ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో కావాల్సింది 11 పరుగులు. స్ట్రయికింగ్‌లో జాసన్ రాయ్ (53 బంతుల్లో 91 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు). బౌలర్ ముస్తఫిజుర్. తొలి బంతి ఫోర్... రెండో బంతి సిక్స్... స్కోర్లు సమం. నాలుగు బంతుల్లో ఒక పరుగు చేస్తే చాలు. ఢిల్లీదే గెలుపు. కానీ, ముస్తఫిజుర్ అద్భుతంగా పుంజుకుని మూడు డాట్ బాల్స్ వేశాడు. ఫలితంపై ఒక్కసారిగా ఉత్కంఠ. రోహిత్ ఫీల్డర్లందరినీ దగ్గరగా మోహరించాడు. అయితే... ఒత్తిడిని ఛేదిస్తూ రాయ్ బంతిని కవర్స్ దిశగా కొట్టి లాంఛనం పూర్తి చేశాడు. తమ జట్టుకు సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు.
ముంబై: ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు చివరి ఓవర్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. ఓపెనర్ జాసన్ రాయ్ వీర విహారంతో ఢిల్లీ డేర్ డెవిల్స్... శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (32 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్), లూయీస్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు); వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (23 బం తుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి భారీ స్కోరు అందించారు. లక్ష్య ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జాసన్ రాయ్, రిషభ్ పంత్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలుపొందింది.
ఆరంభం అదిరినా...
ముంబై ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే ఆ జట్టు 230 పరుగులైనా చేస్తుందనిపించింది. కెప్టెన్ రోహిత్‌శర్మ వెనక్కుతగ్గి ఓపెనర్‌గా సూర్యకుమార్‌ను పంపించగా అతడు చెలరేగి ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. లూయీస్ కూడా జోరు చూపడంతో 9వ ఓవర్లోనే స్కోరు వందకు చేరింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా ఇషాన్, రోహిత్ (18)లు 15వ ఓవర్లో 150 దాటించారు. అయితే... ఇషాన్, పొలార్డ్‌లను క్రిస్టియన్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపి ఢిల్లీకి ఊరటనిచ్చాడు. కెప్టెన్ సహా కృనాల్ (11), హార్దిక్ (2) విఫలమవడంతో జట్టు ఊహించినంత కంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌల్ట్, క్రిస్టియన్, తెవాటియాలకు రెండేసి వికెట్లు దక్కాయి.
అతడొక్కడే!
5.1 ఓవర్లలోనే 50 పరుగులు జోడించి ఛేదనలో ఢిల్లీకి రాయ్, కెప్టెన్ గంభీర్ (15) శుభారంభం అందించారు. తర్వాత రిషభ్ మెరుపులతో జట్టు లక్ష్యం దిశగా సాగిపోయింది. మధ్యలో మ్యాక్స్‌వెల్ (13) విఫలమైనా... రాయ్ దూకుడుకు అయ్యర్ అండగా నిలిచాడు. అయితే, 12 బంతుల్లో 16 పరుగులు అవసరమైన స్థితిలో బుమ్రా అయిదు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులకే ముస్తఫిజుర్ సిక్స్, ఫోర్ ఇవ్వడంతోనే పరిస్థితి చేయిదాటింది. తర్వాతి మూడు బంతులు బాగా వేసినా, ఢిల్లీకి అవసరమైంది ఒక్క పరుగే కాబట్టి అనూహ్య ఫలితానికి ఆస్కారం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment