ఢిల్లీనీ గెలిచాం | Hyderabad Edge Out Delhi By 15 Runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీనీ గెలిచాం

Published Thu, Apr 20 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

ఢిల్లీనీ గెలిచాం

ఢిల్లీనీ గెలిచాం

సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం
15 పరుగులతో డేర్‌డెవిల్స్‌ ఓటమి
చెలరేగిన విలియమ్సన్, ధావన్‌  


సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తిరుగులేని ప్రదర్శన కొనసాగుతోంది. ఇతర వేదికలపై రెండు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో జూలు విదిల్చిన జట్టు ఇప్పుడు మరో కీలక విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, శిఖర్‌ ధావన్‌ల మెరుపులతో భారీ స్కోరు నమోదు చేసిన రైజర్స్‌... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో డేర్‌డెవిల్స్‌ పని పట్టింది. ఢిల్లీ యువ ఆటగాళ్లు కొంత పట్టుదల కనబర్చినా... అది జట్టును గెలిపించడానికి సరిపోలేదు. ‘సన్‌’కు ఇది ఓవరాల్‌గా నాలుగో విజయం కాగా, ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి.  

హైదరాబాద్‌: మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఉప్పల్‌ మైదానంలో తాము ఆడిన నాలుగో మ్యాచ్‌లోనూ  విజయాన్ని అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (51 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (50 బంతుల్లో 70; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగి రెండో వికెట్‌కు 86 బంతుల్లోనే 136 పరుగులు జోడించడం విశేషం.

4 వికెట్లూ మోరిస్‌కే దక్కాయి. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రేయస్‌ అయ్యర్‌ (31 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సామ్సన్‌ (33 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరుణ్‌ నాయర్‌ (23 బంతుల్లో 33; 5 ఫోర్లు,1 సిక్స్‌), మాథ్యూస్‌ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్‌ సిరాజ్‌కు 2 వికెట్లు  దక్కాయి.

భారీ భాగస్వామ్యం...
చాలా కాలం తర్వాత హైదరాబాద్‌ జట్టు వార్నర్‌ ప్రమేయం లేకుండా భారీ స్కోరు సాధించగలిగింది. ధావన్, సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న విలియమ్సన్‌ కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వార్నర్‌ (4) అవుటైన తర్వాత  వీరిద్దరు దూకుడైన ఆటను ప్రదర్శించారు. ఢిల్లీ బలహీన బౌలింగ్‌ కూడా సన్‌కు కలిసొచ్చింది. కెప్టెన్‌ జహీర్‌ ఈ జోడీని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ముఖ్యంగా విలియమ్సన్‌ భారీ షాట్లతో చెలరేగి తనలో కొత్త కోణాన్ని ప్రదర్శించాడు. మాథ్యూస్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో అతను రెండు అద్భుతమైన సిక్సర్లు బాదాడు.

కమిన్స్‌ ఓవర్లోనూ మరో సిక్సర్‌ బాది కేన్‌ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిశ్రా వేసిన ఓవర్లో విలియమ్సన్‌ మరో రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరోవైపు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్న ధావన్‌ 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు మోరిస్‌ బౌలింగ్‌లో అవుటై విలియమ్సన్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం మోరిస్‌ వరుస బంతుల్లో ధావన్, యువరాజ్‌ (3)లను అవుట్‌ చేసి రైజర్స్‌ను కట్టడి చేశాడు. అయితే జహీర్‌ వేసిన చివరి ఓవర్లో హైదరాబాద్‌ 17 పరుగులు రాబట్టగలిగింది.

రాణించిన సామ్సన్‌...
భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో రెండు పరుగులే రాగా... సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ తొలి నాలుగు బంతుల్లో బిల్లింగ్స్‌ (13) మూడు ఫోర్లు బాదాడు. అయితే అదే జోరులో మరో షాట్‌ ఆడబోయి మిడ్‌ వికెట్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఈ దశలో సామ్సన్, నాయర్‌ కలిసి వేగంగా పరుగులు సాధించారు. భువీ ఓవర్లో నాయర్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, ఆ తర్వాత సిరాజ్‌ ఓవర్లో ఢిల్లీ 15 పరుగులు రాబట్టింది. ఈ జోడి 45 బంతుల్లో 71 పరుగులు జోడించిన దశలో యువీ ఓవర్‌ మలుపు తిప్పింది. రెండో పరుగు కోసం ప్రయత్నించి నాయర్‌ రనౌట్‌ కాగా, రిషభ్‌ పంత్‌ (0) తొలి బంతికే వెనుదిరిగాడు. అనంతరం కీలకమైన సామ్సన్‌ వికెట్‌ను సిరాజ్‌ తీయడంతో సన్‌ చేతుల్లోకి మ్యాచ్‌ వచ్చినా... రషీద్‌ ఖాన్‌ ఓవర్లో అయ్యర్‌ రెండు భారీ సిక్సర్లతో మళ్లీ ధాటిని పెంచాడు. అయితే లక్ష్యం మరీ పెద్దది కావడం, హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన డేర్‌డెవిల్స్‌ చివరకు ఓటమితో ముగించింది.

శభాష్‌ సిరాజ్‌...
హైదరాబాద్‌ జట్టులో అసలైన హైదరాబాదీ మ్యాచ్‌ ఆడాలని ఎదురు చూసిన అభిమానుల కోరిక ఎట్టకేలకు బుధవారం తీరింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌తో యువ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 4 ఓవర్లలో 39 పరుగుల ప్రదర్శన అద్భుతం కాకపోయినా... అతను తీసిన రెండు కీలక వికెట్లు సిరాజ్‌లోని ప్రతిభను చూపించాయి. తొలి మ్యాచ్‌ ఒత్తిడిలో మొదటి ఓవర్లో మూడు బౌండరీలు ఇచ్చినా, తెలివిగా బిల్లింగ్స్‌ను బోల్తా కొట్టించగలిగాడు.

తర్వాతి ఓవర్లో 15 పరుగులు ఇచ్చినా... మూడో ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చి దానిని సరిదిద్దుకున్నాడు. ఇక సామ్సన్‌ దూసుకుపోతున్న దశలో 122 కిలోమీటర్ల వేగంతో స్లోబాల్‌తో బోల్తా కొట్టించగలగడం సిరాజ్‌ బౌలింగ్‌లోని వైవిధ్యాన్ని చూపిస్తుంది. మొదటి మ్యాచ్‌తోనే ఆకట్టుకున్న ఈ కుర్రాడు మున్ముందు లీగ్‌లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఆశిద్దాం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement