తెల్ల ఏనుగులు | stars In maintaining confidence in franchise | Sakshi
Sakshi News home page

తెల్ల ఏనుగులు

Published Tue, May 13 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

తెల్ల ఏనుగులు

తెల్ల ఏనుగులు

ధనాధన్ సిక్సర్లు లేవు... ఫటాఫట్ ఫోర్లు లేవు... పరుగుల సునామీ కనుచూపు మేరలో కనిపించడం లేదు... విధ్వంసం అంతకన్నా లేదు... ఓవైపు అనామక క్రికెటర్లు ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తుంటే... మరోవైపు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి మరీ కొనుక్కున్న క్రికెటర్లు మాత్రం అసలు సీన్‌లోనే కనబడటం లేదు.. ఇప్పటికే సగానికిపైగా మ్యాచ్‌లు అయిపోయాయి. కానీ కోట్లు దండుకుంటున్న క్రికెటర్లు మాత్రం పరుగులు చేయలేకపోతున్నారు. దీంతో వీళ్లు ‘తెల్ల ఏనుగుల్లా’ మారి ఫ్రాంచైజీలకు భారమవుతున్నారు.
 
ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టని స్టార్లు

 
 సాక్షి క్రీడావిభాగం,
కోరీ అండర్సన్ (ముంబై ఇండియన్స్)

ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి వన్డేల్లో సూపర్ ఫాస్ట్ సెంచరీ రికార్డు సాధించిన కివీస్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్‌ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 4.5 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో విఫలమైన అతడు ఐపీఎల్‌లోనూ తేలిపోయాడు. భారీ అంచనాల మధ్య ఐపీఎల్ బరిలోకి దిగిన అండర్సన్ చెత్త ఆటను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచ్‌ల్లో 132 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 39 పరుగులు. నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
 
ఆరోన్ ఫించ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు ఆరోన్‌ఫించ్‌ది ఐపీఎల్‌లో ఫ్లాప్ స్టోరీయే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఓపెనర్‌ని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకి కొనుగోలు చేసింది. కానీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఫించ్ ఏమాత్రం నిలబెట్టలేకపోతున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించిన ఫించ్ ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచ్‌ల్లో 263 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి జట్టును ప్లే ఆఫ్ దశకు తీసుకెళ్తాడని సన్‌రైజర్స్ యాజమాన్యం ఆశిస్తోంది.

జాక్ కలిస్...
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో కలిస్‌ది అగ్రస్థానం.. వేదిక ఏదైనా తనదైన శైలిలో రాణించగల సమర్థుడు. అయితే ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో మాత్రం తనస్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే రాణించిన ఈ ఆల్‌రౌండర్ 151 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కలిస్ కోసం కోల్‌కతా యాజమాన్యం రూ.5.5 కోట్లు వెచ్చించింది.

యువరాజ్ సింగ్ : బెంగళూరు
ఐపీఎల్ ఏడో ఎడిషన్‌కు ముందు వేలంలో స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్(రూ. 14 కోట్లు) అందరికంటే ఎక్కువ ధరకు అమ్ముడై అందరి దృష్టినీ ఆకర్షించాడు.   టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో రాణించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో జట్టు ఓనర్ విజయ్ మాల్యా పెట్టిన ధరకు తగ్గట్టుగానే యువీ ఆడతాడని అంతా భావించారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. తొలి 8 మ్యాచ్‌ల్లో యువీ 144 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రాజస్థాన్‌పై బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించాడు. ఇదే జోరు మిగిలిన మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తాడా, లేదా  అన్నది వేచిచూడాల్సిందే.
 
మైకేల్ హస్సీ (ముంబై ఇండియన్స్)
ఐపీఎల్‌లో విజయవంతమైన క్రికెటర్లలో మైకేల్ హస్సీ ఒకడు. గత సీజన్ వరకు నిలకడగా రాణిస్తూ చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. చెన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడంతో హస్సీని ముంబై ఇండియన్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆరు సీజన్లలో రాణించిన ఈ ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ ఈ సారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులే చేశాడు. దీంతో జట్టు యాజమాన్యం హస్సీని పక్కనపెట్టింది.
 
కెవిన్ పీటర్సన్: డేర్‌డెవిల్స్

ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా టోర్నీ ముందు అభిమానుల్లో ఆశలు రేపాడు. ఇంగ్లండ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురి కావడంతో ఐపీఎల్‌పై కేపీ ప్రత్యేక దృష్టి సారించాడు. చేతివేలికి గాయం కారణంగా సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగినా ఇప్పటిదాకా తన సత్తా ఏంటో చూపలేదు.. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయాడు. మొత్తం 97 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 35 నాటౌట్. ఐపీఎల్ వేలంలో రూ. 9 కోట్లకు అమ్ముడుపోయిన ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా తన స్థాయికి తగ్గట్లుగా ఆడతాడని అటు ఢిల్లీ ఫ్రాంచైజీ, ఇటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement