ధోని లేని టెస్టు...
ధోని అంటే రాంచీ... రాంచీ అంటే ధోని... ఆ నగరానికి అతను తెచ్చి పెట్టిన పేరు అలాంటిది. భారత్‌లో క్రికెట్ పరంగా రాంచీకి ధోని వల్లే గుర్తింపు వచ్చిందనేది వాస్తవం. ఫలితంగానే అక్కడ పెద్ద స్టేడియం నిర్మాణం, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు వచ్చాయి. భారత్‌లో రాంచీ 26వ టెస్టు వేదిక. నాలుగేళ్ల క్రితం ఇక్కడ తొలి వన్డే జరిగినప్పుడు ధోని ఆటపాటలతో సంబరాల్లో పాలుపంచుకున్నాడు. అయితే ఇప్పుడు రాంచీకి టెస్టు హోదా వచ్చిన తర్వాత తొలి మ్యాచ్ జరుగుతున్న సమయానికి అతను టెస్టులకే దూరమయ్యాడు.
సుదీర్ఘకాలం టెస్టు క్రికెట్ ఆడినా సొంత మైదానంలో ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయిన క్రికెటర్ల జాబితాలో ధోని పేరు కూడా చేరింది. ఢిల్లీలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న ధోని... బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్ ఓడితే మాత్రం టెస్టు ప్రారంభమయ్యే సమయానికి నగరంలో ఉండే అవకాశం ఉంది. రాంచీ టెస్టులో ఆటగాడిగా కనిపించకపోయినా, భారత్, ఆస్ట్రేలియా టెస్టు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ప్రతీ పోస్టర్, బ్యానర్‌లో ధోని మాత్రమే దర్శనమిస్తుండటం విశేషం.