మన వైపు తిరిగింది! | team india leading in second test match | Sakshi
Sakshi News home page

మన వైపు తిరిగింది!

Published Tue, Mar 7 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

మన వైపు తిరిగింది!

మన వైపు తిరిగింది!

మెరుగైన స్థితిలో భారత్‌
రెండో ఇన్నింగ్స్‌లో 213/4 
రాణించిన పుజారా, రాహుల్‌
ప్రస్తుతం 126 పరుగుల ఆధిక్యం


హమ్మయ్య... ఎట్టకేలకు టెస్టు సిరీస్‌లో ఒక రోజు భారత్‌ పక్షాన నిలిచింది. ఎట్టకేలకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా మన జట్టు సెషన్‌ మొత్తం ఆడగలిగింది. ఎట్టకేలకు పుజారా, రహానే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ సిరీస్‌లోనే పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగారు. వీరికి తోడు సొంత మైదానంలో లోకేశ్‌ రాహుల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌. వెరసి మూడోరోజు ఆటను భారత్‌ సంతృప్తిగా ముగించగా... తొలిసారి సిరీస్‌లో ఆసీస్‌ వెనుకంజ వేసింది. నాలుగు వికెట్లు నా చేతుల్లోనే అంటూ సోమవారం ఆటలో ముందుగా జడేజా ఆసీస్‌ను కట్టి పడేశాడు. భారీ స్కోరు చేసి ఒత్తిడి పెంచాలనుకున్న ఆ జట్టు జడేజా దెబ్బకు మరో 39 పరుగులకే ఆట ముగించేసింది. అనంతరం తక్కువ వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన భారత్, ప్రత్యర్థి ఆధిక్యాన్ని  మినహాయిస్తే ఒక దశలో 33/4తో నిలిచింది. ఈ స్థితిలో పుజారా, రహానే జోడి తమ ఆటతో మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పింది.

అయితే ఇంకా పూర్తిగా మ్యాచ్‌ చేతుల్లోకి రాలేదు. ఈ పిచ్‌ను చూస్తే తీవ్ర ఒత్తిడిలో 200 పరుగులు ఛేదించడం ఆసీస్‌కు చాలా కష్టమని పిస్తున్నా... పుజారా, రహానే బ్యాటింగ్‌ వారిలో పట్టుదల పెంచవచ్చు.  భారత్‌ ప్రస్తుత ఆధిక్యం 126 పరుగులు, రెగ్యులర్‌ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ సహా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కనీసం మరో వంద పరుగులైనా జతచేసే అవకాశం ఉంది. అదే జరిగితే సిరీస్‌ సమం చేసేందుకు కోహ్లి సేనకు చక్కటి అవకాశం చిక్కినట్లే!  

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు భారత్‌ తమ స్థాయికి తగిన ఆటను ప్రదర్శించింది. ముందుగా ఆసీస్‌ తొలి ఇన్నిం గ్స్‌ను త్వరగా ముగించిన టీమిండియా... ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్‌తో టెస్టులో తమ విజయావకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. చతేశ్వర్‌ పుజారా (173 బంతుల్లో 79 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), అజింక్య రహానే (105 బంతుల్లో 40 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) ఐదో వికెట్‌కు అభేద్యంగా 93 పరుగులు జోడించి క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (85 బంతుల్లో 51; 4 ఫోర్లు) కూడా అర్ధసెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ సాధించిన 87 పరుగుల ఆధిక్యాన్ని తీసివేస్తే భారత్‌ ప్రస్తుతం 126 పరుగులు ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 237/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (6/63) ఆరు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.

సెషన్‌–1: జడేజా మాయ
మూడో రోజు ఆస్ట్రేలియాను తొందరగా ఆలౌట్‌ చేయడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసిన అతను మరో క్యాచ్‌ కూడా అందుకొని పడిన నాలుగు వికెట్లలోనూ భాగస్వామి అయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి స్టార్క్‌ (26) డీప్‌ మిడ్‌ వికెట్‌లో జడేజాకు క్యాచ్‌ ఇవ్వడంతో ఆసీస్‌ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే జడేజా వరుస బంతుల్లో వేడ్‌ (113 బంతుల్లో 40; 4 ఫోర్లు), లయన్‌ (0)లను ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కూడా రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. తన తర్వాతి ఓవర్లోనే హాజల్‌వుడ్‌ (1) వికెట్‌ కూడా తీసి జడేజా కంగారూల ఆట ముగించాడు.      రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రాహుల్, ముకుంద్‌ చకచకా పరుగులు సాధించారు. ఆసీస్‌ పేసర్ల నుంచి కొన్ని షార్ట్‌ బంతులు ఎదురైనా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఇబ్బంది పడలేదు.
ఓవర్లు: 16.4, పరుగులు: 39, వికెట్లు: 4 (ఆస్ట్రేలియా)
ఓవర్లు: 10, పరుగులు: 38, వికెట్లు: 0 (భారత్‌)


సెషన్‌–2: ఆసీస్‌ బౌలింగ్‌ జోరు
లంచ్‌ తర్వాత హాజల్‌వుడ్‌ వేసిన తొలి ఓవర్లోనే ముకుంద్‌ (16) వెనుదిరిగాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లయన్‌ బౌలింగ్‌లో పుజారా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో స్మిత్‌ వదిలేయడంతో భారత్‌కు ఊరట లభించింది. మరో ఎండ్‌లో ఏమాత్రం తడబాటు లేకుండా చక్కటి షాట్లతో దూసుకుపోయిన రాహుల్‌ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే స్లిప్‌లో స్మిత్‌ అద్భుత క్యాచ్‌తో రాహుల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 26వ ఓవర్‌ తొలి బంతికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని భారత్‌ దాటింది. అయితే కొద్ది సేపటికే కోహ్లి (15) వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన జడేజా (2) విఫలం కాగా, మరో ఎండ్‌లో పుజారా క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు.
ఓవర్లు: 29, పరుగులు: 84, వికెట్లు: 4

సెషన్‌–3: కీలక భాగస్వామ్యం
టీ విరామం అనంతరం పుజారా, రహానే కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. గత పది ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 30 పరుగులు దాటగలిగిన రహానే కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ పుజారాకు సహకారం అందించాడు. అప్పుడప్పుడు బంతి అనూహ్యంగా స్పిన్‌ కావడం, అదనంగా బౌన్స్‌ అయినా మొత్తంగా బౌలింగ్‌ ప్రమాదకరంగా మాత్రం కనిపించలేదు. దాంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడాన్ని ఆసీస్‌ బౌలర్లు నిరోధించలేకపోయారు. ఈ క్రమంలో పుజారా 125 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఇదే జోరులో భారత్‌ ఈ సిరీస్‌లో తొలిసారి 200 పరుగుల స్కోరును దాటింది. ఈ సెషన్‌లో కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నా భారత్‌ మాత్రం ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా పట్టుదలగా ఆడటం విశేషం.
ఓవర్లు: 33, పరుగులు: 91, వికెట్లు: 0

బెంగళూరులో వర్షం...  
బెంగళూరు నగరాన్ని సోమవారం రాత్రి వాన పలకరించింది. రాత్రి  8 గంటలు దాటిన తర్వాత నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. భారీగా కాకపోయినా చిన్నపాటి జల్లులతో విరామం లేకుండా అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. సీజన్‌ కాకపోయినా మార్చిలో కూడా కొన్ని సార్లు ఇక్కడ వానలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం మంగళవారం కూడా వాన కొనసాగే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆటకు అంతరాయం కలగవచ్చు. అయితే చిన్నస్వామి స్టేడియంలో భారీ ఖర్చుతో ఇటీవలే ఆధునీకరించిన కొత్త తరహా డ్రైనేజీ వ్యవస్థ వల్ల సాధ్యమైనంత తొందరగా మ్యాచ్‌కు సిద్ధం చేయగలిగే సౌకర్యం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఇక్కడే భారత్, దక్షిణాఫ్రికా టెస్టు భారీ వర్షం కారణంగా రద్దయింది.  

7 ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం జడేజాకిది ఏడోసారి.  

8 ఆసీస్‌పై ఎనిమిది ఇన్నింగ్స్‌ల తర్వాత పుజారా హాఫ్‌ సెంచరీ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement