దాదాతో పనిచేసేందుకు ద్రావిడ్ అయిష్టత?
ముంబై: బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా మండలిలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లకు చోటు కల్పించారు. వీరి సమకాలీనుడైన మరో దిగ్గజం రాహుల్ ద్రావిడ్ పేరు ఈ కమిటీలో లేకపోవడం క్రికెట్ వర్గాలకు వెలితిగా కనిపిస్తోంది. ద్రావిడ్ టీమిండియా కెప్టెన్గా పనిచేశాడు. ఎంతో అనుభవజ్ఞుడు కూడా. అలాంటి ద్రావిడ్ను బోర్డు విస్మరించడం సందేహాలకు తావిస్తోంది.
బీసీసీఐ సలహా కమిటీలోకి సచిన్, గంగూలీ, ద్రావిడ్లను తీసుకోవాలని బోర్డు తొలుత భావించినట్టు సమాచారం. అయితే ఈ కమిటీలో చేరేందుకు ద్రావిడ్ నిరాకరించాడని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గంగూలీతో ద్రావిడ్కు ఉన్న విభేదాలే కారణమని చెబుతున్నారు. సలహా కమిటీలో దాదాతో కలసి పనిచేయడానికి ద్రావిడ్ అయిష్టత వ్యక్తం చేశాడని భావిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలను ఉదాహరిస్తున్నారు. ద్రావిడ్ నిరాకరించడంతో అతని స్థానంలో హైదరాబాదీ లక్ష్మణ్ను కమిటీలోకి తీసుకున్నట్టు క్రికెట్ వర్గాల సమాచారం. ఇదిలావుండగా ద్రావిడ్ను కోచ్గా నియమిస్తారని, అందువల్లే సలహా కమిటీలో స్థానం కల్పించలేదన్నది మరో వాదన.