అవును... ఢిల్లీయే! | Daredevils IPLmatch sensational wins | Sakshi
Sakshi News home page

అవును... ఢిల్లీయే!

Published Thu, May 5 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

అవును...   ఢిల్లీయే!

అవును... ఢిల్లీయే!

ఐపీఎల్‌లో డేర్‌డెవిల్స్ సంచలన విజయాలు
జట్టు రాత మార్చేసిన కోచ్ ద్రవిడ్
అండర్‌డాగ్‌గా వచ్చి అదరగొడుతున్న జహీర్ సేన

 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్... ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టు. ముఖ్యంగా గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడిన జట్టు. అందుకే ఈసారి కూడా ఐపీఎల్ ఆరంభంలో ఈ జట్టుపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికే ఢిల్లీ జట్టు ప్రకంపనలు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

ప్రతి ఏటా జట్టు నిండా స్టార్ క్రికెటర్లు... స్టార్ ఆటగాడని భావిస్తే చాలు కోట్లాది రూపాయలు కుమ్మరించిన యాజమాన్యం... అయినా ఫలితం లేక ప్రతి ఏటా జట్టులో మార్పులు... ఇలాంటి స్థితిలో ఈసారి మాత్రం వ్యూహం మార్చారు. కోచ్‌గా ద్రవిడ్‌ను తీసుకున్నాక... రాజస్తాన్ రాయల్స్ తరహాలో లో ప్రొఫైల్ క్రికెటర్లను తీసుకున్నారు. ఇప్పుడు వారితోనే మ్యాజిక్ చేస్తున్నాడు ‘మిస్టర్ డిపెండబుల్’ ద్రవిడ్.
 

 
సాక్షి క్రీడావిభాగం ఈసారి ఐపీఎల్‌లో కాస్త అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ స్కోర్లు చేస్తున్నా మ్యాచ్‌లు కాపాడుకోలేకపోతోంది. కెప్టెన్ కూల్ ధోనికి సరైన జట్టు లేక పుణే వెనుకబడి పోయింది. స్టార్ క్రికెటర్లతో నిండిన ముంబై, హైదరాబాద్ పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తున్నాయి. కానీ ఈ జట్లన్నింటికీ భిన్నంగా లో ప్రొఫైల్ క్రికెటర్లతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దూసుకుపోతోంది.

 ద్రవిడ్ మార్క్
 ఈ ఏడాది ఐపీఎల్ వేలం సమయానికి ఢిల్లీ జట్టు ద్రవిడ్ తమ కోచ్ అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అప్పటికే ద్రవిడ్‌తో చర్చలు పూర్తయ్యాయి. తనతో పాటు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు పని చేసిన ప్యాడీ ఆప్టన్‌ను కూడా తీసుకుని ద్రవిడ్ ‘పని’ ప్రారంభించాడు. అండర్-19 జట్టు కోచ్‌గా పని చేసిన సమయంలో యువ క్రికెటర్లను మరింత దగ్గరగా గమనించిన ద్రవిడ్... రాజస్తాన్‌లోని పాత ఆటగాళ్లలో నుంచి యువ క్రికెటర్లను తీసుకోవాలని సూచించాడు. సంజు శామ్సన్ కోసం రూ.4.2 కోట్లు ఖర్చు చేసిన ఢిల్లీ యాజమాన్యం... రిషబ్ పంత్ కోసం ఏకంగా రూ.1.9 కోట్లు వెచ్చించింది.

పంత్‌కు అంత డబ్బెందుకనే మాట వినిపించినా... ద్రవిడ్ అడగడం వల్ల కొనేశారు. తాజాగా గుజరాత్‌పై పంత్ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ద్రవిడ్ గొప్పతనం మరోసారి తెలిసొచ్చింది. అలాగే బ్రాత్‌వైట్, మోరిస్ ఇద్దరి కోసం కలిపి ఏకంగా రూ.11.2 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఇద్దరూ విలువైన ఆటగాళ్లని నిరూపించుకున్నారు. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన ద్రవిడ్... కుర్రాళ్లలో స్ఫూర్తి పెంచడంలో సక్సెస్ అయ్యాడు.


అందరికీ అవకాశాలు
ఢిల్లీ తమ కెప్టెన్‌గా జహీర్ ఖాన్ పేరు ప్రకటించగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కెప్టెన్‌కు అనుభవం ఉండాలని భావించిన ద్రవిడ్ సూచన మేరకే ఈ నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న జహీర్... తన అనుభవాన్నంతా మైదానంలో చూపిస్తున్నాడు. ఇక తుది జట్టు విషయంలోనూ ద్రవిడ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. గతేడాది స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ నుంచి డుమిని వరకు ఎవరినైనా కూర్చోబెడుతున్నాడు. ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో తుది జట్టులోకి తేవడం ద్వారా ప్రతి మ్యాచ్‌కూ అందరూ సన్నద్ధంగా ఉండేలా చూస్తున్నాడు. ఎవరికి అవకాశం వచ్చినా సత్తా చాటాలనే కసి ఆటగాళ్లలో పెంచాడు.


 సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకాన్ని కూడా బాగా పాటిస్తున్నారు. నిజానికి కోచ్ కొత్తగా ఆటగాళ్లకు క్రికెట్ నేర్పాల్సిన అవసరం లేదనేది ద్రవిడ్ ఆలోచన. వాళ్లలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతూ వారిలో స్ఫూర్తి నింపడమే కోచ్ పని అనేది ద్రవిడ్ అభిప్రాయం. ‘అండర్-19 జట్టుతో ఆడిన సమయం నుంచి ద్రవిడ్ సర్ చెప్పిన మాటలను ఆచరిస్తున్నాను. ఆటతీరును బాగా మార్చుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎదురుగా ఏ స్థాయి బౌలర్ ఉన్నా ఆడగలననే ఆత్మవిశ్వాసాన్ని ఆయన పెంచారు’ అని రిషబ్ పంత్ చెప్పిన మాటలే ద్రవిడ్ ప్రభావానికి ఉదాహరణ.


 పని చేసిన క్యాంప్‌లు
 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టు మూడు క్యాంప్‌లు నిర్వహించింది. జట్టులోని 24 మంది ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది అందరూ వీటిలో పాల్గొన్నారు. వీటిలో మ్యాచ్‌ల గురించి, వ్యూహాల గురించి ఏ మాత్రం చర్చించలేదు. కేవలం ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కోచ్‌లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే నెట్ ప్రాక్టీస్ సమయంలో ద్రవిడ్ పెద్దగా మాట్లాడడు. ఒకేసారి ఐదు నెట్స్‌ను గమనిస్తూ ఆప్టన్‌కు కొన్ని సూచనలు చెబుతాడు. ‘రాహుల్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎదగడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తారు. ఏదైనా ఒక మార్పు చేసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని మనకే ఇస్తారు’ అని మోరిస్ చెప్పాడు.


 ఆటగాళ్లలో ఉత్సాహం
 సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి తర్వాత ఈ సీజన్‌లోనూ ఢిల్లీ రాత మారదనే మాట వినిపించింది. కానీ ఆ మ్యాచ్ తర్వాత జహీర్ ఓ మాటన్నాడు. ‘మేం ఏం చేయాలో, ఎలా ఆడాలో మాకు స్పష్టత ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓటమి మాపై ప్రభావం చూపదు. రాబోయే రోజుల్లో మీరు మా నుంచి మంచి విజయాలు చూస్తారు’ అన్నాడు. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ గెలుపును కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అటు పంజాబ్ కూడా అంత బలమైన జట్టేమీ కాదు కాబట్టి తేలిగ్గా తీసుకున్నారు. కానీ మూడో మ్యాచ్‌లో బెంగళూరుపై ఏకంగా 192 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్ల విజయం సాధించగానే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటికీ వన్ మ్యాచ్ వండర్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.

కానీ తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై 164 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారు. గుజరాత్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా అమోఘంగా ఆడి విజయం అంచుల్లోకి వచ్చారు. కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోల్‌కతా, గుజరాత్‌లపై సులభమైన విజయాలతో లీగ్‌లో నాకౌట్ బెర్త్‌కు చేరువయ్యారు. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు బాధ్యతగా ఆడటం పెద్ద సానుకూలాంశం.


ప్రస్తుతం ఢిల్లీ ఆడుతున్న తీరు... మిగిలిన మ్యాచ్‌లను పరిశీలిస్తే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడం ఖాయమే. ఇక ఈ సీజన్ చివరికి ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement