ద్రవిడ్
ముంబై: అండర్–19 ప్రపంచకప్ గెలిచేందుకు సుశిక్షిత సేనని సిద్ధం చేసిన కోచ్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. బోర్డు ప్రకటించిన నగదు నజరానాల విషయంలో సమానత్వం లేకపోవడంపై పెదవి విరిచాడు. కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ. 30 లక్షల చొప్పున, కోచ్‌కు రూ. 50 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున పారితోషికాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కోచింగ్ బృందంలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. కానీ ఈ తేడాలేంటో అర్థం కావడంలేదు. సహాయ సిబ్బంది నాణ్యమైన సేవలందించారు. ప్రతి రోజూ జట్టు కోసమే తపించారు. గెలిచేదాకా పట్టు సడలకుండా శ్రమించారు. ఇది ఒక నెలో... రెండు నెలలో కాదు... 14 నుంచి 16 నెలల వరకు జరిగిన సుదీర్ఘ ప్రక్రియ.
ఇందులో అలసట ఎరుగని ప్రయాణం చేశారు మావాళ్లు. కుర్రాళ్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నారు. అనేక కసరత్తులు చేశారు. జట్టు ప్రణాళికలు, సన్నాహాలు, వ్యూహ రచన అంతా సమష్టిగానే జరిగింది. ఈ సమష్టితత్వమే కుర్రాళ్లు కప్ గెలవడంలో దోహదపడింది’ అని 45 ఏళ్ల ద్రవిడ్ అన్నాడు. బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఉన్న అడ్వయిజరీ కమిటీని కాదని ద్రవిడ్ జూనియర్ కోచింగ్‌కు మొగ్గు చూపాడు. బోర్డు కూడా ఆయన నిర్ణయానికి సరేనంటూ రూ. 4 కోట్ల వార్షిక చెల్లింపుతో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment