తిస్తుంది.
ఇదివరకు సరిపోను సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాలు స్వతంత్ర సభ్యులనో, చిన్న పార్టీల సభ్యులనో ఫిరాయింపునకు ప్రోత్సహించి అధికారం నిలబెట్టుకునే ప్రయత్నం చేసేవి. ఇప్పుడు రాజకీయం బరితెగించింది. చట్టసభలలో మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలను బలహీనం చేయాలనే ఉద్దేశంతో యధేచ్ఛగా ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతిపక్ష సభ్యులకు ప్రలోభాలు చూపించి వారి చేత తప్పు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రులకు పరమవిధేయులైన సభాపతులు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడంలో సహకరిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్టీ ఫిరాయించినవారిని మంత్రిపదవులతో సత్కరిస్తున్నారు. చట్టాలు చేయవలసినవారే చట్టాలను నిష్కారణంగా తుంగలో తొక్కుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రాలలోని పాలకపక్షాలు కానీ ఇందుకు సిగ్గుపడటం లేదు. పోనీ ఫిరాయించినవారు ఏదైనా సైద్ధాంతిక విభేదాల వల్లనో, సూత్రబద్ధంగానో ఆ పనిచేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. నైతిక కారణాల వల్ల అధికార పార్టీ నుంచి నిష్క్రమించిన పార్లమెంటు సభ్యులూ లేదా శాసనసభ్యులూ కలికానికైనా కని పించరు. అటువంటి ఉన్నత విలువల ప్రసక్తి లేదు. ధనం, అధికారం నిగ్రహిం చుకోలేని ప్రలోభాలుగా మారాయి. సభాపతుల మౌనం, నిష్క్రియ సరాసరి రాజ్యాంగ ఉల్లంఘనే.
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఈ విషయంలో కొత్త పుంతలు తొక్కింది. ప్రతిపక్ష సభ్యులపైన కేసులు పెట్టి వేధించి, వారిపైన రౌడీషీట్లు తెరిపించి వారిని కాళ్ళ బేరానికి తెప్పించుకొని పార్టీ ఫిరాయించే విధంగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలు అందరికీ తెలిసినవే. భూమా నాగిరెడ్డి ఇందుకు ప్రబలమైన ఉదాహరణ. 2011లో వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన శాసనసభ్యుల చేత సభ్యత్వానికి రాజీనామా చేయించి, మళ్ళీ ఉపఎన్నికలలో కొత్త పార్టీ టెక్కెట్టుపైన పోటీకి నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ విషయంలో అధికార పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు ఉంది. వాస్తవానికి ఇది జాతీయ స్థాయిలో చర్చించి పరిష్కరించుకోవలసిన సమస్య. అందుకే పార్టీ ప్లీనరీ రాజకీయ తీర్మానంలో ఈ అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం సమంజసమే.
ఆచరణసాధ్యం కాని వాగ్దానాలు
ఎన్నికల వాగ్దానాలు అమలుకు నోచుకోకపోవడం దేశవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన అనేక వాగ్దానాలు మూడేళ్ళుగా అమలుకు నోచుకోలేదు. ఆ వాగ్దానాలు అమలు కాకపోయినా ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం లేదు కనుక పర్వాలేదు. కానీ ముఖ్యమంత్రులు చేసే వాగ్దానాలు వివిధ వృత్తులవారిలో, సమాజంలోని అనేక వర్గాలలో ఆశలు రేకెత్తిస్తాయి. వాగ్దానాలు అమలు జరుగుతాయనే ఆశతో ఓటు వేస్తారు. వారి ఓట్లతో గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వారికే శఠగోపం పెడుతుంది. ఇది చాలా సందర్భాలలో జరిగిన తంతు. చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. రెండు ప్రధానమైన వాగ్దానాలు చేసి అంతకంటే చాలా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ అమలు చేశారు. అన్ని కార్యక్రమాల ఫలాలూ అన్ని ప్రాంతాల, వర్గాల, మతాల, కులాలవారికీ అందించే ప్రయత్నం చేశారు. దాన్ని ‘శాచురేషన్ లెవల్’అనేవారు. అందుకే మృత్యువాతపడి ఎనిమిదేళ్ళు కావస్తున్నా తరగని ప్రజాభిమానం. అమలుకు సాధ్యమైన ఎన్నికల వాగ్దానాలే చేయాలంటూ ఎన్నికల కమిషన్ కొన్నేళ్ళుగా పట్టుపడుతున్నది కానీ అది నెరవేరడానికి అవసరమైన వ్యవస్థ లేదు.
2014లో తెలుగుదేశం పార్టీ వాగ్దానాలను పరిశీలించవలసిందిగా ఎన్నికల కమిషన్‌ను కొంతమంది కోరారు. కానీ అందుకు తగిన యంత్రాంగం లేకపోవడం, ఫలానా వాగ్దానం ఆచరణ సాధ్యం కాదు కనుక ప్రచారంలో ఆ వాగ్దానం చేయరాదంటూ శాసించే అధికారం ఎన్నికల సంఘానికి లేకపోవడం వల్ల ఎన్నికల హామీలను అదుపు చేసే ప్రయత్నం ఫలించలేదు. తమ విశ్వసనీయతను కాపాడుకోవాలనే పట్టింపు కలిగిన రాజకీయ నేతలు ఒక వాగ్దానం అమలు చేసే ముందు అది సాధ్యమా, అసాధ్యమా అనే విషయాన్ని తరచి పరిశీలిస్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో రైతులకు రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా జగన్‌మోహన్‌రెడ్డికి చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ అంత భారం మోయగల స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండబోదని లెక్కలు వేసుకొని ఆ వాగ్దానం చేయలేదు. పైగా తెలుగుదేశం చేసిన రుణమాఫీ వాగ్దానం అమలు సాధ్యం కాదని ప్రజలకు స్పష్టంగా చెప్పారు. కానీ ఓటర్లు ఆ వాగ్దానాన్ని విశ్వసించారు. అనంతరం ఏమి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రజలకు తెలుసు. ఆకాశమే హద్దుగా ఎన్నికల వాగ్దానాలు చేసే దురాచారానికి స్వస్తి చెప్పకపోతే అమాయక ప్రజలు ప్రతిసారీ మోసపోయి మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నది. ఈ బెడద నివారణ కోసం చట్టపరమైన పరిష్కారం అన్వేషించవలసిన బాధ్యత చట్టసభలపైన ఉంది. కనీసం ఫలానా హామీని ఏ విధంగా ఆచరించి చూపుతారో, ఆర్థిక వ్యవస్థలో అందుకు అవసరమైన వెసులుబాటు ఉన్నదో లేదో నిర్ణయించే అధికారాలు ఏదైనా రాజ్యాంగ వ్యవస్థకు అప్పగించకపోతే మోసకారి రాజకీయానికి ముగింపు ఉండదు.
- కె. రామచంద్రమూర్తి