మళ్లీ బాధ్యతలు తీసుకున్నానన్న ద్రవిడ్
కెప్టెన్ కు థ్యాంక్స్ చెప్పిన కోచ్
బ్రిడ్జ్‌టౌన్: నవంబర్ 19, 2023...వన్డే వరల్డ్ కప్‌లో ఆ్రస్టేలియా చేతిలో భారత్ ఓటమిపాలైన రోజు. ఈ నిరాశాజనక ఫలితంతోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. ఆ స్థితిలో భవిష్యత్తు గురించి ద్రవిడ్‌కూ ఎలాంటి ఆలోచన లేదు. అయితే కొద్ది రోజులకే అతను మళ్లీ కోచ్‌గా పని చేసేందుకు సిద్ధమయ్యాడు. అది ఇప్పుడు టి20ల్లో వరల్డ్ కప్ గెలిచే వరకు సాగింది. అందుకు కారణం రోహిత్ శర్మ. ఓటమి నైరాశ్యంలో ఉన్నప్పుడు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను కోరాడు. అందుకే తాను అంగీకరించినట్లు ద్రవిడ్ వెల్లడించాడు.
వరల్డ్ కప్ విజయంతో కోచ్‌గా తన పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సహచరులతో ద్రవిడ్ పలు అంశాలు మాట్లాడాడు. ఇన్ని రోజుల తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘థ్యాంక్యూ రోహిత్...నాకు ఫోన్ చేసి మళ్లీ కోచ్‌గా కొనసాగమని కోరినందుకు. జట్టులోని సభ్యులందరితో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అదో గౌరవంగా భావిస్తున్నా. అయితే రోహిత్‌తో నా బంధం మరింత ప్రత్యేకం. ఎన్నో అంశాలపై మనం చర్చించుకున్నాం.
వాదోపవాదాలు జరిగాయి. అంగీకరించడం, తిరస్కరించడం కూడా జరిగాయి. నీతో పని చేసే అవకాశం ఇచ్చిందుకు కృతజ్ఞతలు’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఈ గెలుపు చిరస్మరణీయంగా ఉండిపోతుందని అతను అన్నాడు. ‘ఏం చెప్పాలో మాటలు రావడం లేదు కానీ నాకూ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించిన మీకందరికీ థ్యాంక్స్. కెరీర్‌లో మీరు సాధించిన పరుగులు, తీసిన వికెట్లు గుర్తుండకపోవచ్చు. కానీ ఇలాంటి క్షణాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
గతంలో ఎంతో చేరువగా వచ్చి కూడా నిరాశపడాల్సి వచ్చింది. అలాంటి వాటినుంచి కోలుకొని మీరు పోరాడిన తీరుతో గర్వంగా ఉన్నాం. మీ కష్టానికి తగిన ఫలితమిది’ అని ద్రవిడ్ ప్రశంసించాడు. ఆటగాళ్ల ప్రదర్శన వెనుక వారి కుటుంబ సభ్యుల త్యాగాలు కూడా ఉంటాయని... తల్లిదండ్రులు, భార్యాపిల్లలకు కూడా ఈ విజయంలో భాగం ఉంటుందని ద్రవిడ్ చెప్పాడు.
|
‘ఈ నిజమంతా నిజమేనా’
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్ల సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా లేక రెండు రోజులు అదనంగా బ్రిడ్జ్‌టౌన్‌లో ఉండాల్సి రావడంతో ఆ సమయాన్ని వారు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంకా ఆ ఆనందం నుంచి బయటకు రావడం లేదు. ‘ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. కప్ గెలవడం నిజమే అయినా అసలు అది జరిగిందా లేదా అన్నట్లుగా కూడా అనిపిస్తోంది.
రాత్రి నుంచి ఉదయం వరకు కూడా మేమందరం బాగా సంబరాలు చేసుకున్నాం. సరిగా నిద్రపోవడం లేదు కానీ అది సమస్య కాదు. తిరిగి వెళ్లాక దాని కోసం చాలా సమయం ఉంది. ఇక్కడ ప్రతీ సెకన్‌ను, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్నా. ఫైనల్ గెలిచిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతీది మాకు భావోద్వేగభరితమే.
ఇలాంటి విజయం కోసం చాలా కాలంగా ఎంతో శ్రమించాం. ఎంతో కష్టపడిన తర్వాత వచ్చే ఫలితం మరింత ఆనందాన్నిస్తుంది. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్‌పై గడ్డిని చప్పరించడం ముందే అనుకున్నది కాదు. అక్కడికి వెళ్లాక నేను అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమది. మా కలలు నెరవేర్చిన చోటు ఎప్పటికీ మర్చిపోకుండా అలా చేయాలని అనిపించింది’ అని రోహిత్ పేర్కొన్నాడు.
నేడు స్వదేశానికి...
వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు నేటి సాయంత్రం సొంత గడ్డపై అడుగు పెట్టే అవకాశం ఉంది. బార్బడోస్ దేశంలో తుఫాన్ కారణంగా జట్టు టీమిండియా సభ్యులు రెండు రోజుల పాటు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అయితే మంగళవారం నుంచి ఎయిర్‌పోర్ట్ రాకపోకలకు సిద్ధమైంది. క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ చార్టర్డ్ ఫ్లయిట్‌లో వీరంతా నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment