సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ కొంగ జపం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ వెంటనే అశోక్ నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అశోక్‌నగర్‌లో అభ్యర్థులను లాఠీలతో కొడుతున్నారు. వారి తలలు పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సిటి లైబ్రరీకి వచ్చి అరచేతితో వైకుంఠం చూపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ కొంగ జపం చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. యువత చేస్తున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రిజర్వేషన్లకు చెల్లు చీటీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఉల్లంఘించి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. దగా చేస్తున్నారు.
అభ్యర్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.. తలలు పగుల కొడుతున్నారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. రాహుల్ గ్యారంటీల పేరుతో చేస్తున్న మోసాలో పట్ల జనం అప్రమత్తం అయ్యారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ దోచుకుంటే.. మూసీ పేరుతో కాంగ్రెస్ దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. లక్షా 50వేల కోట్ల అవినీతికి కాంగ్రెస్ కుట్ర చేసింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులు.. రుణమాఫీ, హామీలపై ప్రశ్నిస్తుంటే.. వారిని పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. మంత్రులు ఒక మాట, ఎంపీలు ఒక మాట చెప్తున్నారు. రైతు భరోసా లేకుండా పోయింది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ కాంగ్రెస్ వేరు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వేరా?. ఉన్న అవకాశాలను కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జీవో-29 ద్వారా లక్షల మంది అవకాశాలను కొల్లగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు. ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ బాసటగా నిలుస్తోంది’ అంటూ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment