Bangalore Test
-
13 ఏళ్ల వయస్సు నుంచే అలవాటైంది..
సుదీర్ఘ ఇన్నింగ్స్‌లపై చతేశ్వర్ పుజారా ధర్మశాల: రాంచీ టెస్టులో 500కు పైగా బంతులను ఎదుర్కొని పుజారా చేసిన డబుల్ సెంచరీ అపూర్వం. అయితే ఈ సహనం తనకు 13 ఏళ్ల చిన్నవయస్సు నుంచే అలవాటైందని చెబుతున్నాడు. ‘ఓపిగ్గా ఆడడమనేది నా కఠినశ్రమతోనే అలవడింది. నాకు ఎనిమిదేళ్ల వయస్సున్నప్పటి నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 13 ఏళ్లప్పుడు తొలిసారిగా రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో ఆడుతూనే ఉన్నాను. దేశవాళీల్లో నిరంతరం ఆడిన అనుభవంతో పాటు కఠిన ప్రాక్టీస్ కూడా ఓపిగ్గా ఆడేందుకు తోడ్పడింది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతోనే ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ నమోదవుతాయి’ అని పుజారా అన్నాడు. గ్రేడ్ ‘ఎ’లో చేరడంపై తను స్పందించడానికి నిరాకరించాడు. ప్రస్తుతం సిరీస్ మధ్యలో ఉన్నామని, కాంట్రాక్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నాడు. ధర్మశాల బౌన్సీ వికెట్‌పై తమకెలాంటి ఆందోళన లేదని, ఇక్కడ గతంలోనూ చాలా క్రికెట్ ఆడామని గుర్తుచేశాడు. సిరీస్ పోటాపోటీగా సాగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ మ్యాచ్‌కు సంబంధం లేని విషయాలపై మీడియా దృష్టి పెడుతోందని పుజారా అన్నాడు. కోహ్లిని ట్రంప్‌తో పోల్చడం బాధించిందన్నాడు. ‘అలాంటి కామెంట్స్ శోచనీయం. కోహ్లికి మేం పూర్తిగా మద్దతునిస్తున్నాం. క్రికెట్‌కు తను గొప్ప అంబాసిడర్‌లాంటి వాడు’ అని పుజారా స్పష్టం చేశాడు. -
ఆస్ట్రేలియాకు వచ్చినపుడు... అశ్విన్ తలకు గురి పెడతా: స్టార్క్
ఆసీస్ గడ్డపై భారత స్పిన్నర్ అశ్విన్‌కు బౌలింగ్ చేసి అతని నుదుటిపై బంతిని సంధించాలని తాను కోరుకుంటున్నట్లు పేస్ బౌలర్ మిషెల్ స్టార్క్ అన్నాడు. గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమించక ముందు బెంగళూరు టెస్టులో తనను అవుట్ చేసిన తర్వాత నుదుటిపై వేలు పెట్టి అశ్విన్ చేసిన సంజ్ఞ స్టార్క్ ఆగ్రహానికి కారణం. అదే టెస్టులో స్టార్క్ బౌలింగ్‌లో ముకుంద్ బ్యాట్‌కు తగిలిన బంతి అనూహ్యంగా సిక్సర్‌గా మారగా... తలరాత అన్నట్లుగా స్టార్క్ అదే తరహాలో సైగ చేశాడు. సిరీస్‌లో మాటల యుద్ధానికి భారత జట్టే కారణమని కూడా స్టార్క్ ఆరోపించాడు. -
సాహాహ్హహ్హహ్హ...
తొలి రోజు సీరియస్‌గా సాగుతున్న రాంచీ టెస్టులో భారత కీపర్ వృద్ధిమాన్ సాహా కాస్త వినోదం పంచాడు! స్మిత్‌ను ఎలాగైనా అవుట్ చేసేందుకు అతను పడిన కష్టం మైదానంలో నవ్వులు పూయించింది. ఇన్నింగ్స్ 80వ ఓవర్లో జడేజా వేసిన బంతిని స్మిత్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్‌కు తగలకుండా స్మిత్ కాళ్ల మధ్యలోకి చేరింది. అప్పటికే బంతి ‘డెడ్‌బాల్’గా మారిపోయినా సాహా మాత్రం పట్టు వదల్లేదు. స్మిత్ కాళ్ల మధ్య నుంచి బంతిని లాగి మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు! ఈ క్రమంలో అతను స్మిత్ వైపు వెళ్ళగా, సాహా ఏం చేస్తున్నాడో అర్థం కాక స్మిత్ కూడా వెనక్కి జరిగిపోయే ప్రయత్నం చేశాడు. చివరకు నియంత్రించుకోలేక స్మిత్ కిందపడిపోయాడు కూడా. అయినా సరే, అతని మీద పడి బంతిని చేజిక్కించుకున్న తర్వాత సాహా క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. ఇదంతా చూసిన అంపైర్ ఇయాన్ గౌల్డ్కు నవ్వు ఆగలేదు. భారత జట్టు సభ్యులందరూ కూడా బిగ్గరగా నవ్వేశారు. ఇంత జరిగినా సాహా మాత్రం ఇంకా సీరియస్‌గానే అంపైర్ నిర్ణయం కోసం వేచి చూడటం మరింత హాస్యాన్ని పండించింది. మరోవైపు 97 పరుగుల వద్ద ఉన్న స్మిత్ మాత్రం ఈ మొత్తం ప్రహసనంలో గంభీరంగానే ఉండి ఎక్కడా తన ఏకాగ్రతను కోల్పోలేదు. -
వివాదాన్ని ముగించడం సంతోషంగా ఉంది: క్లార్క్
బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. 2007–08 ఆస్ట్రేలియా పర్యటనలో ‘మంకీగేట్’ వివాదాన్ని ఆండ్రూ సైమండ్స్ అంతగా సాగదీయాల్సింది కాదని అతను అభిప్రాయపడ్డాడు. క్లార్క్ ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోల్‌కతాలో మంగళవారం విడుదల చేశాడు. -
ధోని లేని టెస్టు...
ధోని అంటే రాంచీ... రాంచీ అంటే ధోని... ఆ నగరానికి అతను తెచ్చి పెట్టిన పేరు అలాంటిది. భారత్‌లో క్రికెట్ పరంగా రాంచీకి ధోని వల్లే గుర్తింపు వచ్చిందనేది వాస్తవం. ఫలితంగానే అక్కడ పెద్ద స్టేడియం నిర్మాణం, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు వచ్చాయి. భారత్‌లో రాంచీ 26వ టెస్టు వేదిక. నాలుగేళ్ల క్రితం ఇక్కడ తొలి వన్డే జరిగినప్పుడు ధోని ఆటపాటలతో సంబరాల్లో పాలుపంచుకున్నాడు. అయితే ఇప్పుడు రాంచీకి టెస్టు హోదా వచ్చిన తర్వాత తొలి మ్యాచ్ జరుగుతున్న సమయానికి అతను టెస్టులకే దూరమయ్యాడు. సుదీర్ఘకాలం టెస్టు క్రికెట్ ఆడినా సొంత మైదానంలో ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయిన క్రికెటర్ల జాబితాలో ధోని పేరు కూడా చేరింది. ఢిల్లీలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న ధోని... బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్ ఓడితే మాత్రం టెస్టు ప్రారంభమయ్యే సమయానికి నగరంలో ఉండే అవకాశం ఉంది. రాంచీ టెస్టులో ఆటగాడిగా కనిపించకపోయినా, భారత్, ఆస్ట్రేలియా టెస్టు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ప్రతీ పోస్టర్, బ్యానర్లో ధోని మాత్రమే దర్శనమిస్తుండటం విశేషం.