న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది.
ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు.
38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్‌లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్‌ఆర్‌హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్‌లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్‌ఆర్‌హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు.
భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్‌క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్‌ఆర్‌హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment