కోచ్ ఎంపిక ‘త్రిమూర్తుల’ చేతుల్లో...
* కమిటీలో సచిన్, గంగూలీ, ద్రవిడ్
* బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌ను ఎంపిక చేయడంలో ముగ్గురు మాజీ దిగ్గజాలు కీలక పాత్ర పోషించనున్నారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. ఆదివారం ఇక్కడ సమావేశమైన బోర్డు వర్కింగ్ కమిటీ అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు.
టీమిండియా శిక్షకుడిని ఎంపిక చేయడంపై వీరు ముగ్గురూ తమ సూచనలు, సలహాలు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులకు అందజేస్తారు. దీంతో కోచ్ పదవికి గంగూలీ రేసులో ఉన్నట్లు ఇటీవల వచ్చిన వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లే. త్వరలోనే భారత జట్టుకు కొత్త కోచ్ రానుండగా... అసిస్టెంట్ కోచ్‌లు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లు మాత్రం ఇకపై కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆటను మరింతగా అభివృద్ధి చేసేందుకు మాజీ ఆటగాళ్లతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
న్యాయ సలహా కోసం: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ విలువను కేవలం రూ. 5 లక్షలుగా చూపడంపై వర్కింగ్ కమిటీలో తీవ్ర చర్చ జరిగింది. పలువురు సభ్యులు దీనిపై ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. మార్కెట్ విలువ కనీసం రూ. 1500 కోట్లు ఉండే జట్టును ఏ లెక్క ప్రకారం రూ. 5 లక్షలుగా చూపించారని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గట్టిగా నిలదీశారు. అయితే ఈ అంశంపై బోర్డు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై తాజాగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మాత్రం నిర్ణయించారు.
‘అర్జున’కు రోహిత్ పేరు ప్రతిపాదన: మరోవైపు కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని కూడా వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్‌లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు.
బుకీతో బోర్డు కార్యదర్శి!
ముంబై: బీసీసీఐ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన అనురాగ్ ఠాకూర్ వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... కరణ్ గిల్హోత్రా అనే అనుమానిత బుకీతో ఠాకూర్ సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. ఒక పార్టీలో కరణ్‌కు స్వయంగా ఠాకూర్ కేక్ తినిపిస్తున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్‌యూ) వద్ద ఉన్న బుకీల జాబితాలో కరణ్ పేరు కూడా ఉండటం వివాదానికి కారణమైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాలుగు రోజుల క్రితం ఐసీసీ, బీసీసీఐకి ఘాటుగా లేఖ రాసినట్లు తెలిసింది.
ఫిక్సింగ్ మాయలో పడకుండా ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ బీసీసీఐ ఏసీఎస్‌యూ డెరైక్టర్ రవి సవాని 2014లో అన్ని ఐపీఎల్ జట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కరణ్ గిల్హోత్రాకు దూరంగా ఉండాలని సూచనలు ఉన్నాయి. అయితే ఐసీసీ లేఖ రాసి నాలుగు రోజులు దాటినా బీసీసీఐ దానికి స్పందించలేదు.
శ్రీనివాసన్ గూఢచర్యం!: మరోవైపు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ గతంలో తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బోర్డు సభ్యులపైనే గూఢచర్యానికి పాల్పడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సహచరుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు, ఇ-మెయిల్స్ హ్యాక్ చేసేందుకు శ్రీనివాసన్ లండన్‌కు చెందిన ప్రైవేట్ ఏజెన్సీని ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన దాదాపు రూ. 14 కోట్ల బోర్డు సొమ్మునే వాడినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ త్వరలో విచారణ జరిపే అవకాశం ఉంది.