త్రికాలమ్
అడవి నుంచి అప్పుడే వచ్చిన యోధుడిలాగా పుష్కరం కిందట మైదానంలో వెలిగి క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్న మహేంద్రసింగ్ ధోనీ భారత క్రికెట్ చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్న బహుముఖ ప్రతిభా వంతుడు. వ్యక్తిత్వ వికాసం పాఠ్యాంశాలలో మొదటిశ్రేణిలో ఉండవలసిన జీవిత చరిత్ర అతనిది. కర్తవ్య నిర్వహణలో ఏకాగ్రచిత్తంతో వ్యవహరించడం ఎట్లాగో, జయాపజయాలను సమంగా స్వీకరించడం ఎట్లాగో, విషయాన్ని సాకల్యంగా గ్రహించి లక్ష్య సాధన కోసం పరిశ్రమించడం ఎట్లాగో, ఎంత ఒత్తిడి వచ్చి నెత్తిపైన కూర్చున్నా చెక్కుచెదరకుండా, చిర్నవ్వు చెదరకుండా, తొట్రుపాటు లేకుండా ప్రశాంత గంభీరంగా ఉంటూ విజయం వైపు అడుగులు వేయడం ఎట్లాగో, కొండంత ఆత్మవిశ్వాసంతో పకడ్బందీ వ్యూహం ప్రకారం జట్టును కదనరంగంలో ముందుకు నడిపించడం ఎట్లాగో, అవాంతరాలను అధిగమించి విజయం సాధించడం ఎట్లాగో తెలుసుకోవాలనుకునే యువతీ యువకులకు జనవరి 4న పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు నాయకత్వ పాత్ర నుంచి విరమణ ప్రకటించిన ధోనీ జీవితాన్ని అధ్యయనం చేయడం తప్పనిసరి. ‘ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా చూసినా చాలు.
ఏ రంగంలోనైనా ఉన్నత పదవులలో ఉన్నవారికి ఎప్పుడు వైదొలగాలో తెలిసినప్పుడే వారికి చరిత్రలో స్థానం దక్కుతుంది. ‘గో వెన్ ద గోయింగ్ ఈజ్ గుడ్’ అంటారు. ‘అయ్యో అప్పుడే దిగిపోయాడా, ఇంకా కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్‌గా ఉండవచ్చు కదా’ అని అభిమానులు అనుకున్నప్పుడే స్వస్తి చెప్పడం ఉత్తమం. అదే పని భారత క్రికెటర్లలో అగ్రగాములైన విజయ్ మర్చంట్, సునీల్ గావస్కర్ చేశారు. వ్యక్తిగత ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తూ కొన్ని మైలురాళ్ళు దాటాలనే లక్ష్యం పెట్టుకున్న సచిన్ టెండూల్కర్ విరమణ నిర్ణయం తీసుకోవడంలో కొద్ది జాప్యం చేశారు. 200వ టెస్ట్ ఆడేవరకూ ఆగారు. విజయ్ మర్చంట్ చివరి టెస్ట్‌లో శతకం సాధించిన వెంటనే టెస్ట్‌ల నుంచి విరమిస్తున్నట్టు ప్రకటించారు. ‘బాగా ఆడుతున్నారు కదా, ఎందుకు విరమిస్తున్నారు అప్పుడే?’ అని విలేకరులు అడిగితే ‘విరమణ ఎప్పుడు?’ అని అభిమానులు అడిగేవరకూ ఉండదలచుకోలేదంటూ సమాధానం చెప్పారు.
సమయజ్ఞత ఉన్నవాడే ధన్యుడు
ఎప్పుడు విరమించుకోవాలో తెలియక చరిత్రలో స్థాయి తగ్గించుకున్న రాజకీయ నాయకుల జాబితాలో మొదటి పేరు రెండో ప్రపంచ యుద్ధంలో వ్యూహరచనా ధురంధరుడుగా పేరు తెచ్చుకున్న బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌దే. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన వెంటనే రాజకీయాలకు స్వస్తి చెప్పి ఉంటే బ్రిటిషర్ల హృదయాలలో ఆయనకు అత్యున్నత స్థానం ఉండేది. సము చితమైన సమయంలో చర్చిల్ తప్పుకోలేదు. సమయజ్ఞత పాటించలేదు. 1945 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.
అనంతరం కోలుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు అసహనంగా ఎదురు చూసే విధంగా పరిపాలన అధ్వానంగా ఉండేది. మన్మోహన్‌సింగ్ 2009లోనే ప్రధానిగా అయిదేళ్ళ పదవీ కాలం ముగిసిన వెంటనే వైదొలిగి ఉన్నట్లయితే ఆర్థికమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆర్థికరంగాన్ని పరుగులెత్తించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేవారు. కుంభకోణాలను అనుమతించిన ప్రధానిగా పేరు దిగజారేది కాదు. పండిట్ నెహ్రూ 1957 ఎన్నికల తర్వాత లాల్‌బహద్దూర్ శాస్త్రినో, మరొకరినో ప్రధానిగా నియమించి విశ్రాంతి తీసుకొని ఉంటే కృష్ణమీనన్ వంటి వ్యక్తి రక్షణమంత్రి అయ్యేవారు కాదు. శక్తికి మించిన పోకడలు పోయేవారు కాదు. చైనాతో యుద్ధం వచ్చేది కాదు. పరాజయ పరాభవభారంతో నెహ్రూకి గుండెపోటు వచ్చేది కాదు.
భారత క్రికెట్ చరిత్రలో మన్సూరలీ ఖాన్ పటౌడీ, కపిల్‌దేవ్, అజహ రుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి గొప్ప కెప్టెన్లు ఉన్నారు. గావస్కర్, టెండూల్కర్, సెహ్వాగ్ వంటి మేటి బ్యాట్స్‌మన్ ఉన్నారు. ఫారూఖ్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ వంటి మంచి వికెట్ కీపర్లు ఉన్నారు. కానీ మూడు విభాగాలలోనూ అసమాన ప్రతిభావంతుడు ధోనీ. అటువంటి వీరుడు మరొకడు లేడు.
నాయకత్వ స్థానంలో ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. జట్టును ఎంపిక చేసే విషయంలో అందరినీ సంతృప్తిపరచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కెప్టెన్‌కి ఇష్టాయిష్టాలు ఉండవచ్చు. అందుకే యువరాజ్ తండ్రి యోగ రాజ్ ధోనీ వైదొలుగుతున్నందుకు మిఠాయి పంచిపెట్టి సంబరం చేసుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్‌లో అడుతున్న మ్యాచ్ జరగడానికి ముందు రోజు టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు వివిఎస్ లక్ష్మణ్ ప్రకటించడానికి ధోనీ వైఖరి కారణం కావచ్చు. వీరేంద్ర సెహ్వాగ్‌కీ, రవిచంద్రన్ అశ్విన్‌కీ, గౌతమ్ గంభీర్‌కీ ధోనీ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు. ఎవరు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ కొంతమందికి అన్యాయం జరగడం, బాధ కలగడం సహజం. 2013 నాటి స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఒక కవరు సుప్రీంకోర్టు దగ్గర ఇప్పటికీ తెరవకుండానే పడి ఉంది.
కవరును తెరవవద్దనీ, అందులోని పేర్లను వెల్లడించవద్దనీ బీసీసీఐ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పదేపదే అభ్యర్థిం చారు. ఆ జాబితాలో రెండో పేరు ధోనీదేననే వదంతులు ఉన్నాయి. అతడు కూడా మనిషే కనుక మనిషికి ఉండే బలహీనతలు ఉండవచ్చు. ధోనీ గొప్ప క్రీడాకారుడు. అసాధారణమైన వ్యక్తి. భారత క్రికెట్‌కు అతడు చేసిన పరమా ద్భుతమైన సేవతో పోల్చితే ఈ ఆరోపణలకు అంత ప్రాధాన్యం ఉండదు. అత్యు న్నత న్యాయస్థానం దోషిగా నిర్ణయిస్తే అది వేరే సంగతి.
భారత్ క్రికెట్‌కు మహర్దశ
ప్రపంచ కప్‌ను కపిల్ సేన లార్డ్స్‌లో గెలుచుకొని వచ్చిన తర్వాత 28 సంవత్స రాల నిరీక్షణ ఫలించింది ధోనీ అద్భుత సారథ్యంలోనే. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టును విజయపథంలో నడిపించిన ఘనత హైదరాబాదీ స్టార్ బ్యాట్స్‌మన్ అజహరుద్దీన్‌ది కాగా గెలుపు ఒక అలవాటుగా మారడానికి బాటలు వేసిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. కానీ టెస్ట్ మ్యాచ్‌లలో, ఒన్డే ఇంటర్నేషనల్స్‌లో, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అలవోకగా, సాధికారికంగా విజయాలు సాధించడం ధోనీ సారథిగా పగ్గాలు చేతపట్టిన తర్వాతనే. భారత క్రికెట్‌కు మహర్దశ పట్టింది అతడి నేతృత్వంలోనే. గ్రెగ్ చాపెల్ శిక్షణలో భాతర క్రికెటర్లు గిజగిజలాడి దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ధోనీ ఆటను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. గిల్‌క్రిస్ట్ శిష్య రికంలో మెలకువలు నేర్చుకున్నాడు. 2004లో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో ధోనీకి స్థానం లభించింది. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయకుండానే రనౌటైనాడు. ఐదో వన్డేలో సెంచరీ చేశాడు. ఐదు రోజుల మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడుతున్న సమయంలో గాయమైన కారణంగా అప్పటి కెప్టెన్ కుంబ్లే తప్పుకోవడం, వైస్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ జట్టుకు నాయకత్వం వహించడం యాదృచ్ఛికం.
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కుంబ్లే ప్రకటించడంతో అన్ని ఫార్మా ట్లలోనూ (టెస్ట్, ఒన్డే, టీ20) ధోనీ శకం ఆరంభమైంది. కెప్టెన్ కిరీటం పెట్టుకున్న తర్వాత ఒత్తిడి ఫలితంగా ఆటలో విఫలమైన గావస్కర్, సచిన్, ద్రవిడ్ వంటి దిగ్గజాలను చూశాం. నాయకత్వం స్వీకరించిన తర్వాత విజృంభించిన ధోనీనీ చూశాం. జట్టు కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక స్కోరు (224 పరుగులు) సాధించిన ఖ్యాతి ధోనీది. అంతవరకూ రికార్డు సచిన్ టెండూల్కర్‌ది–217 పరుగులతో. వికెట్‌కీపర్‌గా ఎక్కువ మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు పంపించి శ్రీలంకకు చెందిన సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ఇంటర్నేషనల్ రెండో ఇన్నింగ్స్‌లో 183 పరుగులు (10 సిక్సర్స్, 15 ఫోర్స్) చేసి బ్రియాన్ లారా రికార్డు (153 పరుగులు)ను అధిగమించాడు. వికెట్ కీపర్‌గా ఒకే ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాట్స్‌మన్‌ని అవుట్ చేసి ఆదమ్ గిల్‌క్రిస్ట్ రికార్డును సమం చేశాడు. భారత జట్టును ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాడు. ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ఇన్ని ఘనవిజయాలు సాధించిన క్రికెటర్ ప్రపంచంలో మరొకరు లేరు. కెప్టెన్‌గా ఉంటూ బ్యాట్స్‌మన్‌గా వెలిగిన పాంటింగ్ వంటి వారు ఉన్నారు. మూడు విభాగాలలో ధోనీ స్థాయిలో రాణిం చినవారు ఒక్కరు కూడా కనిపించరు. అందుకే 21 బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉంటూ అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా రెండు చేతులా సంపాదించాడు. కంట్రాక్టుకు రూ. 200 కోట్లు తీసుకునేవాడు. 2013లో ప్రపంచంలో అత్యధిక ఆదాయం ఉన్న క్రీడాకారుల జాబితాలో ధోనీది పదమూడో స్థానం.
సచిన్, ధోనీల వైవిధ్యం
సచిన్, ధోనీల తర్వాతనే మరో భారత క్రికెటర్‌ను చెప్పుకోవాలి. ధోనిలో ఉన్న వైవిధ్యం, బహుముఖీనత సచిన్‌లో లేదు. సచిన్‌లో క్రమశిక్షణ ఉంది. దీక్షా దక్షతలు ఉన్నాయి. వ్యక్తిగతంగా రాణించాలనీ, సరికొత్త రికార్డులు నెలకొల్పా లనే ఆకాంక్ష ఉంది. బ్యాటింగ్‌లో సాటిలేని మేటి స్పెషలిస్టు. ఒక బంతిని ఎన్ని రకాలుగా ఆడవచ్చునో అన్ని రకాలుగానూ ఆడగలిగిన పండితుడు. ప్రపంచ మంతా ప్రశంసించిన లిటిల్ మాస్టర్. ధోనీలో సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ముందుండి జట్టును నడిపిస్తాడు. క్రికెట్‌పైన అద్భుతమైన అవగా హన ఉన్నవాడు. ప్రతి బ్యాట్స్‌మన్, బౌలర్ బలం, బలహీనత తెలిసినవాడు. వికెట్ల వెనుక నిలబడి బంతినీ, బ్యాట్‌నీ, వాటి మధ్య ఆధిక్యం కోసం జరిగే పోరాటాన్నీ చాలా జాగ్రత్తగా గమనించడం నేర్చినవాడు. బాగా ఆడిన సహ చరులను మెచ్చుకొని ప్రోత్సహించడం ద్వారా మరింత బాగా ఆడించే నేర్పున్న వాడు. రిస్కు తీసుకుంటాడు. దూకుడుగా వెళ్ళగలడు. సహచరులపైన ఒత్తిడి పడకుండా ఓటమికి బాధ్యత పూర్తిగా తనదేనంటాడు. గెలిస్తే పొంగిపోడు. ఓడితే కుంగిపోడు. ఇంకా కొంతకాలం కెప్టెన్‌గా ఉండదగినవాడు. మరెందుకు ఇప్పుడే నాయకత్వం వదులుకొని వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్‌గా మాత్రం జట్టులో ఉండమంటే ఉంటానని అంటున్నాడు?
విరమణ నిర్ణయం ఆకస్మికమైనదే కానీ అనూహ్యమైనది మాత్రం కాదు. ఎప్పుడు రిటైరవబోతున్నారంటూ ప్రశ్నించిన ఆస్ట్రేలియన్ జర్నలిస్టు శామ్యూల్ ఫెర్రీపై ఆగ్రహం ప్రదర్శించిన ధోనీ తనకూ కోపం వస్తుందనీ, దాన్ని దాచు కోలేని బలహీన క్షణం ఉంటుందనీ ఆ ఒక్క సందర్భంలో వెల్లడించాడు. ‘వికెట్ల మధ్య పరుగుతీస్తున్న తీరు చూసి నేను ఆటలో కొనసాగడానికి అనర్హుడినని అనుకుంటున్నారా?’ అంటూ ఆ జర్నలిస్టుని ఎద్దేవా చేశాడు. కానీ తనకు 35 ఏళ్ళు వచ్చాయని అతడికి తెలుసు. 2019 వరల్డ్ కప్ జట్టులో ధాటిగా ఆడలేనని ధోనీ గ్రహించాడు.
విరాట్ కోహ్లీ విరాట్ స్వరూపం ప్రదర్శిస్తున్న కారణంగా అతడినే భారత క్రికెట్ భాగ్యవిధాతగా అభిమానులు పరిగణిస్తున్న విషయం ధోనీ గ్రహించి ఉంటాడు. తన స్థానంలో మరొకరిని తయారు చేయడానికి క్రికెట్ బోర్డుకు అవకాశం ఇవ్వాలన్న నిస్వార్థ చింతనతో, భారత క్రికెట్ ఔన్నత్యం కాపాడాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని భావించాలి. 2014లో టెస్ట్ క్రికెట్ జట్టు నాయకత్వ హోదాను వీడినప్పుడు సైతం చివరిక్షణం వరకూ గుంభనంగానే ఉన్నాడు. అది అతడి శైలి. సృజన, సాహసం, సహనం, సారథ్య సామర్థ్యం, బహుముఖీనమైన ప్రతిభ కలిగిన నాయకుడి చేతి నుంచీ భారత క్రికెట్ పగ్గాలు అంతే అంకితభావం, ప్రతిభ, దీక్షాదక్షతలు కలిగిన విరాట్ కోహ్లీ చేతిలోకి శనివారంనాడు పూర్తిగా మారాయి. ధోనీని అభినందిస్తూ కోహ్లీని ఆహ్వానించవలసిన సన్నివేశం ఇది.
-కె. రామచంద్రమూర్తి