'ఆ ఇద్దరే అత్యుత్తమ క్రికెటర్లు'
కరాచీ: కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేసే వారు ప్రపంచంలోనే ఎవరూ లేరంటా ఇటీవలే కితాబిచ్చుకున్న పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అసిఫ్.. తాజాగా భారత దిగ్గజ ఆటగాళ్ల రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన కెరీర్లో కఠినమైన ఆటగాళ్లు ఎవరైనా ఉంటే అది ద్రవిడ్, లక్ష్మణ్లేనని స్పష్టం చేశాడు.
తన పరంగా చూస్తే ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరూ సాంకేతికంగా ఎంతో మెరుగైన ఆటగాళ్లని ఆసిఫ్ పేర్కొన్నాడు. 'రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్లు ఇద్దరూ..ఇద్దరే. టెక్నికల్ గా వారు ఎంతో నైపుణ్య కల్గినవారు. ఆ ఇద్దరికీ ఆఫ్ స్టంప్ బంతులను వేయాలంటే చాలా భయపడేవాన్ని. వారికి ఆఫ్ స్టంప్ బంతులు వేయడం నాకు ఒక ఛాలెంజ్లా ఉండేది' అని ఆసిఫ్ ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరొకవైపు భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై కూడా ఆసిఫ్ ప్రశంసలు కురిపించాడు. సాంకేతికంగా విరాట్ కోహ్లి చాలా మెరుగైన ఆటగాడని, ఈ క్రమంలోనే అతనికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలరైనా అత్యంత శ్రమించక తప్పదన్నాడు.
2010లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆసిఫ్.. ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. గతేడాది నిషేధం పూర్తి చేసుకున్న ఆసిఫ్.. ఇంకా తిరిగి పాక్ జాతీయ జట్టులో పునరాగమనం చేయలేదు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో చోటు దక్కించుకునే పనిలో పడ్డాడు ఆసిఫ్. దీనిలో భాగంగా దేశవాళీ మ్యాచ్లు ఆడుతూ సత్తా చాటుకుంటున్నాడు.