Daredevils
-
‘నయీ దిల్లీ’కి మరో చాన్స్
రెండేళ్ల క్రితం డేర్‌డెవిల్స్‌ను వదిలి క్యాపిటల్స్ అంటూ పేరు మార్చుకొని వచ్చిన ఢిల్లీ నిజంగా కొత్తగా కనిపించింది. అప్పటి వరకు ఆరు సీజన్ల పాటు వరుసగా 9, 8, 7, 6, 6, 8 స్థానాల్లో నిలిచి ఇదేం టీమ్రా బాబూ అంటూ సొంత అభిమానులే జట్టు ప్రదర్శనతో విసుగెత్తిపోయేలా చేసింది. ఇలాంటి స్థితిలో కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో 2019లో మూడో స్థానంలో నిలిచిన టీమ్ ఏడాది తిరిగేసరికి మరో మెట్టు ఎక్కింది. ‘నయీ దిల్లీ’ అంటూ ఫైనల్ వరకు చేరి సత్తా చాటింది. లీగ్ దశలో చాలా బాగా ఆడినా... దురదృష్టవశాత్తూ రెండో స్థానానికే పరిమితమైన టీమ్ ఇప్పుడు ఆ అడ్డంకిని దాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ రిషభ్ పంత్ నాయకత్వ ప్రదర్శన... అన్నీ తానే అయి వ్యవహరించే కోచ్ రికీ పాంటింగ్ వ్యూహాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తొలి టైటిల్ కలను నెరవేరుస్తాయా అనేది ఆసక్తికరం. కొత్తగా వచ్చినవారు... వేలంపరంగా చూస్తే ఢిల్లీ ఎంపిక అంత గొప్పగా ఏమీ లేదు. ఫామ్‌ను బట్టి రబడ, నోర్జేలు ఖాయంగా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న చోట మరో విదేశీ పేసర్ టామ్ కరన్ (రూ. 5.25 కోట్లు«) కోసం భారీ మొత్తం వెచ్చించింది. అదే విధంగా ఎన్ని మ్యాచ్‌లలో తుది జట్టులో ఉంటాడో తెలియని స్టీవ్ స్మిత్ (రూ.2.20)ను అందరికంటే ముందు ఎంచుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ (రూ. 1 కోటి) ఎంపిక సరైంది కాగా... ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా లివింగ్‌స్టోన్ (రూ. 2 కోట్లు) తీసుకుంది. మరో నలుగురు యువ ఆటగాళ్లు రిపాల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ మేరివాలా, ఎం. సిద్ధార్థ్‌లను రూ. 20 లక్షల కనీస ధరకే సొంతం చేసుకుంది. తుది జట్టు అంచనా/ఫామ్ గత ఏడాది ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా జట్టును సమర్థంగా నడిపించిన శ్రేయస్ అయ్యర్ లేకపోవడం టీమ్‌కు పెద్ద లోటు. అతని స్థానంలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రహానే మినహా (గత సీజన్లో టీమ్ 17 మ్యాచ్‌లు ఆడితే రహానేకు 9 మ్యాచ్‌లలోనే చాన్స్ లభించింది) మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. నలుగురు విదేశీ ఆటగాళ్ల జాబితాను చూస్తే రబడ, నోర్జే ఖాయం. ఆల్‌రౌండర్‌గా స్టొయినిస్ లేదా అతనికి ప్రత్యామ్నాయంగా సరిగ్గా అలాంటి శైలి ఉన్న వోక్స్ అందుబాటులో ఉన్నాడు. మిగిలిన మరో స్థానంలో హిట్టర్ హెట్మైర్ను కాదని స్మిత్‌కు ఎన్ని మ్యాచ్‌లు దక్కుతాయో చూడాలి. ఆటగాడికంటే స్మిత్ మెంటార్ పాత్రనే ఎక్కువగా పోషించేటట్లు కనిపిస్తోంది. గత సీజన్లో 3 మ్యాచ్‌లకు దూరమైన పంత్... ఇప్పుడు కెప్టెన్ కాబట్టి అన్ని మ్యాచ్‌లు ఆడతాడనడంలో సందేహం లేదు. భారత పేస్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లాంటి సీనియర్లు అందుబాటులో ఉండగా, అవేశ్ ఖాన్‌కు కొన్ని మ్యాచ్‌లు దక్కవచ్చు. స్పిన్‌లో మరోసారి అశ్విన్, అక్షర్ ద్వయం ప్రత్యర్థులను దెబ్బ తీయగలదు. సీనియర్ లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా అందుబాటులో ఉన్నాడు. పెద్దగా మార్పులు లేకుండా గత సీజన్లో ఆడిన తుది జట్టే ఈసారి కూడా ఎక్కువగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అన్నింటికి మించి ఇటీవలి అద్భుత ఫామ్, పెరిగిన ఆత్మవిశ్వాసంతో పంత్ నాయకుడిగా మైదానంలో ఎలా జట్టు నడిపిస్తాడనేది ఆసక్తికరం. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: రిషభ్ పంత్ (కెప్టెన్), అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, ఎం.సిద్ధార్థ్, విష్ణు వినోద్, లలిత్ యాదవ్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, రిపాల్ పటేల్, శిఖర్ ధావన్, ప్రవీణ్ దూబే, పృథ్వీ షా, ఉమేశ్ యాదవ్, లుక్మాన్ మేరివాలా. విదేశీ ఆటగాళ్లు: కగిసో రబడ, స్టొయినిస్, స్యామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్, హెట్ మైర్, నోర్జే, టామ్ కరన్. సహాయక సిబ్బంది: రికీ పాంటింగ్ (కోచ్), మొహమ్మద్ కైఫ్ (అసిస్టెంట్ కోచ్), ప్రవీణ్ ఆమ్రే (అసిస్టెంట్ కోచ్), అజయ్ రాత్రా (అసిస్టెంట్ కోచ్), జేమ్స్ హోప్స్ (పేస్ బౌలింగ్ కోచ్). అత్యుత్తమ ప్రదర్శన 2020లో రన్నరప్ 2020లో ప్రదర్శన: 14 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించి రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే లీగ్ దశలో రెండు సార్లు, ఆపై తొలి క్వాలిఫయర్, ఫైనల్లో కూడా ముంబై ఇండియన్స్ చేతిలోనే ఓడి తొలి టైటిల్‌కు దూరమైంది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ (619 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (519) కీలక పాత్ర పోషించగా... రబడ, నోర్జే కలిసి 52 వికెట్లు పడగొట్టారు. అక్షర్, స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కూడా జట్టుకు విజయాలు అందించింది. -
వీరవిహా‘రాయ్’
ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో కావాల్సింది 11 పరుగులు. స్ట్రయికింగ్‌లో జాసన్ రాయ్ (53 బంతుల్లో 91 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు). బౌలర్ ముస్తఫిజుర్. తొలి బంతి ఫోర్... రెండో బంతి సిక్స్... స్కోర్లు సమం. నాలుగు బంతుల్లో ఒక పరుగు చేస్తే చాలు. ఢిల్లీదే గెలుపు. కానీ, ముస్తఫిజుర్ అద్భుతంగా పుంజుకుని మూడు డాట్ బాల్స్ వేశాడు. ఫలితంపై ఒక్కసారిగా ఉత్కంఠ. రోహిత్ ఫీల్డర్లందరినీ దగ్గరగా మోహరించాడు. అయితే... ఒత్తిడిని ఛేదిస్తూ రాయ్ బంతిని కవర్స్ దిశగా కొట్టి లాంఛనం పూర్తి చేశాడు. తమ జట్టుకు సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై: ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు చివరి ఓవర్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. ఓపెనర్ జాసన్ రాయ్ వీర విహారంతో ఢిల్లీ డేర్ డెవిల్స్... శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (32 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్), లూయీస్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు); వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (23 బం తుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి భారీ స్కోరు అందించారు. లక్ష్య ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జాసన్ రాయ్, రిషభ్ పంత్ (25 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలుపొందింది. ఆరంభం అదిరినా... ముంబై ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే ఆ జట్టు 230 పరుగులైనా చేస్తుందనిపించింది. కెప్టెన్ రోహిత్‌శర్మ వెనక్కుతగ్గి ఓపెనర్‌గా సూర్యకుమార్‌ను పంపించగా అతడు చెలరేగి ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. లూయీస్ కూడా జోరు చూపడంతో 9వ ఓవర్లోనే స్కోరు వందకు చేరింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా ఇషాన్, రోహిత్ (18)లు 15వ ఓవర్లో 150 దాటించారు. అయితే... ఇషాన్, పొలార్డ్‌లను క్రిస్టియన్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపి ఢిల్లీకి ఊరటనిచ్చాడు. కెప్టెన్ సహా కృనాల్ (11), హార్దిక్ (2) విఫలమవడంతో జట్టు ఊహించినంత కంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. బౌల్ట్, క్రిస్టియన్, తెవాటియాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అతడొక్కడే! 5.1 ఓవర్లలోనే 50 పరుగులు జోడించి ఛేదనలో ఢిల్లీకి రాయ్, కెప్టెన్ గంభీర్ (15) శుభారంభం అందించారు. తర్వాత రిషభ్ మెరుపులతో జట్టు లక్ష్యం దిశగా సాగిపోయింది. మధ్యలో మ్యాక్స్‌వెల్ (13) విఫలమైనా... రాయ్ దూకుడుకు అయ్యర్ అండగా నిలిచాడు. అయితే, 12 బంతుల్లో 16 పరుగులు అవసరమైన స్థితిలో బుమ్రా అయిదు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులకే ముస్తఫిజుర్ సిక్స్, ఫోర్ ఇవ్వడంతోనే పరిస్థితి చేయిదాటింది. తర్వాతి మూడు బంతులు బాగా వేసినా, ఢిల్లీకి అవసరమైంది ఒక్క పరుగే కాబట్టి అనూహ్య ఫలితానికి ఆస్కారం లేకపోయింది. -
ఢిల్లీనీ గెలిచాం
-
ఢిల్లీనీ గెలిచాం
►సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం ►15 పరుగులతో డేర్‌డెవిల్స్ ఓటమి ►చెలరేగిన విలియమ్సన్, ధావన్ సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరుగులేని ప్రదర్శన కొనసాగుతోంది. ఇతర వేదికలపై రెండు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో జూలు విదిల్చిన జట్టు ఇప్పుడు మరో కీలక విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, శిఖర్ ధావన్‌ల మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన రైజర్స్... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో డేర్‌డెవిల్స్ పని పట్టింది. ఢిల్లీ యువ ఆటగాళ్లు కొంత పట్టుదల కనబర్చినా... అది జట్టును గెలిపించడానికి సరిపోలేదు. ‘సన్’కు ఇది ఓవరాల్‌గా నాలుగో విజయం కాగా, ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి. హైదరాబాద్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో తాము ఆడిన నాలుగో మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (51 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శిఖర్ ధావన్ (50 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే 136 పరుగులు జోడించడం విశేషం. 4 వికెట్లూ మోరిస్కే దక్కాయి. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రేయస్ అయ్యర్ (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సామ్సన్ (33 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 33; 5 ఫోర్లు,1 సిక్స్), మాథ్యూస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. భారీ భాగస్వామ్యం... చాలా కాలం తర్వాత హైదరాబాద్ జట్టు వార్నర్ ప్రమేయం లేకుండా భారీ స్కోరు సాధించగలిగింది. ధావన్, సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వార్నర్ (4) అవుటైన తర్వాత వీరిద్దరు దూకుడైన ఆటను ప్రదర్శించారు. ఢిల్లీ బలహీన బౌలింగ్ కూడా సన్‌కు కలిసొచ్చింది. కెప్టెన్ జహీర్ ఈ జోడీని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ముఖ్యంగా విలియమ్సన్ భారీ షాట్లతో చెలరేగి తనలో కొత్త కోణాన్ని ప్రదర్శించాడు. మాథ్యూస్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో అతను రెండు అద్భుతమైన సిక్సర్లు బాదాడు. కమిన్స్ ఓవర్లోనూ మరో సిక్సర్ బాది కేన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిశ్రా వేసిన ఓవర్లో విలియమ్సన్ మరో రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరోవైపు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్న ధావన్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు మోరిస్ బౌలింగ్‌లో అవుటై విలియమ్సన్ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం మోరిస్ వరుస బంతుల్లో ధావన్, యువరాజ్ (3)లను అవుట్ చేసి రైజర్స్‌ను కట్టడి చేశాడు. అయితే జహీర్ వేసిన చివరి ఓవర్లో హైదరాబాద్ 17 పరుగులు రాబట్టగలిగింది. రాణించిన సామ్సన్... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో రెండు పరుగులే రాగా... సిరాజ్ వేసిన రెండో ఓవర్ తొలి నాలుగు బంతుల్లో బిల్లింగ్స్ (13) మూడు ఫోర్లు బాదాడు. అయితే అదే జోరులో మరో షాట్ ఆడబోయి మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో సామ్సన్, నాయర్ కలిసి వేగంగా పరుగులు సాధించారు. భువీ ఓవర్లో నాయర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, ఆ తర్వాత సిరాజ్ ఓవర్లో ఢిల్లీ 15 పరుగులు రాబట్టింది. ఈ జోడి 45 బంతుల్లో 71 పరుగులు జోడించిన దశలో యువీ ఓవర్ మలుపు తిప్పింది. రెండో పరుగు కోసం ప్రయత్నించి నాయర్ రనౌట్ కాగా, రిషభ్ పంత్ (0) తొలి బంతికే వెనుదిరిగాడు. అనంతరం కీలకమైన సామ్సన్ వికెట్‌ను సిరాజ్ తీయడంతో సన్ చేతుల్లోకి మ్యాచ్ వచ్చినా... రషీద్ ఖాన్ ఓవర్లో అయ్యర్ రెండు భారీ సిక్సర్లతో మళ్లీ ధాటిని పెంచాడు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడం, హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన డేర్‌డెవిల్స్ చివరకు ఓటమితో ముగించింది. శభాష్ సిరాజ్... హైదరాబాద్ జట్టులో అసలైన హైదరాబాదీ మ్యాచ్ ఆడాలని ఎదురు చూసిన అభిమానుల కోరిక ఎట్టకేలకు బుధవారం తీరింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌తో యువ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 4 ఓవర్లలో 39 పరుగుల ప్రదర్శన అద్భుతం కాకపోయినా... అతను తీసిన రెండు కీలక వికెట్లు సిరాజ్‌లోని ప్రతిభను చూపించాయి. తొలి మ్యాచ్ ఒత్తిడిలో మొదటి ఓవర్లో మూడు బౌండరీలు ఇచ్చినా, తెలివిగా బిల్లింగ్స్‌ను బోల్తా కొట్టించగలిగాడు. తర్వాతి ఓవర్లో 15 పరుగులు ఇచ్చినా... మూడో ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చి దానిని సరిదిద్దుకున్నాడు. ఇక సామ్సన్ దూసుకుపోతున్న దశలో 122 కిలోమీటర్ల వేగంతో స్లోబాల్‌తో బోల్తా కొట్టించగలగడం సిరాజ్ బౌలింగ్‌లోని వైవిధ్యాన్ని చూపిస్తుంది. మొదటి మ్యాచ్‌తోనే ఆకట్టుకున్న ఈ కుర్రాడు మున్ముందు లీగ్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆశిద్దాం. -
అవును... ఢిల్లీయే!
► ఐపీఎల్లో డేర్‌డెవిల్స్ సంచలన విజయాలు ► జట్టు రాత మార్చేసిన కోచ్ ద్రవిడ్ ► అండర్‌డాగ్‌గా వచ్చి అదరగొడుతున్న జహీర్ సేన ఢిల్లీ డేర్‌డెవిల్స్... ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టు. ముఖ్యంగా గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడిన జట్టు. అందుకే ఈసారి కూడా ఐపీఎల్ ఆరంభంలో ఈ జట్టుపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికే ఢిల్లీ జట్టు ప్రకంపనలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రతి ఏటా జట్టు నిండా స్టార్ క్రికెటర్లు... స్టార్ ఆటగాడని భావిస్తే చాలు కోట్లాది రూపాయలు కుమ్మరించిన యాజమాన్యం... అయినా ఫలితం లేక ప్రతి ఏటా జట్టులో మార్పులు... ఇలాంటి స్థితిలో ఈసారి మాత్రం వ్యూహం మార్చారు. కోచ్‌గా ద్రవిడ్‌ను తీసుకున్నాక... రాజస్తాన్ రాయల్స్ తరహాలో లో ప్రొఫైల్ క్రికెటర్లను తీసుకున్నారు. ఇప్పుడు వారితోనే మ్యాజిక్ చేస్తున్నాడు ‘మిస్టర్ డిపెండబుల్’ ద్రవిడ్. సాక్షి క్రీడావిభాగం ఈసారి ఐపీఎల్లో కాస్త అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ స్కోర్లు చేస్తున్నా మ్యాచ్‌లు కాపాడుకోలేకపోతోంది. కెప్టెన్ కూల్ ధోనికి సరైన జట్టు లేక పుణే వెనుకబడి పోయింది. స్టార్ క్రికెటర్లతో నిండిన ముంబై, హైదరాబాద్ పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తున్నాయి. కానీ ఈ జట్లన్నింటికీ భిన్నంగా లో ప్రొఫైల్ క్రికెటర్లతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దూసుకుపోతోంది. ద్రవిడ్ మార్క్ ఈ ఏడాది ఐపీఎల్ వేలం సమయానికి ఢిల్లీ జట్టు ద్రవిడ్ తమ కోచ్ అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అప్పటికే ద్రవిడ్‌తో చర్చలు పూర్తయ్యాయి. తనతో పాటు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు పని చేసిన ప్యాడీ ఆప్టన్‌ను కూడా తీసుకుని ద్రవిడ్ ‘పని’ ప్రారంభించాడు. అండర్-19 జట్టు కోచ్‌గా పని చేసిన సమయంలో యువ క్రికెటర్లను మరింత దగ్గరగా గమనించిన ద్రవిడ్... రాజస్తాన్‌లోని పాత ఆటగాళ్లలో నుంచి యువ క్రికెటర్లను తీసుకోవాలని సూచించాడు. సంజు శామ్సన్ కోసం రూ.4.2 కోట్లు ఖర్చు చేసిన ఢిల్లీ యాజమాన్యం... రిషబ్ పంత్ కోసం ఏకంగా రూ.1.9 కోట్లు వెచ్చించింది. పంత్‌కు అంత డబ్బెందుకనే మాట వినిపించినా... ద్రవిడ్ అడగడం వల్ల కొనేశారు. తాజాగా గుజరాత్‌పై పంత్ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ద్రవిడ్ గొప్పతనం మరోసారి తెలిసొచ్చింది. అలాగే బ్రాత్‌వైట్, మోరిస్ ఇద్దరి కోసం కలిపి ఏకంగా రూ.11.2 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఇద్దరూ విలువైన ఆటగాళ్లని నిరూపించుకున్నారు. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన ద్రవిడ్... కుర్రాళ్లలో స్ఫూర్తి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. అందరికీ అవకాశాలు ఢిల్లీ తమ కెప్టెన్‌గా జహీర్ ఖాన్ పేరు ప్రకటించగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కెప్టెన్‌కు అనుభవం ఉండాలని భావించిన ద్రవిడ్ సూచన మేరకే ఈ నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న జహీర్... తన అనుభవాన్నంతా మైదానంలో చూపిస్తున్నాడు. ఇక తుది జట్టు విషయంలోనూ ద్రవిడ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. గతేడాది స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ నుంచి డుమిని వరకు ఎవరినైనా కూర్చోబెడుతున్నాడు. ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో తుది జట్టులోకి తేవడం ద్వారా ప్రతి మ్యాచ్‌కూ అందరూ సన్నద్ధంగా ఉండేలా చూస్తున్నాడు. ఎవరికి అవకాశం వచ్చినా సత్తా చాటాలనే కసి ఆటగాళ్లలో పెంచాడు. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకాన్ని కూడా బాగా పాటిస్తున్నారు. నిజానికి కోచ్ కొత్తగా ఆటగాళ్లకు క్రికెట్ నేర్పాల్సిన అవసరం లేదనేది ద్రవిడ్ ఆలోచన. వాళ్లలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతూ వారిలో స్ఫూర్తి నింపడమే కోచ్ పని అనేది ద్రవిడ్ అభిప్రాయం. ‘అండర్-19 జట్టుతో ఆడిన సమయం నుంచి ద్రవిడ్ సర్ చెప్పిన మాటలను ఆచరిస్తున్నాను. ఆటతీరును బాగా మార్చుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎదురుగా ఏ స్థాయి బౌలర్ ఉన్నా ఆడగలననే ఆత్మవిశ్వాసాన్ని ఆయన పెంచారు’ అని రిషబ్ పంత్ చెప్పిన మాటలే ద్రవిడ్ ప్రభావానికి ఉదాహరణ. పని చేసిన క్యాంప్‌లు సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టు మూడు క్యాంప్‌లు నిర్వహించింది. జట్టులోని 24 మంది ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది అందరూ వీటిలో పాల్గొన్నారు. వీటిలో మ్యాచ్‌ల గురించి, వ్యూహాల గురించి ఏ మాత్రం చర్చించలేదు. కేవలం ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కోచ్‌లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే నెట్ ప్రాక్టీస్ సమయంలో ద్రవిడ్ పెద్దగా మాట్లాడడు. ఒకేసారి ఐదు నెట్స్‌ను గమనిస్తూ ఆప్టన్‌కు కొన్ని సూచనలు చెబుతాడు. ‘రాహుల్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎదగడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తారు. ఏదైనా ఒక మార్పు చేసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని మనకే ఇస్తారు’ అని మోరిస్ చెప్పాడు. ఆటగాళ్లలో ఉత్సాహం సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి తర్వాత ఈ సీజన్లోనూ ఢిల్లీ రాత మారదనే మాట వినిపించింది. కానీ ఆ మ్యాచ్ తర్వాత జహీర్ ఓ మాటన్నాడు. ‘మేం ఏం చేయాలో, ఎలా ఆడాలో మాకు స్పష్టత ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓటమి మాపై ప్రభావం చూపదు. రాబోయే రోజుల్లో మీరు మా నుంచి మంచి విజయాలు చూస్తారు’ అన్నాడు. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ గెలుపును కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అటు పంజాబ్ కూడా అంత బలమైన జట్టేమీ కాదు కాబట్టి తేలిగ్గా తీసుకున్నారు. కానీ మూడో మ్యాచ్‌లో బెంగళూరుపై ఏకంగా 192 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్ల విజయం సాధించగానే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటికీ వన్ మ్యాచ్ వండర్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై 164 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారు. గుజరాత్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా అమోఘంగా ఆడి విజయం అంచుల్లోకి వచ్చారు. కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోల్‌కతా, గుజరాత్‌లపై సులభమైన విజయాలతో లీగ్‌లో నాకౌట్ బెర్త్‌కు చేరువయ్యారు. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు బాధ్యతగా ఆడటం పెద్ద సానుకూలాంశం. ప్రస్తుతం ఢిల్లీ ఆడుతున్న తీరు... మిగిలిన మ్యాచ్‌లను పరిశీలిస్తే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడం ఖాయమే. ఇక ఈ సీజన్ చివరికి ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. -
తెల్ల ఏనుగులు
ధనాధన్ సిక్సర్లు లేవు... ఫటాఫట్ ఫోర్లు లేవు... పరుగుల సునామీ కనుచూపు మేరలో కనిపించడం లేదు... విధ్వంసం అంతకన్నా లేదు... ఓవైపు అనామక క్రికెటర్లు ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తుంటే... మరోవైపు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి మరీ కొనుక్కున్న క్రికెటర్లు మాత్రం అసలు సీన్లోనే కనబడటం లేదు.. ఇప్పటికే సగానికిపైగా మ్యాచ్‌లు అయిపోయాయి. కానీ కోట్లు దండుకుంటున్న క్రికెటర్లు మాత్రం పరుగులు చేయలేకపోతున్నారు. దీంతో వీళ్లు ‘తెల్ల ఏనుగుల్లా’ మారి ఫ్రాంచైజీలకు భారమవుతున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టని స్టార్లు సాక్షి క్రీడావిభాగం, కోరీ అండర్సన్ (ముంబై ఇండియన్స్) ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో సూపర్ ఫాస్ట్ సెంచరీ రికార్డు సాధించిన కివీస్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 4.5 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో విఫలమైన అతడు ఐపీఎల్‌లోనూ తేలిపోయాడు. భారీ అంచనాల మధ్య ఐపీఎల్ బరిలోకి దిగిన అండర్సన్ చెత్త ఆటను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచ్‌ల్లో 132 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 39 పరుగులు. నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆరోన్ ఫించ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు ఆరోన్ఫించ్ది ఐపీఎల్లో ఫ్లాప్ స్టోరీయే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఓపెనర్‌ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకి కొనుగోలు చేసింది. కానీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఫించ్ ఏమాత్రం నిలబెట్టలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించిన ఫించ్ ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి జట్టును ప్లే ఆఫ్ దశకు తీసుకెళ్తాడని సన్‌రైజర్స్ యాజమాన్యం ఆశిస్తోంది. జాక్ కలిస్... ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో కలిస్‌ది అగ్రస్థానం.. వేదిక ఏదైనా తనదైన శైలిలో రాణించగల సమర్థుడు. అయితే ఐపీఎల్లో ఈ సీజన్లో మాత్రం తనస్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే రాణించిన ఈ ఆల్‌రౌండర్ 151 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కలిస్ కోసం కోల్‌కతా యాజమాన్యం రూ.5.5 కోట్లు వెచ్చించింది. యువరాజ్ సింగ్ : బెంగళూరు ఐపీఎల్ ఏడో ఎడిషన్‌కు ముందు వేలంలో స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్(రూ. 14 కోట్లు) అందరికంటే ఎక్కువ ధరకు అమ్ముడై అందరి దృష్టినీ ఆకర్షించాడు. టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో జట్టు ఓనర్ విజయ్ మాల్యా పెట్టిన ధరకు తగ్గట్టుగానే యువీ ఆడతాడని అంతా భావించారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో యువీ 144 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రాజస్థాన్‌పై బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించాడు. ఇదే జోరు మిగిలిన మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాడా, లేదా అన్నది వేచిచూడాల్సిందే. మైకేల్ హస్సీ (ముంబై ఇండియన్స్) ఐపీఎల్లో విజయవంతమైన క్రికెటర్లలో మైకేల్ హస్సీ ఒకడు. గత సీజన్ వరకు నిలకడగా రాణిస్తూ చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడంతో హస్సీని ముంబై ఇండియన్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆరు సీజన్లలో రాణించిన ఈ ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ ఈ సారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులే చేశాడు. దీంతో జట్టు యాజమాన్యం హస్సీని పక్కనపెట్టింది. కెవిన్ పీటర్సన్: డేర్‌డెవిల్స్ ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా టోర్నీ ముందు అభిమానుల్లో ఆశలు రేపాడు. ఇంగ్లండ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురి కావడంతో ఐపీఎల్‌పై కేపీ ప్రత్యేక దృష్టి సారించాడు. చేతివేలికి గాయం కారణంగా సీజన్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగినా ఇప్పటిదాకా తన సత్తా ఏంటో చూపలేదు.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయాడు. మొత్తం 97 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 35 నాటౌట్. ఐపీఎల్ వేలంలో రూ. 9 కోట్లకు అమ్ముడుపోయిన ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా తన స్థాయికి తగ్గట్లుగా ఆడతాడని అటు ఢిల్లీ ఫ్రాంచైజీ, ఇటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.