‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు.
సెంచూరియన్: ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు.
మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు.
శతకం పూర్తయ్యాక ఆలౌట్!
వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ తొలి సెషన్‌లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్‌ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్‌తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సిరాజ్ దెబ్బ తీసినా...
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్‌రమ్ (5) కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్‌కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్‌లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది.
ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్‌కు బడింగ్‌హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది.
ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్‌లోనూ ఎల్గర్–బడింగ్‌హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్‌హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్‌హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్‌లైట్‌తో ఆటను నిలిపివేశారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్‌మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్‌హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్‌కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్‌కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0.
Comments
Please login to add a commentAdd a comment