Dravid
-
రోహిత్ ఫోన్ కాల్‌తో...
బ్రిడ్జ్‌టౌన్: నవంబర్ 19, 2023...వన్డే వరల్డ్ కప్‌లో ఆ్రస్టేలియా చేతిలో భారత్ ఓటమిపాలైన రోజు. ఈ నిరాశాజనక ఫలితంతోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. ఆ స్థితిలో భవిష్యత్తు గురించి ద్రవిడ్‌కూ ఎలాంటి ఆలోచన లేదు. అయితే కొద్ది రోజులకే అతను మళ్లీ కోచ్‌గా పని చేసేందుకు సిద్ధమయ్యాడు. అది ఇప్పుడు టి20ల్లో వరల్డ్ కప్ గెలిచే వరకు సాగింది. అందుకు కారణం రోహిత్ శర్మ. ఓటమి నైరాశ్యంలో ఉన్నప్పుడు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను కోరాడు. అందుకే తాను అంగీకరించినట్లు ద్రవిడ్ వెల్లడించాడు. వరల్డ్ కప్ విజయంతో కోచ్‌గా తన పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సహచరులతో ద్రవిడ్ పలు అంశాలు మాట్లాడాడు. ఇన్ని రోజుల తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘థ్యాంక్యూ రోహిత్...నాకు ఫోన్ చేసి మళ్లీ కోచ్‌గా కొనసాగమని కోరినందుకు. జట్టులోని సభ్యులందరితో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అదో గౌరవంగా భావిస్తున్నా. అయితే రోహిత్‌తో నా బంధం మరింత ప్రత్యేకం. ఎన్నో అంశాలపై మనం చర్చించుకున్నాం.వాదోపవాదాలు జరిగాయి. అంగీకరించడం, తిరస్కరించడం కూడా జరిగాయి. నీతో పని చేసే అవకాశం ఇచ్చిందుకు కృతజ్ఞతలు’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఈ గెలుపు చిరస్మరణీయంగా ఉండిపోతుందని అతను అన్నాడు. ‘ఏం చెప్పాలో మాటలు రావడం లేదు కానీ నాకూ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించిన మీకందరికీ థ్యాంక్స్. కెరీర్లో మీరు సాధించిన పరుగులు, తీసిన వికెట్లు గుర్తుండకపోవచ్చు. కానీ ఇలాంటి క్షణాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.గతంలో ఎంతో చేరువగా వచ్చి కూడా నిరాశపడాల్సి వచ్చింది. అలాంటి వాటినుంచి కోలుకొని మీరు పోరాడిన తీరుతో గర్వంగా ఉన్నాం. మీ కష్టానికి తగిన ఫలితమిది’ అని ద్రవిడ్ ప్రశంసించాడు. ఆటగాళ్ల ప్రదర్శన వెనుక వారి కుటుంబ సభ్యుల త్యాగాలు కూడా ఉంటాయని... తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు కూడా ఈ విజయంలో భాగం ఉంటుందని ద్రవిడ్ చెప్పాడు. |‘ఈ నిజమంతా నిజమేనా’ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్ల సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా లేక రెండు రోజులు అదనంగా బ్రిడ్జ్‌టౌన్‌లో ఉండాల్సి రావడంతో ఆ సమయాన్ని వారు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంకా ఆ ఆనందం నుంచి బయటకు రావడం లేదు. ‘ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. కప్ గెలవడం నిజమే అయినా అసలు అది జరిగిందా లేదా అన్నట్లుగా కూడా అనిపిస్తోంది. రాత్రి నుంచి ఉదయం వరకు కూడా మేమందరం బాగా సంబరాలు చేసుకున్నాం. సరిగా నిద్రపోవడం లేదు కానీ అది సమస్య కాదు. తిరిగి వెళ్లాక దాని కోసం చాలా సమయం ఉంది. ఇక్కడ ప్రతీ సెకన్ను, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్నా. ఫైనల్ గెలిచిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతీది మాకు భావోద్వేగభరితమే. ఇలాంటి విజయం కోసం చాలా కాలంగా ఎంతో శ్రమించాం. ఎంతో కష్టపడిన తర్వాత వచ్చే ఫలితం మరింత ఆనందాన్నిస్తుంది. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్‌పై గడ్డిని చప్పరించడం ముందే అనుకున్నది కాదు. అక్కడికి వెళ్లాక నేను అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమది. మా కలలు నెరవేర్చిన చోటు ఎప్పటికీ మర్చిపోకుండా అలా చేయాలని అనిపించింది’ అని రోహిత్ పేర్కొన్నాడు. నేడు స్వదేశానికి... వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు నేటి సాయంత్రం సొంత గడ్డపై అడుగు పెట్టే అవకాశం ఉంది. బార్బడోస్ దేశంలో తుఫాన్ కారణంగా జట్టు టీమిండియా సభ్యులు రెండు రోజుల పాటు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అయితే మంగళవారం నుంచి ఎయిర్పోర్ట్ రాకపోకలకు సిద్ధమైంది. క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ చార్టర్డ్ ఫ్లయిట్లో వీరంతా నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది. -
Vijay Merchant Trophy: అండర్–16 టోర్నీలో ద్రవిడ్ vs సెహ్వాగ్
సాక్షి, మంగళగిరి: సడెన్‌గా చూస్తే అండర్–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు. ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక అండర్–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్ ద్రవిడ్ (ద్రవిడ్ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్ సెహ్వాగ్ (సెహ్వాగ్ పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు. దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్ కీపర్, కెపె్టన్ అన్వయ్ (0) డకౌటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ (98 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్ ద్రవిడ్ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్ పైచేయి సాధించాడు. -
ఎందుకింత తేడా?
ముంబై: అండర్–19 ప్రపంచకప్ గెలిచేందుకు సుశిక్షిత సేనని సిద్ధం చేసిన కోచ్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. బోర్డు ప్రకటించిన నగదు నజరానాల విషయంలో సమానత్వం లేకపోవడంపై పెదవి విరిచాడు. కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ. 30 లక్షల చొప్పున, కోచ్‌కు రూ. 50 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున పారితోషికాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కోచింగ్ బృందంలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. కానీ ఈ తేడాలేంటో అర్థం కావడంలేదు. సహాయ సిబ్బంది నాణ్యమైన సేవలందించారు. ప్రతి రోజూ జట్టు కోసమే తపించారు. గెలిచేదాకా పట్టు సడలకుండా శ్రమించారు. ఇది ఒక నెలో... రెండు నెలలో కాదు... 14 నుంచి 16 నెలల వరకు జరిగిన సుదీర్ఘ ప్రక్రియ. ఇందులో అలసట ఎరుగని ప్రయాణం చేశారు మావాళ్లు. కుర్రాళ్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నారు. అనేక కసరత్తులు చేశారు. జట్టు ప్రణాళికలు, సన్నాహాలు, వ్యూహ రచన అంతా సమష్టిగానే జరిగింది. ఈ సమష్టితత్వమే కుర్రాళ్లు కప్ గెలవడంలో దోహదపడింది’ అని 45 ఏళ్ల ద్రవిడ్ అన్నాడు. బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఉన్న అడ్వయిజరీ కమిటీని కాదని ద్రవిడ్ జూనియర్ కోచింగ్‌కు మొగ్గు చూపాడు. బోర్డు కూడా ఆయన నిర్ణయానికి సరేనంటూ రూ. 4 కోట్ల వార్షిక చెల్లింపుతో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది. -
'యువ' సేన సిద్ధం
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం రెండో అండర్–19 క్రికెట్ ప్రపంచకప్... ప్రత్యక్ష ప్రసారం మాట దేవుడెరుగు... భారత ఆటగాళ్ళు కైఫ్, సెహ్వాగ్, హర్భజన్ ప్రతీ మ్యాచ్ ముగిసిన తర్వాత సాయంత్రం తమ డార్మిటరీకి దగ్గరిలోని టెలిఫోన్ బూత్‌నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కోర్లు చెప్పేవారు. దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో టోర్నీ జరిగితే, ఆటగాళ్లకు అక్కడి క్యాంపస్‌లోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. మరో రెండేళ్లకు భారత్ టైటిల్ సాధించినా... పరిస్థితి పెద్దగా మారలేదు. మన జట్టు విజయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అంతకు పదేళ్ల క్రితం జరిగిన తొలి టోర్నీలోనైతే ఆస్ట్రేలియాలో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు భారత జట్టు అక్కడే కిట్ కొనుక్కొని బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు... భారత యువ ఆటగాళ్ళకు సీనియర్ పురుషుల జట్టుతో సమానంగా సౌకర్యాలు, బిజినెస్ క్లాస్ ప్రయాణం, భారీ మొత్తంలో దినవారీ భత్యం...ప్రాక్టీస్ సెషన్లు, వార్మప్ మ్యాచ్‌లే కాదు, ఈ టోర్నీకి సంబంధించి అన్ని జట్ల ఆటగాళ్ల ప్రత్యేక ప్రమోషనల్ షూట్లు, జ్ఞాపికలపై సంతకాలు చేయడం...ఇదంతా ఐసీసీ మార్కెటింగ్ ప్రచారం. పాల్గొంటున్న పదహారు జట్ల ఆటగాళ్ల హాజరీతో భారీగా ఆరంభోత్సవ కార్యక్రమం. ఇక మ్యాచ్‌లు 200లకు పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. టి20 లీగ్‌లు వచ్చాక ప్రపంచమంతా కూడా యువ ఆటగాళ్లపై, వారి ప్రదర్శనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లకు ఒకసారి ఆసక్తి రేపుతున్న అండర్–19 వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. న్యూజిలాండ్‌లో జరిగే ఈ సంబరానికి రేపటి నుంచి తెర లేస్తోంది. మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): అంతర్జాతీయ స్థాయిలో కుర్రాళ్లు సత్తా చాటేందుకు సరైన వేదికలాంటి అండర్–19 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఇక్కడి బే ఓవల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తలపడుతుంది. ఫైనల్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరగబోతోంది 12వ వరల్డ్ కప్ కాగా... గత టోర్నీల్లో పాల్గొని ఆ తర్వాత సీనియర్ స్థాయికి ఎదిగిన ఆటగాళ్లు వివిధ జట్లలో అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రతిభను నిరూపించుకొని ప్రమోట్ అయ్యేందుకు యువ ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా గతంలో మూడు సార్లు అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకోగా...పాకిస్తాన్ రెండు సార్లు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. వీరంతా అక్కడినుంచే... అండర్–19 ప్రపంచకప్‌లో తమ ఆటతో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సీనియర్ క్రికెట్లో కూడా తమదైన ముద్ర చూపించిన ఆటగాళ్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. ఇందులో అగ్రస్థానం మాత్రం మన కెప్టెన్ విరాట్ కోహ్లికే దక్కుతుంది. 2008లో తన నాయకత్వంలోనే భారత్‌ను విజేతగా నిలిపిన కోహ్లికి ఆ తర్వాత ఎదురు లేకుండా పోయింది. అదే ఏడాది సీనియర్ జట్టులో తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను... ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా ఎదిగాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, విలియమ్సన్, ఆమ్లా, డి కాక్, రబడ, అంబటి రాయుడు, వేణుగోపాలరావు తదితరులున్నారు. జట్ల వివరాలు గ్రూప్ ‘ఎ’: న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, కెన్యా గ్రూప్ ‘బి’: భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యూగినియా గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నమీబియా, కెనడా గ్రూప్ ‘డి’: పాకిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్ఘానిస్తాన్ భారత్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ జనవరి 14న ఆస్ట్రేలియాతో (ఉ.గం. 5.30నుంచి) జనవరి 16న పపువా న్యూ గినియాతో (ఉ.గం. 6.30) జనవరి 19న జింబాబ్వేతో (ఉ.గం. 6.30నుంచి) 2012 1988లో యూత్ వరల్డ్ కప్ పేరుతో తొలి టోర్నీ జరిగింది. ఆ తర్వాత అండర్–19 ప్రపంచకప్‌ను మళ్లీ నిర్వహించేందుకు పదేళ్లు పట్టింది. 1998నుంచి దీనిని ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్‌గా వ్యవహరిస్తున్నారు. మన సైన్యమిదే... దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే సంచలన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా నేతృత్వంలో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోచ్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కుర్రాళ్లు పట్టుదలగా ఉన్నారు. ఇటీవల ఇదే జట్టు ఆసియా కప్‌లాంటి టోర్నీలలో వరుస విజయాలు సాధించి ఊపు మీదుంది. జట్టు వివరాలు: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఆర్యన్ జూయల్, అభిషేక్ శర్మ, అర్‡్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్జోత్ కల్రా, కమలేశ్ నాగర్కోటి, పంకజ్ యాదవ్, రియాన్ పరాగ్, ఇషాన్ పొరెల్, హిమాన్షు రాణా, అనుకూల్ రాయ్, శివమ్ మావి, శివసింగ్ -
కుర్రాళ్లకు ఇదో సవాల్!
ముంబై: అండర్–19 ప్రపంచకప్‌కు భారత జట్టును సన్నద్ధం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ సేనలోని కుర్రాళ్లను త్వరలోనే భారత్ ‘ఎ’జట్టులో చూడాలనుకుంటున్నారు. న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే ఈ జూనియర్ ప్రపంచకప్ కోసం భారత అండర్–19 జట్టు గురువారం ఉదయం బయల్దేరనుంది. ఈ సందర్భంగా కోచ్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఎంపికైన కుర్రాళ్లెవరికీ కివీస్‌లో ఆడిన అనుభవమే లేదు. దీంతో ఈ ప్రపంచకప్ వాళ్లకు పెద్ద చాలెంజ్. అక్కడ రాణిస్తే తిరుగుండదు. బహుశా వచ్చే 6–8 నెలల్లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడినా ఆడవచ్చు. వాళ్లకది గొప్ప ఘనత అవుతుంది. ఆపై సీనియర్ జట్టుకూ ఎంపిక కావచ్చు’ అని అన్నారు. అయితే వీళ్లలో ఎవరు మేటి ఆటగాళ్లవుతారు? ఎవరు జాతీయ జట్టులోకి ఎంపికవుతారని చెప్పడం తగదన్నారు. ఈ యువ జట్టు కెప్టెన్ పృథ్వీ షా ఇప్పటికే భారత్ ‘ఎ’ తరఫున న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడాడు. ‘భారత ‘ఎ’, అండర్–19 జట్ల కోచ్‌గా నేనెంతో నేర్చుకున్నాను. ఈ తరం కుర్రాళ్లది పూర్తిగా భిన్నమైన నేపథ్యం. వాళ్ల ఆలోచనలు కూడా భిన్నమే. మూడు ఫార్మాట్లను ఆకళింపు చేసుకోగలరు. నిజంగా ఇది పెను సవాల్. ఎందుకంటే ఇప్పుడు ఆట ఎంతో మారింది’ అని ద్రవిడ్ అన్నారు. వచ్చే నెల 13 నుంచి కివీస్‌లో జరిగే మెగా ఈవెంట్లో పృథ్వీ షా సేన చక్కగా రాణిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముందుగా కివీస్ పరిస్థితులకు అలవాటు పడాలన్నారు. బెంగళూరులో నిర్వహించిన శిబిరంలో అలాంటి వాతావరణం కల్పించినప్పటికీ భౌగోళిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. కెప్టెన్ పృథ్వీ షా మాట్లాడుతూ ‘సారథిగా నాకు ఇది సువర్ణావకాశం. అంచనాలకు అనుగుణంగా జట్టును నడిపిస్తాను. ప్రతి ఆటగాడికి తమ వంతు బాధ్యత తెలుసు. భారత్‌ను విజేతగా నిలిపేందుకు వారం తా కష్టపడతారు’ అని అన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లతో స్థానిక వాతావరణానికి అలవాటు పడతామని చెప్పాడు. అండర్–19 మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యుగినియా జట్లతో కలిసి గ్రూప్ ‘బి’లో ఉంది. మరోవైపు సీనియర్ జట్టు కెప్టెన్ కోహ్లి అండర్–19 ఆటగాళ్లతో ప్రత్యే కంగా ముచ్చటించి వాళ్లలో స్ఫూర్తి నింపాడు. -
ద్రవిడ్, జహీర్లకు కుంబ్లే పరిస్థితే..
ముంబై: భారత క్రికెట్ మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తరహాలోనే బీసీసీఐ ద్రవిడ్, జహీర్‌లను ఘోరంగా అవమానిస్తోందని సీఓఏ మాజీ సభ్యుడు రామ చంద్రగుహా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. రామచంద్ర గుహా గత జూన్‌లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పరిపాలక కమిటీ (సీఓఏ) అభ్యర్థిత్వానికి రాజీనామ చేశారు. డ్రామను తలపిస్తూ సాగిన భారత్ హెడ్ కోచ్ ఎంపికను రామచంద్రగుహా తప్పుబట్టాడు. కుంబ్లే, ద్రవిడ్, జహీర్ గొప్ప ఆటగాళ్లని, ఎన్నోవిజయాలు అందించారని వారిని అవమానాలకు గురిచేయవద్దని పేర్కొన్నారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రీ హెడ్ కోచ్‌గా, ద్రవిడ్, జహీర్‌ను విదేశీ పర్యటనలకు బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పరిపాలక కమిటీ (సీఓఏ) హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైనే ఆమోద ముద్ర వేసింది. అయితే బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్, బ్యాటింగ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల నియామకంపై కమిటీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జట్టు సహాయక సిబ్బందిని ఈనెల 22న రవిశాస్త్రిని సంప్రదించాకే నియమించే అవకాశం ఉంది. అయితే బోర్డు చెబుతున్నట్టుగా విదేశీ పర్యటనలోనైనా జహీర్, ద్రవిడ్ జట్టుతో పాటు ఉంటారా? అనే విషయంలో కమిటీ స్పష్టతనివ్వడం లేదు. ఈ విషయంపై స్పందించిన రామచంద్ర గుహా కోచ్ ఎంపికలో రాజకీయలు చేయడం బాధించిందని, కుంబ్లేకు ఎదురైన పరిస్థితే ద్రవిడ్, జహీర్‌కు ఎదురవుతుందని వరుస ట్వీట్లు పోస్టు చేశాడు. గతంలో కూడా రామచంద్ర గుహా బీసీసీఐని ఉద్దేశించి తన రాజీనామాలో ప్రశ్నించారు. క్రికెటర్లు కోచ్, కామెంటేటర్ల ఎంపికలో భాగస్వామ్యులవుతున్నారని హార్షబోగ్లేను తప్పించడంలో కోహ్లీ పాత్రను గుర్తు చేశారు. Kumble, Dravid and Zaheer were true greats of the game who gave it all on the field. They did not deserve this public humiliation. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 The shameful treatment of Anil Kumble has now been compounded by the cavalier treatment of Zaheer Khan and Rahul Dravid. — Ramachandra Guha (@Ram_Guha) 16 July 2017 -
జహీర్, ద్రవిడ్ ఎంపికపై సీఓఏ సమీక్ష!
►సీఏసీ నిర్ణయంపై అసంతృప్తి ►సహాయక సిబ్బంది ఎంపిక కోచ్‌దే... శనివారం సమావేశం న్యూఢిల్లీ: స్టార్లతో కూడిన టీమిండియా జట్టు కోచింగ్ సిబ్బంది ఎంపిక మరో వివాదంగా మారింది. బౌలింగ్ కోచ్ విషయంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి అసంతృప్తితో ఉండగా, ఆయనకు మద్దతుగా అన్నట్టు పరిపాలక కమిటీ (సీఓఏ) కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉంది. నిజానికి జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై సీఓఏ హర్షం వ్యక్తం చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌లను తీసుకోవడంపై కమిటీ అంత సుముఖంగా లేదు. ఈ ఎంపికతో సీఏసీ తమ పరిధిని దాటి వ్యవహరించిందని పరిపాలక కమిటీ భావిస్తోంది. సీఏసీ విధి ప్రధాన కోచ్‌ను ఎంపిక చేయడం వరకే అని, సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది వారి పరిధి కాదని వ్యాఖ్యానించినట్టు మీడియా కథనం. సహాయక సిబ్బందిగా ఎవరుండాలనేది ప్రధాన కోచ్ విచక్షణకే వదిలేయాలని వారి అభిప్రా యం. దీంతో శనివారం ముంబైలో సమావేశం కానున్న సీఓఏ ఈ అంశంపై సమీక్ష చేయనుంది. ‘ద్రవిడ్ ఇప్పటికే అండర్–19, భారత్ ‘ఎ’ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ బాధ్యత ఆయనకు అదనపు భారం కానుంది. శనివా రం సహాయక సిబ్బంది విషయంలో సీఓఏ, బోర్డు ఓ నిర్ణయం తీసుకోనుంది. అంతిమంగా వీరి ఎంపికలో ప్రధాన కోచ్‌కే పూర్తి బాధ్యత ఉంటుంది’ అని సీఓఏ వర్గాలు పేర్కొన్నాయి. ఐ వాంట్ భరత్ అరుణ్: రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు నూతన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి ఇప్పుడు తనకు అనుకూలురైన సహాయక సిబ్బంది కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జట్టు బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ నియామకం శాస్త్రికి రుచిం చడం లేదు. ఆయన స్థానంలో ముందునుంచీ భరత్ అరుణ్‌ను ఈ పోస్టులోకి తేవాలని కోరుకున్నారు. అయితే గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం ఆయన ఇష్టాన్ని పక్కనపెట్టి జహీర్‌కు బౌలింగ్ బాధ్యతలు అప్పగించింది. అయితే జహీర్ పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్‌గా ఏడాదిలో 250 రోజుల పాటు జట్టుకు సేవలందించలేడని, వంద రోజులకు మించి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అందుకే అతడి వేతనం ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో జహీర్ ఉన్నప్పటికీ అతడికి సహాయకంగానైనా భరత్ అరుణ్ కావాల్సిందేనని కొత్త కోచ్ పట్టుబడుతున్నారు. అంతకుముందు జట్టు బౌలింగ్ కోచ్‌గా రవిశాస్త్రి అరుణ్ కోసం గట్టిగానే పట్టుబట్టారు. అరుణ్ తప్ప తనకు ఎవరూ వద్దని శాస్త్రి గట్టిగా వాదించారు. సీఓఏను కలవనున్న రవిశాస్త్రి! ఈ పరిణామాల మధ్య ఈ వారాంతంలో పరిపాలక కమిటీ (సీఓఏ)ని శాస్త్రి కలిసే ఆలోచనలో ఉన్నారు. ‘జహీర్‌పై రవిశాస్త్రికి అత్యున్నత గౌరవం ఉంది. కానీ జట్టుకు ఫుల్‌టైమ్ బౌలింగ్ కోచ్ కావాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. బౌలర్ల కోసం రోడ్ మ్యాప్‌ను జహీర్ రూపొందిస్తే దాన్ని అరుణ్ అమలుపరుస్తాడు. శనివారం సీఓఏను కలిసి శ్రీలంక పర్యటనలోనే అరుణ్‌ను జట్టుతో పాటు పంపాలనే నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2014లో జో డేవిస్ నుంచి బాధ్యతలు తీసుకున్న భరత్ అరుణ్.. శాస్త్రితో కలిసి 2016 వరకు పనిచేశారు. క్రికెట్ కెరీర్ పెద్దగా లేకపోయినా గొప్ప అకాడమీ కోచ్‌గా మాత్రం ఆయన పేరు తెచ్చుకున్నారు. శాస్త్రి, అరుణ్ అండర్–19 నుంచే స్నేహితులు. అరుణ్ ఎన్సీఏ బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న సమయంలో... అప్పుడు టీమ్ డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి ఆయన్ని జట్టు బృందంలో చేర్చుకున్నారు. ఆయన్ని అడిగే నిర్ణయించాం: సీఏసీ టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లుగా జహీర్, రాహుల్ ద్రవిడ్ నియామకం జరిగిపోయినా ఇంకా తన సొంత సహాయక సిబ్బంది కోసం కోచ్ రవిశాస్త్రి పట్టుబట్టడంపై క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు తమను బాధించాయని పరిపాలక కమిటీ (సీఓఏ)కి సీఏసీ లేఖ రాసింది. ‘జహీర్, ద్రవిడ్‌లను తీసుకోవడానికి ముందే శాస్త్రితో మాట్లాడాం. మా ఆలోచనను ఆయన అంగీకరించడంతో పాటు ఈ ఎంపిక జట్టుకు లాభిస్తుందని కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రవిశాస్త్రి అనుమతి తర్వాత జరిగిన ఎంపిక మాత్రమే’ అని ఆ లేఖలో సీఏసీ స్పష్టం చేసింది. మరోవైపు ద్రవిడ్, జహీర్‌ల ను పూర్తిస్థాయిలో కాకుండా ఒక్కో సిరీస్‌ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసినట్లు బీసీసీఐ గురువారం వివరణ ఇచ్చింది. -
రవిశాస్త్రికి జై
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియామకం ►2019 ప్రపంచకప్ వరకు పదవిలో ►బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ►విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ద్రవిడ్ ►బీసీసీఐ అధికారిక ప్రకటన సస్పెన్స్, సుదీర్ఘ డ్రామాకు తెర పడింది. ఎంపిక పరీక్షలో ఊహించిన ఫలితమే వచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, భవిష్యత్తు ప్రణాళికలు ఎవరు ఎలా రూపొందించినా చివరకు కెప్టెన్ కోహ్లి మాటే నెగ్గింది. ఆటగాడిగా, వ్యాఖ్యాతగా అపార అనుభవంతో పాటు కెప్టెన్‌తో ఉన్న సాన్నిహిత్యం అదనపు అర్హతగా మారి రవిశాస్త్రిని అందరికంటే ముందు నిలబెట్టాయి. మంగళవారం సాయంత్రమే ఆయన కోచ్‌గా ఎంపికైనట్లు వార్తలు, ఆ తర్వాత కొద్ది సేపటికి బోర్డు ఖండన, మరికొన్ని గంటల తర్వాత అదే తమ నిర్ణయమంటూ ప్రకటన... కోచ్ ప్రకటన వ్యవహారం మలుపులు తిరిగి చివరకు శాస్త్రి ఎంపికతో ఆగింది. మేనేజర్‌గా, టీమ్ డైరెక్టర్ హోదాలో గతంలో పని చేసిన ఈ ‘ముంబైకర్’ ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచ కప్ వరకు భారత క్రికెట్‌కు దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ‘రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడనేది’ శాస్త్రి తన వ్యాఖ్యానంలో తరచుగా వాడే మాట. అందరూ ముందే రవిశాస్త్రిని కోచ్‌గా కోరుకొని దాని ప్రకారమే దరఖాస్తులు, ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రహసనాన్ని నడిపించారనేది మాత్రం స్పష్టం. ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా 55 ఏళ్ల రవిశంకర్ జయధ్రిత శాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మంగళవారం రాత్రి బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. శాస్త్రికి అండగా నిలిచేందుకు బోర్డు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లను కూడా శిక్షణా బృందంలోకి తీసుకుంది. మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. గతంలో ఏ జట్టుకూ లేని విధంగా ఈ సారి కొత్తగా ‘విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్’ అనే పదవిని బోర్డు సృష్టించింది. మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్ టెస్టు ఫార్మాట్లో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇప్పటికే భారత ‘ఎ’, అండర్–19 జట్లకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కు ఇది అదనపు బాధ్యత. ఈ నెల 26 నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి రవిశాస్త్రి పదవీకాలం ప్రారంభమవుతుంది. అమెరికాలో ఉన్న కోహ్లితో కోచ్ అంశాన్ని చర్చించిన తర్వాతే అతని పేరు ప్రకటిస్తామని సలహా కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ మంగళవారం సాయంత్రం వరకు కూడా చెబుతూ వచ్చారు. చివరకు రాత్రి ఆలస్యంగా శాస్త్రి పేరును వెల్లడించారు. హెడ్ కోచ్ పేరును మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గంగూలీ తెలిపారు. అయితే మంగళవారమే కోచ్ పేరును ప్రకటించాలని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ఒత్తిడి చేయడంతో బీసీసీఐ ఆలస్యం చేయలేదు. నిజానికి కోచ్ పదవి కోసం ముందుగా రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోలేదు. అయితే గడువు పొడిగించిన తర్వాత సచిన్ టెండూల్కర్ సూచనతో ఆయన కూడా రేసులోకి వచ్చారు. కోహ్లి కూడా శాస్త్రి వైపు మొగ్గు చూపుతుండటంతో అవకాశాలు మెరుగయ్యాయి. సోమవారం ఇంటర్వ్యూ తర్వాత కాస్త సందేహాలు రేకెత్తినా... చివరకు భారత మాజీ ఆల్‌రౌండర్‌దే పైచేయి అయింది. వ్యాఖ్యానం నుంచి శిక్షణ వైపు రిటైర్మెంట్ తర్వాత రవిశాస్త్రి అత్యంత విజయవంతమైన కామెంటేటర్‌గా నిలిచారు. సూటిగా, స్పష్టంగా, ప్రవాహంలా సాగే ఆయన వ్యాఖ్యానం క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. కామెంటేటర్‌గా బిజీగా ఉన్న సమయంలో బోర్డు విజ్ఞప్తి మేరకు తొలిసారి 2007లో మేనేజర్ హోదాలో రవిశాస్త్రి భారత జట్టుతో కలిసి బంగ్లాదేశ్ సిరీస్‌కు పని చేశారు. ఆ తర్వాత 2014 ఆగస్టు నుంచి జూన్ 2016 వరకు శాస్త్రి టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డే సిరీస్ నుంచి ఆయన జట్టుతో కలిశారు. భారత్ ఈ సిరీస్ గెలిచింది. 2015 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో కలిసి పని చేశారు. ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌లు ఓడినా... వరల్డ్ కప్‌లో జట్టు సెమీస్ చేరింది. ఫ్లెచర్ తప్పుకున్న తర్వాత స్వతంత్ర డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో భారత్ శ్రీలంక, దక్షిణాఫ్రికాలపై టెస్టు సిరీస్‌లతో పాటు ఆసియా కప్ గెలిచింది. అయితే గత ఏడాది ఆయన తన పదవిని కుంబ్లేకు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ కోచ్ హోదాలోకి వచ్చారు. కుంబ్లేతో పోలిస్తే కఠినంగా ఉండరని, తమకు మంచి స్వేచ్ఛనిస్తారని ఆటగాళ్లు బలంగా నమ్మారు. రాబోయే రెండేళ్లు ఆయన కోచ్‌గా ఎలా పని చేయబోతున్నారన్నది ఆసక్తికరం. ‘చాంపియన్’ ఆటగాడు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు... బ్యాటింగ్ ఆర్డర్లో 1 నుంచి 10వ స్థానం వరకు కూడా బరిలోకి దిగి రాణించిన ఆటగాడు... ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర... నెమ్మదైన బ్యాటింగ్ శైలి, సునీల్ గావస్కర్ అండతోనే కొనసాగాడనే విమర్శ... ఆటగాడిగా రవిశాస్త్రి బయోడేటాలో ముఖ్యాంశాలు ఇవి. ఆయన గురించి వేర్వేరు సమయాల్లో ఎన్ని ప్రతికూల మాటలు వినిపించినా దశాబ్ద కాలానికి పైగా భారత క్రికెట్లో శాస్త్రి శకం కొనసాగింది. స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చి ఆ తర్వాత ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదగడం, ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగం కావడం కేవలం ఆయన పట్టుదల, కఠిన సాధన వల్లే సాధ్యమైంది. తనలో సహజ ప్రతిభ లేదని చాలా సార్లు స్వయంగా చెప్పుకున్న రవిశాస్త్రి... వంద శాతంకంటే ఎక్కువగా మైదానంలో శ్రమించేవారని ఆయన సహచరులు చెప్పే మాట. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ అవార్డు అందుకోవడం శాస్త్రి కెరీర్లో అత్యుత్తమ ఘట్టం. అది ఆయనను ఒక్కసారిగా గ్లామర్ బాయ్ ఇమేజ్ను కూడా తీసుకొచ్చింది. భారత్‌కు ఒకే ఒక టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి... వరుస వైఫల్యాల తర్వాత 30 ఏళ్లకే క్రికెట్‌కు ఆటకు గుడ్‌బై చెప్పారు. ఒకప్పుడు జిడ్డు బ్యాటింగ్‌కు పర్యాయపదంగా నిలిచిన ఆయన రంజీ ట్రోఫీలో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు! ►80 టెస్టుల్లో 3,830 పరుగులు చేసి 151 వికెట్లు తీసిన రవిశాస్త్రి... ►150 వన్డేల్లో 3,108 పరుగులు చేసి 129 వికెట్లుపడగొట్టారు. తన బాధ్యతల నుంచి ఆయన ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నం చేయరు. దేనికైనా ఎదురొడ్డి నిలిచే తత్వం. చురుకుదనానికి చిరునామాలా ఉంటారు. ఆయన మాతో కలిసి పని చేయాలని ఎప్పుడూ కోరుకుంటాం. ఆయన జట్టుతో ఉంటే చాలు అదే మాకు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తుంది. – రవిశాస్త్రి గురించి విరాట్ కోహ్లి అభిప్రాయం -
టెస్టు చరిత్రలో స్పెషల్ రికార్డు
హైదరాబాద్: టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేయడమే అరుదు. అటువంటిది వరుసగా నలుగురు ఆటగాళ్ల శతకాలతో ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేస్తే ఎలా ఉంటుంది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత జట్టు రికార్డును నమోదు చేసిన సందర్భంగా ఆ మ్యాచ్‌ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓపెనర్లు దినేష్ కార్తీక్(129), వసీం జాఫర్(138) శతకాలతో మెరవగా, ఆ పై వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ద్రావిడ్(129) సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ సచిన్(122)లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ లో మరో విశేషమేమిటంటే... 175 పరుగుల వద్ద కార్తీక్ గాయంతో రిటైర్డ్ అవుట్‌గా మైదానం వీడగా క్రీజులో ఉన్న జాఫర్ ద్రావిడ్‌తో ఆడుతూ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్ కూడా గాయంతో రిటైర్ట్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్, ద్రావిడ్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలివికెట్ కు 408 పరుగులు చేసింది. ద్రావిడ్ అవుటవ్వడంతో వినూమన్కడ్-పంకజ్ రాయ్ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్ సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్ శర్మకు తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. -
ద్రవిడ్ శిక్షణలో రాటుదేలుతా: బిల్లింగ్స్
పుణే: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తన బ్యాటింగ్ మరింత మెరుగవుతుందని ఇంగ్లండ్ కీపర్, బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్ నుంచి బిల్లింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకున్నానన్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం, ఒత్తిడిలో ఆడటం మెరుగైనట్లు బిల్లింగ్స్ పేర్కొన్నాడు. ఢిల్లీ మెంటర్ రాహుల్ ద్రవిడ్, కోచ్ ప్యాడి ఆప్టన్ నేతృత్వంలో ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు బిల్లింగ్స్ తెలిపాడు. వారిచ్చే సూచనలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నాడు. వారి అనుభవాలు పంచుకోవడం, సలహాలు ఇవ్వడంతో బ్యాటింగ్‌లో రాటుదేలుతానని బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ మంచి నైపుణ్య ఆటగాళ్లు ఉన్న జట్టు అని , కానీ తొలి మ్యాచ్ బెంగళూరుపై ఓడిపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది మాకు నిజంగా ఊహించలేని ఫలితమని, జరగబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించమని బిల్లింగ్స్ తెలిపాడు. ఐపీఎల్లో ప్రతి జట్టు బలమైనదే అని, ప్రతి జట్టులో హిట్టర్లు, స్పిన్నర్లున్నారని చెప్పాడు. కాకపోతే వారి బలాలను ప్రదర్శించినపుడే ఫలితం ఉంటందన్నాడు. ఢిల్లీలో కేవలం పేస్ బౌలింగ్ కాకుండా మంచి స్పిన్నర్లు జయంత్ యాదవ్, నదీమ్‌లు ఉన్నారని బిల్లింగ్స్ వ్యాఖ్యానించాడు. -
ముల్తాన్..సుల్తాన్.. సెహ్వాగ్
న్యూఢిల్లీ: సరిగ్గా ఇదే రోజు భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచింది. అదే త్రిశతక వీరుడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర రూపం చూపించన రోజు. మార్చి 29, 2004 ప్రపంచ టెస్టు క్రికెట్లోనే అత్యంత వేగమైన త్రిబుల్ సెంచరీ నమోదయింది. ఈ ఘనత వీరు మన దాయాదీ పాకిస్థాన్‌పై సాధించడంతో భారత అభిమానులకు పండుగ దినమైంది. ఈ ఘనత సాధించి నేటికి 13 సంవత్సరాలు. దీన్ని గుర్తు చేసుకుంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెహ్వాగ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ముల్తాన్ టెస్టు రెండో రోజు ఆటలో త్రిశతకం సాధించి భారత్ తరపున తొలి త్రిబుల్ సెంచరీ సాధించన క్రికెటర్‌గా సెహా్వగ్ రికార్డు నమోదు చేశాడు. త్రిబుల్ సెంచరీని వీరు సిక్సర్‌తో సాధించడం కొసమెరుపు. అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డును వీరు అధగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ 39 బౌండరీలు, ఆరు సిక్సర్లతో దాయదులకు చుక్కలు చూపించాడు. వీరు 82.40 స్ట్రైక్‌రేట్‌తో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. వీరు మెరుపు బ్యాటింగ్‌తో భారత్ రెండేరోజుల్లో650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆల్ అవుట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లెర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని తెలిపాడు. -
చింటూగాడు...
టెస్టు క్రికెట్లో బ్యాట్స్‌మన్ స్ట్రయిక్ రేట్‌కు ఉండే విలువ ఏపాటిది? కానీ దూకుడు, కొత్త తరహా క్రికెట్ అంటూ కొత్తగా కెప్టెన్‌గా వచ్చిన సమయంలో హడావిడి చేసిన కోహ్లి కూడా పుజారా స్ట్రయిక్ రేట్‌ను ప్రశ్నించాడు. వేగం పెంచుకోమని సలహా ఇచ్చాడు. ఆడితే రోహిత్ శర్మలా ధాటిగా ఆడాలంటూ పోలిక తెచ్చి మరీ వెస్టిండీస్ సిరీస్‌లో అతడిని ఒక టెస్టులో పక్కన పెట్టారు. అంతకు కొన్నాళ్ల క్రితమే పచ్చికతో నిండిన కొలంబో వికెట్‌పై సహచరులు అంతా చేతులెత్తేసిన వేళ... 456 నిమిషా లు క్రీజ్‌లో నిలిచి అద్భుత సెంచరీతో టెస్టును గెలిపించినప్పుడు ఎవరికీ స్ట్రయిక్ రేట్ గుర్తుకు రాలేదు. వన్డేల్లో జట్టులో లేని, టి20ల్లో ఎవరూ పట్టించుకోని పుజారా కేవలం వేగం కోసం వెంపర్లాడి ఉంటే ఎటూ కాకుండా పోయేవాడు. కానీ అతను తన శైలిలోనే అందరికీ సమాధానం ఇచ్చాడు. అలసట లేకుండా గంటల పాటు కఠోర సాధన చేయడం అలవాటుగా మార్చుకున్న పుజారా టెస్టు క్రికెటర్‌గా తన విలువేమిటో మైదానంలోనే చూపించాడు. పదకొండు గంటలకు పైగా అదే పట్టుదలతో, ఏకాగ్రతతో ఒకే పని మీద మనసు లగ్నం చేయడం ఎంత మందికి సాధ్యమవుతుంది? కానీ రాంచీలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక గొప్ప బ్యాట్స్‌మన్ లక్షణాలను చూపిం చింది. 500కు పైగా బంతులు ఆడి అతను చూపించిన సహనం ముందు ఎన్నో రికార్డులు అలా తలవంచాయి. చతేశ్వర్ పుజారాకు భారీ స్కోర్లు చేయడం కొత్త కాదు. అండర్–14 స్థాయి నుంచే అతను ట్రిపుల్ సెంచరీలు బాదాడు. సెంచరీ చేసి వచ్చిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోకుండా మ్యాచ్ నడుస్తుండగానే నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం అతనికి తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచే వచ్చిన అలవాటు. శతకంతో సంతృప్తి చెందకుండా మరింత భారీ స్కోరు చేయడంపైనే అతని దృష్టి. ద్రవిడ్ వారసుడు అంటూ జట్టులోకి వచ్చిన పుజారా దాదాపు ఏడున్నరేళ్ల కెరీర్లో ఎన్నో సార్లు పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దుర్బేధ్యమైన డిఫెన్స్, టెక్నిక్ ఉన్నా కూడా సిడ్నీ టెస్టులో, చివరకు బంగ్లాదేశ్‌తో టెస్టులో కూడా తుది జట్టులోకి పుజారాను తీసుకునేందుకు కోహ్లి ఆసక్తి చూపించలేదు. కానీ ఈ హోమ్ సీజన్లో భారత్ సాధించిన వరుస విజయాల్లో అతను ఎంత కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత టెస్టులోనే ఆసీస్ పని పట్టిన ‘చింటూ’ ఇప్పుడు మళ్లీ వారికి నరకం చూపించాడు! ఈ సీజన్లో ఆడిన 12 టెస్టులలో పుజారా 66.26 సగటుతో 1,259 పరుగులు చేయడం విశేషం. ఇక మరో టెస్టు ముగిస్తే ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్ వినోదం, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ... ఇలా మరో లోకంలోకి వెళ్లిపోతారు. ఈ సౌరాష్ట్ర క్రికెటర్ మాత్రం ఎప్పటిలాగే ధ్యానమునిలా రాజ్‌కోట్‌లో తన అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందుతున్న అనేక మంది యువ క్రికెటర్ల మధ్యలో ఒకడిగా మారిపోయి నిర్విరామంగా సాధనలో మునిగిపోతాడు. మరో టెస్టు సిరీస్ వచ్చినప్పుడే అతను మళ్లీ అందరికీ గుర్తుకొస్తాడు. – సాక్షి క్రీడావిభాగం -
దూకుడు తగ్గించాల్సిన అవసరం లేదు!
►ఆటగాళ్లకు తమ గురించి బాగా తెలుసు ►భారత కోచ్ కుంబ్లే వ్యాఖ్య రాంచీ: మైదానంలో సహజసిద్ధమైన దూకుడు ప్రదర్శించే భారత ఆటగాళ్లను తాను నిరోధించే ప్రయత్నం చేయనని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. అలాంటి అవసరం కూడా లేదని ఆయన అన్నారు. ‘ఆటగాళ్ల నుంచి మేం ఏం ఆశిస్తున్నామో వారు అలాంటి ప్రదర్శన ఇస్తున్నంత కాలం వారిలోని సహజమైన దూకుడును తగ్గించాలని నేను కోరుకోను. ప్రతీ ఆటగాడికి తనకంటూ కొన్ని అలవాట్లు, శైలి ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం. అయినా ఇప్పుడు సిరీస్ 1–1తో సమంగా ఉంది. ఇరు జట్లు తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి కాస్త దూకుడు ప్రదర్శించడంలో తప్పు లేదు’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్‌రూమ్ రివ్యూ వివాదం విషయంలో భారత్ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయంగా కుంబ్లే అభివర్ణించారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పరిణతితో కూడుకుంది. ఆటకు సంరక్షకులుగా ఇరు జట్ల బోర్డులు కూడా క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం ముఖ్యమని భావించాయి. ఆటగాళ్లకు కూడా తమ బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు’ అని ‘జంబో’ చెప్పారు. డీఆర్ఎస్ వివాదం తమ ఆటపై ఎలాంటి ప్రభావం చూపించదన్న కుంబ్లే... మూడో టెస్టుకు ముందు కోహ్లి, స్మిత్ కూర్చొని పలు అంశాలు చర్చిస్తారనే విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు తనకు డైరెక్టర్ పదవి, ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తారంటూ వచ్చిన వార్తలను తాను కూడా మీడియాలోనే చూశానని, తన వద్దకు అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని కుంబ్లే వివరణ ఇచ్చారు. -
'ఆ ఇద్దరే అత్యుత్తమ క్రికెటర్లు'
కరాచీ: కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ లేరంటా ఇటీవలే కితాబిచ్చుకున్న పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అసిఫ్.. తాజాగా భారత దిగ్గజ ఆటగాళ్ల రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కెరీర్లో కఠినమైన ఆటగాళ్లు ఎవరైనా ఉంటే అది ద్రవిడ్, లక్ష్మణ్లేనని స్పష్టం చేశాడు. తన పరంగా చూస్తే ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరూ సాంకేతికంగా ఎంతో మెరుగైన ఆటగాళ్లని ఆసిఫ్ పేర్కొన్నాడు. 'రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లు ఇద్దరూ..ఇద్దరే. టెక్నికల్ గా వారు ఎంతో నైపుణ్య కల్గినవారు. ఆ ఇద్దరికీ ఆఫ్ స్టంప్ బంతులను వేయాలంటే చాలా భయపడేవాన్ని. వారికి ఆఫ్ స్టంప్ బంతులు వేయడం నాకు ఒక ఛాలెంజ్‌లా ఉండేది' అని ఆసిఫ్ ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరొకవైపు భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై కూడా ఆసిఫ్ ప్రశంసలు కురిపించాడు. సాంకేతికంగా విరాట్ కోహ్లి చాలా మెరుగైన ఆటగాడని, ఈ క్రమంలోనే అతనికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలరైనా అత్యంత శ్రమించక తప్పదన్నాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆసిఫ్.. ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. గతేడాది నిషేధం పూర్తి చేసుకున్న ఆసిఫ్.. ఇంకా తిరిగి పాక్ జాతీయ జట్టులో పునరాగమనం చేయలేదు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో చోటు దక్కించుకునే పనిలో పడ్డాడు ఆసిఫ్. దీనిలో భాగంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతూ సత్తా చాటుకుంటున్నాడు. -
'ద్రవిడ్, జహీర్ లకే నా ఓటు'
మాజీ క్రికెటర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ను భారత క్రికెట్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలోని ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్ ను కోచ్ గా నియమించాలని పేర్కొన్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందన్నారు. ఇరువురి అనుభవంతో భారత క్రికెట్ జట్టుకు ఎంతో లాభం జరుగుతుందనేది తన వ్యక్తి అభిప్రాయం మాత్రమేనని బజ్జీ స్పష్టం చేశాడు కానీ విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ పేరును రికమెండ్ చేశారు కదా అని ప్రశ్నించగా అతనికి కూడా కోచ్ గా ఉండేందుకు అన్ని అర్హతలున్నాయని బజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై బజ్జీ ప్రశంసలు కురిపించారు. కోహ్లి ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందచదగ్గ విషయమన్నాడు. అతనిలో గెలవాలన్న తపన ముచ్చటగొలుపు తుందన్నాడు. ఇండియాలో జరుగుతున్న టీ20 మ్యచ్ ల వల్ల ప్రపంచ టీ20 కి ఇబ్బందులుంటాయనే వార్తలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, ఆర్సీబీలు ప్లే ఆఫ్ చేరుతాయని హర్భజన్ జోస్యం చెప్పాడు. -
అవును... ఢిల్లీయే!
► ఐపీఎల్లో డేర్‌డెవిల్స్ సంచలన విజయాలు ► జట్టు రాత మార్చేసిన కోచ్ ద్రవిడ్ ► అండర్‌డాగ్‌గా వచ్చి అదరగొడుతున్న జహీర్ సేన ఢిల్లీ డేర్‌డెవిల్స్... ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టు. ముఖ్యంగా గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడిన జట్టు. అందుకే ఈసారి కూడా ఐపీఎల్ ఆరంభంలో ఈ జట్టుపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికే ఢిల్లీ జట్టు ప్రకంపనలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రతి ఏటా జట్టు నిండా స్టార్ క్రికెటర్లు... స్టార్ ఆటగాడని భావిస్తే చాలు కోట్లాది రూపాయలు కుమ్మరించిన యాజమాన్యం... అయినా ఫలితం లేక ప్రతి ఏటా జట్టులో మార్పులు... ఇలాంటి స్థితిలో ఈసారి మాత్రం వ్యూహం మార్చారు. కోచ్‌గా ద్రవిడ్‌ను తీసుకున్నాక... రాజస్తాన్ రాయల్స్ తరహాలో లో ప్రొఫైల్ క్రికెటర్లను తీసుకున్నారు. ఇప్పుడు వారితోనే మ్యాజిక్ చేస్తున్నాడు ‘మిస్టర్ డిపెండబుల్’ ద్రవిడ్. సాక్షి క్రీడావిభాగం ఈసారి ఐపీఎల్లో కాస్త అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ స్కోర్లు చేస్తున్నా మ్యాచ్‌లు కాపాడుకోలేకపోతోంది. కెప్టెన్ కూల్ ధోనికి సరైన జట్టు లేక పుణే వెనుకబడి పోయింది. స్టార్ క్రికెటర్లతో నిండిన ముంబై, హైదరాబాద్ పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తున్నాయి. కానీ ఈ జట్లన్నింటికీ భిన్నంగా లో ప్రొఫైల్ క్రికెటర్లతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దూసుకుపోతోంది. ద్రవిడ్ మార్క్ ఈ ఏడాది ఐపీఎల్ వేలం సమయానికి ఢిల్లీ జట్టు ద్రవిడ్ తమ కోచ్ అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అప్పటికే ద్రవిడ్‌తో చర్చలు పూర్తయ్యాయి. తనతో పాటు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు పని చేసిన ప్యాడీ ఆప్టన్‌ను కూడా తీసుకుని ద్రవిడ్ ‘పని’ ప్రారంభించాడు. అండర్-19 జట్టు కోచ్‌గా పని చేసిన సమయంలో యువ క్రికెటర్లను మరింత దగ్గరగా గమనించిన ద్రవిడ్... రాజస్తాన్‌లోని పాత ఆటగాళ్లలో నుంచి యువ క్రికెటర్లను తీసుకోవాలని సూచించాడు. సంజు శామ్సన్ కోసం రూ.4.2 కోట్లు ఖర్చు చేసిన ఢిల్లీ యాజమాన్యం... రిషబ్ పంత్ కోసం ఏకంగా రూ.1.9 కోట్లు వెచ్చించింది. పంత్‌కు అంత డబ్బెందుకనే మాట వినిపించినా... ద్రవిడ్ అడగడం వల్ల కొనేశారు. తాజాగా గుజరాత్‌పై పంత్ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ద్రవిడ్ గొప్పతనం మరోసారి తెలిసొచ్చింది. అలాగే బ్రాత్‌వైట్, మోరిస్ ఇద్దరి కోసం కలిపి ఏకంగా రూ.11.2 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఇద్దరూ విలువైన ఆటగాళ్లని నిరూపించుకున్నారు. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన ద్రవిడ్... కుర్రాళ్లలో స్ఫూర్తి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. అందరికీ అవకాశాలు ఢిల్లీ తమ కెప్టెన్‌గా జహీర్ ఖాన్ పేరు ప్రకటించగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కెప్టెన్‌కు అనుభవం ఉండాలని భావించిన ద్రవిడ్ సూచన మేరకే ఈ నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న జహీర్... తన అనుభవాన్నంతా మైదానంలో చూపిస్తున్నాడు. ఇక తుది జట్టు విషయంలోనూ ద్రవిడ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. గతేడాది స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ నుంచి డుమిని వరకు ఎవరినైనా కూర్చోబెడుతున్నాడు. ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో తుది జట్టులోకి తేవడం ద్వారా ప్రతి మ్యాచ్‌కూ అందరూ సన్నద్ధంగా ఉండేలా చూస్తున్నాడు. ఎవరికి అవకాశం వచ్చినా సత్తా చాటాలనే కసి ఆటగాళ్లలో పెంచాడు. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకాన్ని కూడా బాగా పాటిస్తున్నారు. నిజానికి కోచ్ కొత్తగా ఆటగాళ్లకు క్రికెట్ నేర్పాల్సిన అవసరం లేదనేది ద్రవిడ్ ఆలోచన. వాళ్లలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతూ వారిలో స్ఫూర్తి నింపడమే కోచ్ పని అనేది ద్రవిడ్ అభిప్రాయం. ‘అండర్-19 జట్టుతో ఆడిన సమయం నుంచి ద్రవిడ్ సర్ చెప్పిన మాటలను ఆచరిస్తున్నాను. ఆటతీరును బాగా మార్చుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎదురుగా ఏ స్థాయి బౌలర్ ఉన్నా ఆడగలననే ఆత్మవిశ్వాసాన్ని ఆయన పెంచారు’ అని రిషబ్ పంత్ చెప్పిన మాటలే ద్రవిడ్ ప్రభావానికి ఉదాహరణ. పని చేసిన క్యాంప్‌లు సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టు మూడు క్యాంప్‌లు నిర్వహించింది. జట్టులోని 24 మంది ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది అందరూ వీటిలో పాల్గొన్నారు. వీటిలో మ్యాచ్‌ల గురించి, వ్యూహాల గురించి ఏ మాత్రం చర్చించలేదు. కేవలం ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కోచ్‌లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే నెట్ ప్రాక్టీస్ సమయంలో ద్రవిడ్ పెద్దగా మాట్లాడడు. ఒకేసారి ఐదు నెట్స్‌ను గమనిస్తూ ఆప్టన్‌కు కొన్ని సూచనలు చెబుతాడు. ‘రాహుల్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎదగడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తారు. ఏదైనా ఒక మార్పు చేసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని మనకే ఇస్తారు’ అని మోరిస్ చెప్పాడు. ఆటగాళ్లలో ఉత్సాహం సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి తర్వాత ఈ సీజన్లోనూ ఢిల్లీ రాత మారదనే మాట వినిపించింది. కానీ ఆ మ్యాచ్ తర్వాత జహీర్ ఓ మాటన్నాడు. ‘మేం ఏం చేయాలో, ఎలా ఆడాలో మాకు స్పష్టత ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓటమి మాపై ప్రభావం చూపదు. రాబోయే రోజుల్లో మీరు మా నుంచి మంచి విజయాలు చూస్తారు’ అన్నాడు. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ గెలుపును కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అటు పంజాబ్ కూడా అంత బలమైన జట్టేమీ కాదు కాబట్టి తేలిగ్గా తీసుకున్నారు. కానీ మూడో మ్యాచ్‌లో బెంగళూరుపై ఏకంగా 192 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్ల విజయం సాధించగానే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటికీ వన్ మ్యాచ్ వండర్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై 164 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారు. గుజరాత్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా అమోఘంగా ఆడి విజయం అంచుల్లోకి వచ్చారు. కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోల్‌కతా, గుజరాత్‌లపై సులభమైన విజయాలతో లీగ్‌లో నాకౌట్ బెర్త్‌కు చేరువయ్యారు. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు బాధ్యతగా ఆడటం పెద్ద సానుకూలాంశం. ప్రస్తుతం ఢిల్లీ ఆడుతున్న తీరు... మిగిలిన మ్యాచ్‌లను పరిశీలిస్తే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడం ఖాయమే. ఇక ఈ సీజన్ చివరికి ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. -
రేసులోకి రాహుల్ ద్రవిడ్!
భారత జట్టు కోచ్ పదవి న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ టీమిండియా కొత్త కోచ్‌గా పగ్గాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా జట్టుకు ప్రత్యేకంగా కోచ్‌గా ఎవరూ లేకపోయినా టీమ్ డెరైక్టర్ హోదాలో రవిశాస్త్రి వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆయనతో ఒప్పందం టి20 ప్రపంచకప్ వరకే ఉండడంతో కొత్త కోచ్ నియామకంఅనివార్యమైంది. ఈవిషయంపై సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ సలహా కమిటీ నేడు (సోమవారం) సమావేశం కానుంది. అయితే ఈ కమిటీ ఇప్పటికే జట్టు చీఫ్ కోచ్‌గా ఉండేందుకు ద్రవిడ్‌ను సంప్రదించిందని, ఈ కీలక బాధ్యతలను తీసుకునే విషయంలో ఆయన ఆలోచిస్తానని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ జూన్ నుంచి వచ్చే మార్చి వరకు భారత జట్టు 18 టెస్టు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. దీంతో ఈ ఫార్మాట్లో అపార అనుభవమున్న ద్రవిడ్ సేవలను ఉపయోగించుకోవాలని బోర్డు భావిస్తోంది. భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్... ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా ఉన్నారు. -
ఆటను మార్చేద్దాం!
ఊర్లలో సరదాగా ఆడుకునే మ్యాచ్‌లు కావచ్చు... పట్టణాల్లో పాఠశాల స్థాయి క్రికెట్ కావచ్చు... నగరాల్లో క్లబ్ క్రికెట్ కావచ్చు... చాలా సాధారణంగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. బాగా ఆడే క్రికెటర్లు ఒక నలుగురు జట్టులో ఉంటారు. వాళ్లే బౌలింగ్ చేస్తారు, వాళ్లే బ్యాటింగ్ చేస్తారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదేస్తారు. మిగిలిన ఏడుగురూ ఫీల్డర్లుగా మాత్రమే పనికొస్తారు. మరో ముగ్గురు లేదా నలుగురిని మంచినీళ్లు ఇవ్వడానికి మాత్రమే వాడుకుంటారు. దేశం తరఫున ఆడే పోటీ క్రికెట్లో విజయం ముఖ్యం కాబట్టి... బాగా ఆడే నలుగురు ముందే ఆడినా అభ్యంతరం లేదు. కానీ నైపుణ్యం వెలుగులోకి రావాల్సిన జూనియర్ స్థాయి క్రికెట్లోనూ ఇదే జరుగుతోంది. దీనివల్ల చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు. రోజంతా స్కూల్ మానేసి కూడా పిల్లలు బెంచ్ మీద కూర్చుని ఆట చూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు వెలుగులోకి రావడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఏ స్థాయి క్రికెట్లో అయినా విజయం ముఖ్యం. కచ్చితంగా మన దగ్గర ఉన్న ఉత్తమ క్రికెటర్లను ఆడించి ప్రత్యర్థిని ఓడించాలి. ఏ కోచ్ అయినా, ఏ అకాడమీ అయినా, ఏ కెప్టెన్ అయినా ఇదే ఆలోచిస్తాడు. అండర్-16 స్థాయి దాటిన తర్వాత ఈ వ్యవస్థ ఉన్నా ఫర్వాలేదు. కానీ పిల్లల్లో ప్రతిభను వెలికితీయాల్సిన స్థాయిలోనూ ఇదే జరుగుతోంది. భారత క్రికెట్‌కు ఇది ఎంతమాత్రం మంచిది కాదనేది ద్రవిడ్ అభిప్రాయం. దీనివల్ల పిల్లల సమయం వృథా అవడం తప్ప ఉపయోగం లేదని చెబుతున్నాడు. మరోవైపు సచిన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే ఈ ఇద్దరు క్రికెట్లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్లో ఈ మార్పులు చేస్తే ఎక్కువ మంది వెలుగులోకి వస్తారని ఇద్దరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. సచిన్ చేసిన ప్రతిపాదనలను ముంబై క్రికెట్ సంఘం కొంతమేరకు అంగీకరించింది. అయితే చిన్న మార్పులతో వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. -సాక్షి క్రీడావిభాగం ద్రవిడ్ ప్రతిపాదనలు * ఫుట్‌బాల్‌లో మాదిరిగా స్కూల్ స్థాయి క్రికెట్లో సబ్స్టిట్యూట్లను విరివిగా వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి. * బ్యాటింగ్, బౌలింగ్‌లో కచ్చితంగా రొటేషన్ పద్ధతిని పాటించాలి. * జూనియర్ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలి. దీనివల్ల కుర్రాడు ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆసక్తి పెంచుకుంటాడు. * ఓ బ్యాట్స్‌మన్ అర్ధసెంచరీ చేస్తే ఇక అతను రిటైరవ్వాలి. జట్టు మూడు వికెట్లు కోల్పోతేనే మళ్లీ అతను బ్యాటింగ్‌కు రావాలి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. * క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ సెంచరీ తర్వాత కూడా అలాగే కొనసాగితే తర్వాతి మ్యాచ్‌లకు కూడా అతనిపైనే ఎక్కువ ఆధారపడతారు. దీనివల్ల ఆటగాళ్లలోని సహజ నైపుణ్యం, అంకితభావం దెబ్బతింటాయి. ఖాళీగా కూర్చోవడం, వాటర్ బాటిల్స్ అందించడం మినహా మిగిలిన వారికి పని ఉండదు. * మ్యాచ్‌లో బౌలర్ గరిష్టంగా మూడోవంతు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించాలి. * ఎవరైనా బౌలర్ ఐదు వికెట్లు తీస్తే అతన్ని బౌలింగ్ నుంచి తప్పించాలి. * స్కూల్ స్థాయి మొదలుకొని అండర్-15 వరకు ఇదే పద్ధతిని కొనసాగించాలి. అప్పుడు కుర్రాళ్లలో నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికి తీయొచ్చు. * జూనియర్ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే సరైన అవకాశాల్లేక వాళ్లలోని ప్రతిభ మరుగున పడిపోతుంది. అలాగే వాళ్ల తల్లిదండ్రులు కూడా ఆటపై ఆసక్తి చంపేసుకుంటారు. అవకాశాలు ఇచ్చినప్పుడే ఏదో ఓ రూపంలో అతనికి ప్రోత్సాహం అందుతుంది. సచిన్ ప్రతిపాదనలు * ఇంటర్ స్కూల్ మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందికి అవకాశం ఇవ్వాలి. దీనివల్ల మైదానానికి వచ్చిన ప్రతి పిల్లాడికీ ఆడే అవకాశం వస్తుంది. * బ్యాటింగ్ సమయంలో నిఖార్సైన ఏడుగురు బ్యాట్స్‌మన్ ఆడాలి. * బౌలింగ్ సమయంలో నాణ్యమైన బౌలర్లకు ఆరుగురికి అవకాశం ఇవ్వాలి. ఇందులో పేసర్లయినా స్పిన్నర్లయినా ఉండొచ్చు. * ఫీల్డింగ్‌లో మాత్రం 11 మందినే కొనసాగించాలి. మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఇద్దరిని సబ్‌స్టిట్యూట్‌గా అనుమతించాలి. * దీనివల్ల కుర్రాళ్లకు సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆటపై ఆసక్తి ఏర్పడుతుంది. లేదంటే... రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన క్రికెటర్ కొన్నాళ్లకు తమ సహజ నైపుణ్యాన్ని మర్చిపోతాడు. * ఆటగాళ్ల సంఖ్య పెరిగితే జట్టు మేళవింపులో భిన్నత్వం పెరుగుతుంది. దీంతో జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్‌గా తయారవుతారు. ఒక్కరిపైనే ఆధారపడే భావన తగ్గుతుంది. రిజర్వ్ బెంచ్ సత్తా పెరుగుతుంది. * గాయాలు, ఫిట్నెస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా సమష్టితత్వం పెంపొందుతుంది. * 2013లో రిటైర్మెంట్ తర్వాత సచిన్ ఈ ప్రతిపాదన చేశాడు. * సచిన్ చేసిన ఈ ప్రతిపాదనను మొదట తిరస్కరించిన ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అండర్-14 విభాగంలో 11 మంది క్రికెటర్లకు బదులు 13 మందికి అవకాశం ఇవ్వనుంది. ఇద్దర్ని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొవచ్చు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయొచ్చు. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. సచిన్ 15 మందిని ప్రతిపాదిస్తే... ప్రస్తుతం 13 మందితో దీనిని ఆచరణలోకి తెచ్చారు. -
'వీళ్లేమీ సచిన్‌లు, ద్రావిడ్‌లు కారు'
కొలంబో: ప్రస్తుత టీమిండియా బ్యాట్స్‌మెన్.. సచిన్, ద్రావిడ్‌లు కారని, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఈ దిగ్గజాలతో పోల్చరాదని శ్రీలంక కెప్టెన్ ఏంజిలో మాథ్యూస్ అన్నాడు. సచిన్, ద్రావిడ్‌ల మాదిరిగా భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో ఆడలేరని మాథ్యూస్ చెప్పాడు. తొలి టెస్టులో 176 పరుగుల లక్ష్యసాధనలో టీమిండియా బ్యాట్స్‌మెన్ స్పిన్‌కు తడబడి 63 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. భారత్, శ్రీలంకల మధ్య గురువారం నుంచి రెండో టెస్టు జరగనుంది. మ్యాచ్ ముందు రోజు బుధవారం మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్‌లో ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. భారత జట్టులో ఏ క్రికెటర్‌నూ సచిన్, ద్రావిడ్‌లతో పోల్చరాదని చెప్పాడు. భారత యువ బ్యాట్స్‌మెన్‌ను సచిన్, ద్రావిడ్‌లతో ఎలా పోల్చరాదో.. తమ జట్టులోని యువ ఆటగాళ్లను మహేల జయవర్ధనె, సంగక్కరలతో పోల్చరాదని మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. -
'ధోనీ, ద్రావిడ్, కోహ్లీలను ఫాలోఅవుతా'
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ లక్షణాలు తనకు ఆదర్శమని జింబాబ్వే పర్యటనలో భారత్‌కు నాయకత్వం వహించనున్న యువ ఆటగాడు అజింక్యా రహానె అన్నాడు. ధోనీలోని ప్రశాంతత, కోహ్లీలోని దూకుడును నియంత్రించుకునే తత్వం, ద్రావిడ్ నిరాండబరత వంటి లక్షణాలు తనకు ఇష్టమని, వాటిని అలవరచుకుంటానని రహానె చెప్పాడు. జింబాబ్వే పర్యటనకు రహానె సారథ్యంలో భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్‌తో పాటు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువకులకు అవకాశం కల్పించారు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, అతడి నాయకత్వ లక్షణాలు తనకెంతో ఇష్టమని రహానె ప్రశంసించాడు. ఇక దూకుడును ఎలా నియంత్రించుకోవాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలని చెప్పాడు. ఇక రాహుల్ ఎంతో సింపుల్‌గా ఉంటారని కితాబిచ్చాడు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకుని జట్టును నడిపిస్తానని రహానె చెప్పాడు. -
దాదాతో పనిచేసేందుకు ద్రావిడ్ అయిష్టత?
-
దాదాతో పనిచేసేందుకు ద్రావిడ్ అయిష్టత?
ముంబై: బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా మండలిలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లకు చోటు కల్పించారు. వీరి సమకాలీనుడైన మరో దిగ్గజం రాహుల్ ద్రావిడ్ పేరు ఈ కమిటీలో లేకపోవడం క్రికెట్ వర్గాలకు వెలితిగా కనిపిస్తోంది. ద్రావిడ్ టీమిండియా కెప్టెన్‌గా పనిచేశాడు. ఎంతో అనుభవజ్ఞుడు కూడా. అలాంటి ద్రావిడ్‌ను బోర్డు విస్మరించడం సందేహాలకు తావిస్తోంది. బీసీసీఐ సలహా కమిటీలోకి సచిన్, గంగూలీ, ద్రావిడ్‌లను తీసుకోవాలని బోర్డు తొలుత భావించినట్టు సమాచారం. అయితే ఈ కమిటీలో చేరేందుకు ద్రావిడ్ నిరాకరించాడని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గంగూలీతో ద్రావిడ్‌కు ఉన్న విభేదాలే కారణమని చెబుతున్నారు. సలహా కమిటీలో దాదాతో కలసి పనిచేయడానికి ద్రావిడ్ అయిష్టత వ్యక్తం చేశాడని భావిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలను ఉదాహరిస్తున్నారు. ద్రావిడ్ నిరాకరించడంతో అతని స్థానంలో హైదరాబాదీ లక్ష్మణ్‌ను కమిటీలోకి తీసుకున్నట్టు క్రికెట్ వర్గాల సమాచారం. ఇదిలావుండగా ద్రావిడ్‌ను కోచ్‌గా నియమిస్తారని, అందువల్లే సలహా కమిటీలో స్థానం కల్పించలేదన్నది మరో వాదన. -
కోచ్ ఎంపిక ‘త్రిమూర్తుల’ చేతుల్లో...
* కమిటీలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ * బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేయడంలో ముగ్గురు మాజీ దిగ్గజాలు కీలక పాత్ర పోషించనున్నారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన బోర్డు వర్కింగ్ కమిటీ అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు. టీమిండియా శిక్షకుడిని ఎంపిక చేయడంపై వీరు ముగ్గురూ తమ సూచనలు, సలహాలు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులకు అందజేస్తారు. దీంతో కోచ్ పదవికి గంగూలీ రేసులో ఉన్నట్లు ఇటీవల వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లే. త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానుండగా... అసిస్టెంట్ కోచ్‌లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లు మాత్రం ఇకపై కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆటను మరింతగా అభివృద్ధి చేసేందుకు మాజీ ఆటగాళ్లతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. న్యాయ సలహా కోసం: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ విలువను కేవలం రూ. 5 లక్షలుగా చూపడంపై వర్కింగ్ కమిటీలో తీవ్ర చర్చ జరిగింది. పలువురు సభ్యులు దీనిపై ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. మార్కెట్ విలువ కనీసం రూ. 1500 కోట్లు ఉండే జట్టును ఏ లెక్క ప్రకారం రూ. 5 లక్షలుగా చూపించారని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గట్టిగా నిలదీశారు. అయితే ఈ అంశంపై బోర్డు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై తాజాగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మాత్రం నిర్ణయించారు. ‘అర్జున’కు రోహిత్ పేరు ప్రతిపాదన: మరోవైపు కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని కూడా వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. బుకీతో బోర్డు కార్యదర్శి! ముంబై: బీసీసీఐ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన అనురాగ్ ఠాకూర్ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... కరణ్ గిల్హోత్రా అనే అనుమానిత బుకీతో ఠాకూర్ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఒక పార్టీలో కరణ్‌కు స్వయంగా ఠాకూర్ కేక్ తినిపిస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్‌యూ) వద్ద ఉన్న బుకీల జాబితాలో కరణ్ పేరు కూడా ఉండటం వివాదానికి కారణమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాలుగు రోజుల క్రితం ఐసీసీ, బీసీసీఐకి ఘాటుగా లేఖ రాసినట్లు తెలిసింది. ఫిక్సింగ్ మాయలో పడకుండా ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ బీసీసీఐ ఏసీఎస్‌యూ డెరైక్టర్ రవి సవాని 2014లో అన్ని ఐపీఎల్ జట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కరణ్ గిల్హోత్రాకు దూరంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. అయితే ఐసీసీ లేఖ రాసి నాలుగు రోజులు దాటినా బీసీసీఐ దానికి స్పందించలేదు. శ్రీనివాసన్ గూఢచర్యం!: మరోవైపు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ గతంలో తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోర్డు సభ్యులపైనే గూఢచర్యానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సహచరుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, ఇ-మెయిల్స్ హ్యాక్ చేసేందుకు శ్రీనివాసన్ లండన్‌కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీని ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన దాదాపు రూ. 14 కోట్ల బోర్డు సొమ్మునే వాడినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది. -
ఎవరికిస్తారు పగ్గాలు?
♦ భారత క్రికెట్ జట్టు కోచ్ రేసులో గంగూలీ, ద్రవిడ్ ♦ డెరైక్టర్‌గా కొనసాగాలనుకుంటున్న శాస్త్రి ♦ ఆసక్తికరంగా కొత్త కోచ్ ఎంపిక ముంబై : భారత క్రికెట్ కోచ్ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో రాబోయే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించాలి. ఈ పదవి కోసం అందరికంటే ఎక్కువగా గంగూలీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ద్రవిడ్‌ను కోచ్‌ను చేయాలని బీసీసీఐలోని పెద్దలు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద క్రికెటర్లు కాకుండా బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలాంటి లో ప్రొఫైల్ కోచ్ ను నియమించి టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలనేది మరో ప్రతిపాదన. ► భారత జట్టు కోచ్ కోసం తొలుత బీసీసీఐ ప్రకటన చేయాలి. ఆసక్తి ఉన్న వాళ్లంతా ఈ పదవి కోసం అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత కోచ్‌గా తమ పనితీరు ఎలా ఉండబోతోందనే ప్రజెంటేషన్ ఇవ్వాలి. దీని తర్వాత బీసీసీఐ అధికారులు, మాజీ కెప్టెన్లు కలిసి చేసే ఇంటర్వ్యూలో పాసవ్వాలి. కాబట్టి కోచ్ ఎంపిక పెద్ద తతంగం. ► కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ గంగూలీ అమితాసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసి బెంగాల్ టైగర్ ఇప్పటికే దీని గురించి చర్చించాడు. అయితే దాల్మియా నుంచి ప్రస్తుతానికి దాదాకు ఎలాంటి హామీ రాలేదు. అయితే తనకు క్రికెట్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, కోచ్ పదవిపై ఆసక్తిలేదని గంగూలీ చెప్పినట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ► రాజస్తాన్ రాయల్స్ మెంటార్‌గా అద్భుతమైన విజయాలతో ద్రవిడ్ కోచ్ పదవికి సరిపోతానని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా ద్రవిడ్ భారత జట్టు కోచ్‌కు అసలైన అర్హుడంటూ బీసీసీఐలోని కొందరు పెద్దలు అంటున్నారు. ద్రవిడ్‌తో మాట్లాడి కోచ్ పదవికి అప్లికేషన్ ఇప్పించాలని వీళ్ల ఆలోచన. ► ద్రవిడ్, గంగూలీలలో ఎవరు కోచ్‌గా వచ్చినా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారుతుంది. ప్రస్తుతం జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి ఉన్నారు. పెత్తనం అంతా ఆయనదే. ఈ ఇద్దరిలో ఎవరు కోచ్ అయినా దీనికి ఒప్పుకోరు. కాబట్టి అప్పుడు డెరైక్టర్ పదవిని రద్దు చేయాలి. ► రవిశాస్త్రి కూడా డెరైక్టర్ పదవిలో కొనసాగాలనే ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. సంజయ్ బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలలో ఒకరిని కోచ్‌గా చేసి రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా కొనసాగడం ఓ ప్రత్యామ్నాయం. ► ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ టోర్నీ ముగిశా క కూడా భారత జట్టుకు రెండు నెలల పాటు టోర్నీలు లేవు. కాబట్టి కోచ్ ఎంపికపై తొందరపాటు లేకుండా బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. -
మిస్ యు లీడర్
‘పిల్లల స్కూల్‌కు వెళ్లి వాళ్ల చదువు గురించి టీచర్స్‌తో మాట్లాడటం... సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనడం... ఇవన్నీ కొత్తగా, కాస్త కష్టంగా కూడా ఉన్నాయి’... ఏడాదిన్నర క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ద్రవిడ్ వ్యాఖ్యలు ఇవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్టే లోకంగా బతికిన వ్యక్తి రిటైర్ అయిన తర్వాత జీవితానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. భారత దిగ్గజాలకు మాత్రం ఐపీఎల్ వల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా కొంతకాలం క్రికెట్ ఆడే అవకాశం లభించింది. ద్రవిడ్ లాంటి దిగ్గజం ఆటను మరో ఏడాదిన్నర పాటు చూసే అవకాశం అభిమానులకు లభించింది. చాంపియన్స్ లీగ్‌తో ద్రవిడ్ పూర్తిస్థాయిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఆటతో అతడి అనుబంధం మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే టీవీ కామెంటేటర్‌గా మంచిపేరు తెచ్చుకున్నాడు. ద్రవిడ్ లాంటి క్రికెట్ మేధావి సేవలను ఉపయోగించుకోవడానికి బ్రాడ్‌కాస్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక రూపంలో ద్రవిడ్ సేవలను ఉపయోగించుకుంటామని రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్రకటించింది. అతడిని మెంటర్‌గా నియమించుకునేందుకు దాదాపు అన్ని ఐపీఎల్ జట్లూ ఆసక్తి చూపుతాయి. కాబట్టి మరికొంత కాలం ద్రవిడ్ అభిమానులకు కనిపిస్తూనే ఉంటాడు. క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్రలో ఎప్పటికీ మిగిలే ఆటగాళ్లు కొందరే ఉంటారు. ఏ ఫార్మాట్లో అయినా ద్రవిడ్ ‘జట్టు’ కోసం ఆడాడు. గత రెండు దశాబ్దాల్లో మిస్టర్ డిపెండబుల్ తరహాలో ఓపికగా టెస్టులు ఆడిన క్రికెటర్ మరొకరు లేరు. సహచరులంతా బ్యాటింగ్ చేయడానికి బెంబేలెత్తే పిచ్‌పై ‘వాల్’ గంటల కొద్దీ ఆడతాడు. 2003లో ఆస్ట్రేలియాపై రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 835 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై ఒకే టెస్టులో 12 గంటలకు పైగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి క్రికెటర్లలో ఇంత సహనం, ఓపిక ఉండేవారు అరుదు. ఈ రెండు లక్షణాలతో పాటు టెక్నిక్ కూడా ద్రవిడ్ సొంతం. కేవలం టెక్నిక్ కారణంగానే ఉపఖండం ఆవల కూడా ద్రవిడ్ భారత బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకలా నిలబడ్డాడు. ఇలా ద్రవిడ్ ఆట గురించి మూడు రోజుల పాటైనా చెప్పొచ్చు. రిటైర్మెంట్ ముందు ద్రవిడ్ తనలోని నాయకుడిని ప్రపంచానికి చూపించి వెళ్లాడు. గతంలో భారత కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ సహా పలు విజయాలు అందించినా... ద్రవిడ్ సారథ్యం గురించి ఎక్కడా పెద్దగా వినిపించలేదు. అయితే ఈ సీజన్ ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ ద్వారా నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో చూపించాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సహచర క్రికెటర్లు, బెట్టింగ్ వివాదంలో జట్టు యజమాని... అందుబాటులో లేని క్రికెటర్లు... ఇలా రాయల్స్‌కు వచ్చినన్ని సమస్యలు ఏ జట్టుకూ రాలేదు. ఇలాంటి క్లిష్ట స్థితిలో ద్రవిడ్‌లోని అసలైన లీడర్ బయటకు వచ్చాడు. ఐపీఎల్లో మూడో స్థానంతో జట్టును చాంపియన్స్ లీగ్‌కు చేర్చాడు. ఈ మెగా టి20 టోర్నీలోనూ ైఫైనల్కు చేర్చాడు. జట్టు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చెప్పడానికి చాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ రావడమే నిదర్శనం. రాజస్థాన్ జట్టులోని ఏ ఆటగాడిని కదిలించినా... తమ విజయరహస్యానికి ద్రవిడ్ నాయకత్వమే కారణమని చెబుతాడు. మొత్తానికి ఇక రాహుల్ ద్రవిడ్ ఆటను చూడలేకపోవడం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికీ పెద్ద లోటే. - సాక్షి క్రీడా విభాగం ‘టెస్టు క్రికెట్ నుంచి రిటైరైనప్పుడు ఇప్పటికంటే ఎక్కువ భావోద్వేగానికి లోనయ్యా. ఇకపై రోజూ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు. ప్రస్తుతానికైతే నాకు సెలవు కావాలి. నా సెకండ్ ఇన్నింగ్స్ ఏమిటనేది ఇంకా ప్లాన్ చేయలేదు’ - ద్రవిడ్ క్రికెట్ పేదదయింది: గంభీర్ న్యూఢిల్లీ: రాహుల్ ద్రవిడ్ లేకపోతే భారత్‌లో క్రికెట్ పేదదవుతుందని ఓపెనర్ గంభీర్ ట్వీట్ చేశాడు. ‘రాహుల్ భాయ్‌కు అభినందనలు. భారత క్రికెట్‌కు నీవందించిన సేవలకు కృతజ్ఞతలు. నీవు లేకపోతే ఈ దేశ క్రికెట్ పేదదవుతుంది’ అని గౌతం గంభీర్‌తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘నా జీవితంలో ఇంత తెలివైన క్రికెటర్ని చూడలేదు’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. మరోవైపు సచిన్‌పై కూడా ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘టి20లో కొట్టిన చివరి స్కోరింగ్ షాట్.. సచిన్ నుంచి నేను చూసిన అత్యుత్తమాల్లో ఒకటి’ అని విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ట్వీట్ చేశాడు.