13 ఏళ్ల వయస్సు నుంచే అలవాటైంది..
సుదీర్ఘ ఇన్నింగ్స్‌లపై చతేశ్వర్ పుజారా
ధర్మశాల: రాంచీ టెస్టులో 500కు పైగా బంతులను ఎదుర్కొని పుజారా చేసిన డబుల్ సెంచరీ అపూర్వం. అయితే ఈ సహనం తనకు 13 ఏళ్ల చిన్నవయస్సు నుంచే అలవాటైందని చెబుతున్నాడు. ‘ఓపిగ్గా ఆడడమనేది నా కఠినశ్రమతోనే అలవడింది. నాకు ఎనిమిదేళ్ల వయస్సున్నప్పటి నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 13 ఏళ్లప్పుడు తొలిసారిగా రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో ఆడుతూనే ఉన్నాను. దేశవాళీల్లో నిరంతరం ఆడిన అనుభవంతో పాటు కఠిన ప్రాక్టీస్ కూడా ఓపిగ్గా ఆడేందుకు తోడ్పడింది.
మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతోనే ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ నమోదవుతాయి’ అని పుజారా అన్నాడు. గ్రేడ్ ‘ఎ’లో చేరడంపై తను స్పందించడానికి నిరాకరించాడు. ప్రస్తుతం సిరీస్ మధ్యలో ఉన్నామని, కాంట్రాక్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నాడు. ధర్మశాల బౌన్సీ వికెట్‌పై తమకెలాంటి ఆందోళన లేదని, ఇక్కడ గతంలోనూ చాలా క్రికెట్ ఆడామని గుర్తుచేశాడు. సిరీస్ పోటాపోటీగా సాగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ మ్యాచ్‌కు సంబంధం లేని విషయాలపై మీడియా దృష్టి పెడుతోందని పుజారా అన్నాడు. కోహ్లిని ట్రంప్‌తో పోల్చడం బాధించిందన్నాడు. ‘అలాంటి కామెంట్స్ శోచనీయం. కోహ్లికి మేం పూర్తిగా మద్దతునిస్తున్నాం. క్రికెట్‌కు తను గొప్ప అంబాసిడర్‌లాంటి వాడు’ అని పుజారా స్పష్టం చేశాడు.