కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి.. ప్లేఆఫ్‌కు రాయల్స్‌ | Raina hits Unbeaten 61 runs as Kings Punjab bow out of IPL 2018 | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి.. ప్లేఆఫ్‌కు రాయల్స్‌

Published Sun, May 20 2018 11:51 PM | Last Updated on Mon, May 21 2018 7:44 AM

Raina hits Unbeaten 61 runs as Kings Punjab bow out of IPL 2018 - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)తాజా సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరాలన్న కింగ్స్‌ పంజాబ్‌ ఆశలు నెరవేరలేదు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఏడు విజయాలతో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ప్లేఆఫ్‌కు చేరిన జట్లు కాగా, చివరిగా రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది.  చెన్నై విజయంలో సురేశ్‌ రైనా(61 నాటౌట్‌; 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక‍్సర్లు), దీపక్‌ చాహర్‌(‌39; 20 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు)లు ముఖ్య భూమిక పోషించారు. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సీఎస్‌కే అంబటి రాయుడు(1)వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. ఆ తర్వా డుప్లెసిస్‌(14), శ్యామ్‌ బిల్లింగ్స్‌(0)లు వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై నాల్గో వికెట్‌కు సురేశ్‌ రైనాతో కలిసి 31 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత హర్భజన్‌ సింగ్‌(19) పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో రైనా-దీపక్‌ చాహర్‌ల జోడి చెన్నై స్కోరు బోర్డును చక్కదిద్దింది. వీరిద్దరూ 56 పరుగుల జోడించిన తర్వాత చాహర్ ఐదో వికెట్‌గా నిష్క్రమించాడు. దాంతో చెన్నై 114 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఇక చివర్లో రైనా-ధోని(16 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌)ల జంట మరో వికెట్‌ పడకుండా ఆడటంతో చెన్నై 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.

అంతకుముందు కింగ్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది.  టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ చేసింది. 16 పరుగులకే క్రిస్‌ గేల్‌(0), అరోన్‌ ఫించ్‌(4), కేఎల్‌ రాహుల్‌(7) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మనోజ్‌ తివారీ(35) పెవిలియన్‌ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్‌ మిల్లర్‌(24) సైతం ఔట్‌ కావడంతో కింగ్స్‌ పంజాబ్‌ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. చెన్నై పేసర్‌ లుంగి ఎంగిడి.. కింగ్స్‌ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో 1 మెయిడిన్‌ సాయంతో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement