
రేసులోకి రాహుల్ ద్రవిడ్!
భారత జట్టు కోచ్ పదవి
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ టీమిండియా కొత్త కోచ్‌గా పగ్గాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా జట్టుకు ప్రత్యేకంగా కోచ్‌గా ఎవరూ లేకపోయినా టీమ్ డెరైక్టర్ హోదాలో రవిశాస్త్రి వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆయనతో ఒప్పందం టి20 ప్రపంచకప్ వరకే ఉండడంతో కొత్త కోచ్ నియామకంఅనివార్యమైంది. ఈవిషయంపై సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ సలహా కమిటీ నేడు (సోమవారం) సమావేశం కానుంది.
అయితే ఈ కమిటీ ఇప్పటికే జట్టు చీఫ్ కోచ్‌గా ఉండేందుకు ద్రవిడ్‌ను సంప్రదించిందని, ఈ కీలక బాధ్యతలను తీసుకునే విషయంలో ఆయన ఆలోచిస్తానని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ జూన్ నుంచి వచ్చే మార్చి వరకు భారత జట్టు 18 టెస్టు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. దీంతో ఈ ఫార్మాట్‌లో అపార అనుభవమున్న ద్రవిడ్ సేవలను ఉపయోగించుకోవాలని బోర్డు భావిస్తోంది. భారత అండర్-19 క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్... ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా ఉన్నారు.