రాయ్‌ వచ్చాడు.. గెలిపించాడు | Roy stars in last ball thriller | Sakshi
Sakshi News home page

రాయ్‌ వచ్చాడు.. గెలిపించాడు

Published Sat, Apr 14 2018 7:43 PM | Last Updated on Sat, Apr 14 2018 7:44 PM

Roy stars in last ball thriller - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరపున తొలి మ్యాచ్‌ ఆడుతున్న జాసన్‌ రాయ్‌ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చిన రాయ్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి 53 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 91 పరుగులు సాధించి ఢిల్లీని విజయ తీరాలకు తీర్చాడు. అతనికి జతగా రిషబ్‌ పంత్‌(47;25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(27 నాటౌట్‌; 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)లు ధాటిగా ఆడారు. ఈ సీజన్‌లో ఇది ఢిల్లీకి తొలి గెలుపు కాగా,  ముంబైకు హ్యాట్రిక్‌ ఓటమి.

ముంబై నిర్దేశించిన 195 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి తొలి వికెట్‌కు 50 పరుగులు, రెండో వికెట్‌కు 69 పరుగులు సాధించింది. గౌతం గంభీర్‌(15), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(13)లు నిరాశపరిచారు. కాగా, రాయ్‌, పంత్‌లతో పాటు అయ్యర్‌లు అంచనాలకు అనుగుణంగా రాణించడంతో ఢిల్లీ గెలుపు సునాయాసమైంది. కేవలం​ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రధానంగా జాసన్‌ రాయ్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయమైన గెలుపును అందించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 194 పరుగులు సాధించింది. తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం అందించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్‌ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్ అవుటైన స‍్వల్ప వ్యవధిలో సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు.  మరొకవైపు ఇషాన్‌ కిషన్‌(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించాడు. అయితే మిడిల్‌ ఆర్డర్‌లో ముంబై విఫలం కావడంతో రెండొందల మార్కును చేరడంలో విఫలమైంది.

ముంబై మిడిల్‌ ఆర్డర్‌  ఆటగాళ్లలో కీరోన్‌ పొలార్డ్‌ డకౌట్‌ కాగా, రోహిత్‌ శర్మ(18), కృనాల్‌ పాండ్యా(11), హార్దిక్‌ పాండ్యా(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్‌ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ.. ఆపై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. దాంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 84 పరుగులు చేసిన ముంబై.. మిగతా 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, డానియల్‌ క్రిస్టియన్‌, రాహుల్‌ తెవాతియాలు తలో రెండు వికెట్లు సాధించగా, మహ్మద్‌ షమీకి వికెట్‌ దక్కింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement