రోహిత్‌శర్మ
ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా ముంబైను ముంచారు. ఈ సీజన్‌లో అందరికంటే ముందే ప్లే ఆఫ్ నుంచి ఔటైన డేర్‌డెవిల్స్ జట్టు వెళ్తూ వెళ్తూ తమ వెంట రోహిత్ సేననీ తీసుకెళ్లింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్ పట్టాల నుంచి తప్పించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ 11 పరుగుల తేడాతో రోహిత్ సేనపై గెలిచింది. బ్యాటింగ్‌లో రిషభ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తే... బౌలింగ్‌లో స్పిన్నర్లు సందీప్ లమిచానే (3/36), అమిత్ మిశ్రా (3/19), పేసర్ హర్షల్ పటేల్ (3/28) సమష్టిగా దెబ్బ తీశారు. మొదట డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), విజయ్ శంకర్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. లూయిస్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. మిశ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రిషభ్ పంతే పెద్దదిక్కయ్యాడు...
టాస్ నెగ్గిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపిం ది. ఓపెనింగ్ వైఫల్యంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (12) రనౌట్‌కాగా, మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్‌తో కలిసి రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీ కూడా విఫలమైంది. కెప్టెన్ అయ్యర్ (6) మార్కండే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్‌తో పంత్ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 13వ ఓవర్లో జట్టు 100 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ 34 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్ తర్వాత బుమ్రా, కటింగ్, హార్దిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ముస్తఫిజుర్ వేసిన 15వ ఓవర్లో పంత్ సిక్సర్, శంకర్ ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చారు. హార్దిక్ తర్వాతి ఓవర్లో పంత్ మరో రెండు సిక్సర్లు బాదేశాడు. జోరు పెరిగిన దశలో రిషభ్ ఇన్నింగ్స్‌కు కృనాల్ పాండ్యా తెరదించాడు. దీంతో 64 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అభిషేక్ జతగా విజయ్ శంకర్ పోరాడే లక్ష్యాన్ని ముంబై ముందుంచగలిగాడు.
స్పిన్ ఉచ్చులో బ్యాట్లెత్తారు...
ముంబై చావోరేవో తేల్చుకునే లక్ష్యం 175. సులువైంది కాకపోయినా... అసాధ్యమైంది మాత్రం కాదు. కానీ ముంబై బ్యాట్స్‌మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరంభంలో ఓపెనర్ లూయిస్ ఎదురుదాడికి దిగినట్టు... చివర్లో కటింగ్ (20 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినట్లు మరొక్కరు నిలబడితే గెలిచేది. కానీ ఆ ఒక్కడి పాత్రలో ఏ బ్యాట్స్‌మెన్ నిలబడనీయకుండా లమిచానే, మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు. టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. ఈ సీజన్‌లో నిలకడ కనబరిచిన సూర్యకుమార్ (12), విధ్వంసకర బ్యాట్స్‌మన్ పొలార్డ్ (7)లను లమిచానే ఔట్ చేస్తే... మధ్యలో ఇషాన్ కిషన్ (5), లూయిస్‌లను మిశ్రా పెవిలియన్ చేర్చాడు. కృనాల్ (4), రోహిత్ (13) పలాయనం చిత్తగించడంతో ముంబై కథ ముగిసింది. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు బ్యాట్‌ను ఊపేసినా మిశ్రా మాయలో పడేందుకు ఎంతో సేపు పట్టలేదు. 15వ ఓవర్లో అతని నిష్క్రమణతో ఆశలు ఆవిరికాగా... కటింగ్ మెరుపులతో ఏమూలనో మిణుకుమిణుకుమన్న ఆశల్ని చివరి ఓవర్లో హర్షల్ పటేల్ తుడిచేశాడు.
స్కోరు వివరాలు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 12; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 22; శ్రేయస్ అయ్యర్ (సి) కృనాల్ (బి) మార్కండే 6; రిషభ్ పంత్ (సి) పొలార్డ్ (బి) కృనాల్ 64; విజయ్ శంకర్ నాటౌట్ 43; అభిషేక్ శర్మ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174.
వికెట్ల పతనం: 1–30, 2–38, 3–75, 4–139.
బౌలింగ్: కృనాల్ 2–0–11–1, బుమ్రా 4–0– 29–1, హార్దిక్ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–34–0, మార్కండే 2–0–21–1, కటింగ్ 4–0–36–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ (సి) శంకర్ (బి) లమిచానే 12; లూయిస్ (స్టంప్డ్) పంత్ (బి) మిశ్రా 48; ఇషాన్ కిషన్ (సి) శంకర్ (బి) మిశ్రా 5; పొలార్డ్ (సి) బౌల్ట్ (బి) లమిచానే 7; రోహిత్ (సి) బౌల్ట్ (బి) హర్షల్ 13; కృనాల్ (సి) సబ్–తేవటియా (బి) లమిచానే 4; హార్దిక్ (సి) సబ్–తేవటియా (బి) మిశ్రా 27; కటింగ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హర్షల్ 37; మార్కండే (బి) బౌల్ట్ 3; బుమ్రా (సి) బౌల్ట్ (బి) హర్షల్ 0; ముస్తఫిజుర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 163.
వికెట్ల పతనం: 1–12, 2–57, 3–74, 4–74, 5–78, 6–121, 7–122, 8–157, 9–163, 10–163. బౌలింగ్: లమిచానే 4–0–36–3, బౌల్ట్ 4–0–33–1, మ్యాక్స్‌వెల్ 2–0–19–0, హర్షల్ 2.3–0–28–3, ప్లంకెట్ 3–0–27–0, మిశ్రా 4–0–19–3.
రిషభ్ పంత్
లమిచానే, మిశ్రా
ప్రీతికెంత సంబరమో!
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముంబై ఓడిందని తెలియగానే తెగ సంబరపడిపోయింది. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని చెప్పింది. ఈ వీడియో క్లిప్ ట్విటర్‌లో వైరల్ అయింది. అదేం ఆనందమో గానీ... అప్పటికింకా ఆమె జట్టు (పంజాబ్) చెన్నైపై గెలవనేలేదు. ప్లే–ఆఫ్ చేరనేలేదు... ఇంకా చెప్పాలంటే మ్యాచ్ అప్పుడే మొదలైంది. ముంబై ఓటమితో పంజాబ్ ప్లే–ఆఫ్ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ... తమకు ఏమీ కాని ఫలితంతో ముందుకు ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment