ఆ ఇద్దరు క్రికెటర్ల గురించి ఏమి చెప్పగలం?
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పట్ల గుజరాత్ లయన్స్ ఆటగాడు అరోన్ ఫించ్ నిరాశ వ్యక్తం చేశాడు. గుజరాత్ లయన్స్ గౌరవప్రదమైన స్కోరునే నమోదు చేసినా, హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటి చేత్తో మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నాడన్నాడు.
'నిన్నటి మ్యాచ్ చూడండి. మేము పోరాడే స్కోరునే సాధించాం. అయినప్పటికీ డేవిడ్ వార్నర్ మా విజయాన్ని అడ్డుకున్నాడు. అది నిజంగా వార్నర్ విజయమే. అంతకుముందు జరిగిన తొలి క్వాలిఫయర్లో ఏబీ డివిలియర్స్ మాకు విజయం దక్కకుండా చేశాడు. ఈ రెండు పరాజయాలతో మేము టోర్నీ నుంచి నిష్క్రమించాం. ఆ ఇద్దరి క్రికెటర్ల గురించి ఏమి చెప్పగలం. వారిద్దరూ ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లు. ఆ క్రికెటర్లు మాపై కీలక ఇన్నింగ్స్ ఆడిన సందర్భాల్లో తలపై ఉన్న క్యాప్ తీసి 'వెల్ ప్లేడ్(బాగా ఆడారు) అని చెప్పడం మినహా ఏమి చేయగలం. కొన్ని సమయాల్లో ఇదే పరిస్థితిని చూడక తప్పదు' అని ఫించ్ స్పష్టం చేశాడు.