చింటూగాడు...
టెస్టు క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ స్ట్రయిక్ రేట్‌కు ఉండే విలువ ఏపాటిది? కానీ దూకుడు, కొత్త తరహా క్రికెట్ అంటూ కొత్తగా కెప్టెన్‌గా వచ్చిన సమయంలో హడావిడి చేసిన కోహ్లి కూడా పుజారా స్ట్రయిక్ రేట్‌ను ప్రశ్నించాడు. వేగం పెంచుకోమని సలహా ఇచ్చాడు. ఆడితే రోహిత్ శర్మలా ధాటిగా ఆడాలంటూ పోలిక తెచ్చి మరీ వెస్టిండీస్ సిరీస్‌లో అతడిని ఒక టెస్టులో పక్కన పెట్టారు. అంతకు కొన్నాళ్ల క్రితమే పచ్చికతో నిండిన కొలంబో వికెట్‌పై సహచరులు అంతా చేతులెత్తేసిన వేళ... 456 నిమిషా లు క్రీజ్‌లో నిలిచి అద్భుత సెంచరీతో టెస్టును గెలిపించినప్పుడు ఎవరికీ స్ట్రయిక్ రేట్ గుర్తుకు రాలేదు.
వన్డేల్లో జట్టులో లేని, టి20ల్లో ఎవరూ పట్టించుకోని పుజారా కేవలం వేగం కోసం వెంపర్లాడి ఉంటే ఎటూ కాకుండా పోయేవాడు. కానీ అతను తన శైలిలోనే అందరికీ సమాధానం ఇచ్చాడు. అలసట లేకుండా గంటల పాటు కఠోర సాధన చేయడం అలవాటుగా మార్చుకున్న పుజారా టెస్టు క్రికెటర్‌గా తన విలువేమిటో మైదానంలోనే చూపించాడు. పదకొండు గంటలకు పైగా అదే పట్టుదలతో, ఏకాగ్రతతో ఒకే పని మీద మనసు లగ్నం చేయడం ఎంత మందికి సాధ్యమవుతుంది? కానీ రాంచీలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక గొప్ప బ్యాట్స్‌మన్ లక్షణాలను చూపిం చింది. 500కు పైగా బంతులు ఆడి అతను చూపించిన సహనం ముందు ఎన్నో రికార్డులు అలా తలవంచాయి. చతేశ్వర్ పుజారాకు భారీ స్కోర్లు చేయడం కొత్త కాదు. అండర్–14 స్థాయి నుంచే అతను ట్రిపుల్ సెంచరీలు బాదాడు. సెంచరీ చేసి వచ్చిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోకుండా మ్యాచ్ నడుస్తుండగానే నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం అతనికి తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచే వచ్చిన అలవాటు.
శతకంతో సంతృప్తి చెందకుండా మరింత భారీ స్కోరు చేయడంపైనే అతని దృష్టి. ద్రవిడ్ వారసుడు అంటూ జట్టులోకి వచ్చిన పుజారా దాదాపు ఏడున్నరేళ్ల కెరీర్‌లో ఎన్నో సార్లు పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దుర్బేధ్యమైన డిఫెన్స్, టెక్నిక్ ఉన్నా కూడా సిడ్నీ టెస్టులో, చివరకు బంగ్లాదేశ్‌తో టెస్టులో కూడా తుది జట్టులోకి పుజారాను తీసుకునేందుకు కోహ్లి ఆసక్తి చూపించలేదు. కానీ ఈ హోమ్ సీజన్‌లో భారత్ సాధించిన వరుస విజయాల్లో అతను ఎంత కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత టెస్టులోనే ఆసీస్ పని పట్టిన ‘చింటూ’ ఇప్పుడు మళ్లీ వారికి నరకం చూపించాడు!
ఈ సీజన్‌లో ఆడిన 12 టెస్టులలో పుజారా 66.26 సగటుతో 1,259 పరుగులు చేయడం విశేషం. ఇక మరో టెస్టు ముగిస్తే ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్ వినోదం, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ... ఇలా మరో లోకంలోకి వెళ్లిపోతారు. ఈ సౌరాష్ట్ర క్రికెటర్ మాత్రం ఎప్పటిలాగే ధ్యానమునిలా రాజ్‌కోట్‌లో తన అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందుతున్న అనేక మంది యువ క్రికెటర్ల మధ్యలో ఒకడిగా మారిపోయి నిర్విరామంగా సాధనలో మునిగిపోతాడు. మరో టెస్టు సిరీస్ వచ్చినప్పుడే అతను మళ్లీ అందరికీ గుర్తుకొస్తాడు.
– సాక్షి క్రీడావిభాగం