under - 19 cricket
-
పిల్లలు కాదు... పిడుగులు!
ఒకసారి జరిగితే అదృష్టం అనవచ్చు. రెండోసారీ అయితే అనుకోని అద్భుతం లెమ్మనవచ్చు. అదే పదే పదే విజేతగా నిలుస్తుంటే – అది ప్రతిభా సామర్థ్యాలకు ప్రతీక కాక మరేమిటి?! క్రికెట్లో 2000, 2008, 2012, 2018 తర్వాత మరోసారి అండర్ –19 ప్రపంచ కప్‌ను భారత్ ఖాతాలో జమ చేసిన కుర్రాళ్ళ ప్రతిభ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోంది. వెస్టిండీస్ గడ్డపై శనివారం జరిగిన అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మన యువ ఆటగాళ్ళు సృష్టించిన చరిత్ర అలాంటిది. ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తే యువతరం దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకురాగలదనడానికి ఈ తాజా విజయం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. అప్పట్లో 1983లో భారత్ సీనియర్ల బృందం తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్ సాధించినప్పుడు ఆటగాళ్ళకు ఉదారంగా బహూకరించేందుకు క్రికెట్ బోర్డు దగ్గర నిధులు లేవంటే క్రికెట్ వీరాభిమాని గానకోకిల లతా మంగేష్కర్ తన విభావరితో రూ. 20 లక్షల వసూలుకు సహకరించారు. యాదృచ్ఛికంగా ఆమె తుది ఘడియల వేళ ఇప్పుడీ యువ జట్టు ఈ ప్రపంచ కప్‌తో ఆమెకు అంతిమ బహుమతి ఇచ్చినట్టయింది. ఈ యువ కిశోర బృందం సాధించిన ఈ విజయం ఒకటికి రెండు విధాలుగా చిరస్మరణీ యమైనది. అండర్–19 క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 14 ప్రపంచ కప్ పోటీలలో భారత్‌కు ఇది అయిదో ప్రపంచ కప్. అలా అత్యధిక పర్యాయాలు ఆ ఘనత సాధించిన జట్టుగా భారత్ రికార్డు కెక్కింది. ఇక రెండోది – కోచ్ హృశీకేశ్ కనిత్కర్ మార్గదర్శనంలో అనేక అవాంతరాల్ని తట్టుకొని, వయసుకు మించిన పరిణతితో ఈ జట్టు నిలిచి, గెలిచిన తీరు. ఒక సందర్భంలో క్రికెట్ శిబిరంలో కరోనా కలకలం రేపి, ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. రెండు మ్యాచ్‌లకు గాను కనాకష్టంగా 11 మంది ప్లేయర్లే ఫిట్నెస్తో మిగిలారు. అయినా సరే ఈ పిన్న వయస్కులు మానసిక స్థైర్యం చూపి, బరిలో పోరాడిన తీరు ప్రేరణనిచ్చే అంశం. సాక్షాత్తూ కరోనా బారిన పడి కోలుకొని మరీ ఉద్విగ్నభరితమైన రీతిలో సెంచరీ కొట్టాడు కెప్టెన్ యశ్ ధుల్. అతని సారథ్యంలోని ఈ జట్టులో లోయర్ ఆర్డర్ ఆటగాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పోరాటతత్త్వం నిండినవారే. బ్యాటింగ్, పేస్, స్పిన్ బౌలింగ్ – ఇలా అన్ని విభాగాల్లో సత్తా చూపి, ప్రత్యర్థి జట్లను తిప్పలు పెట్టిన బృందం ఇది. నిజానికి, ఈ టోర్నీలో అగ్రశ్రేణి పరుగుల వీరులు, వికెట్ పడగొట్టిన యోధుల జాబితా తీస్తే – అందులో భారత ఓపెనర్ రఘువంశీ పేరొక్కటే కనిపిస్తుంది. అయితేనేం, కలసికట్టుగా ఆడిన విధానం, విజయాలు సాధించిన వైనం టోర్నీలో భారత్‌ను అప్రతిహతంగా నిలిపింది. ఆతిథ్య దేశమైన వెస్టిండీస్‌లో ఆది నుంచి మన జట్టు దూకుడు చూపుతూనే వచ్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కనిష్ఠంగా 45 పరుగుల తేడాతో, రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చి లక్ష్యసాధన చేయాల్సి వస్తే కనీసం 4 వికెట్ల తేడాతో విజయాలు సాధించింది. తమ లాగే అజేయంగా ఫైనల్‌కు దూసుకువచ్చిన ఇంగ్లండ్‌ను ఫైనల్లో మొదట బౌలింగ్‌తో ఇరుకున పెట్టింది. చివరకు 189 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ పరువు దక్కించుకుంది. లక్ష్య ఛేదనలో భారత యువ జట్టు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. మ్యాచ్ ఎటైనా మొగ్గే స్థితిలోనూ బెసగకుండా, కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి (నిశాంత్ సింధు, షేక్ రషీద్) హాఫ్ సెంచరీలతో జట్టు గెల్చింది. వైస్ కెప్టెనైన మన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ తన ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం మరింత సంతోషకరం. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లోనూ కెప్టెన్‌తో కలసి మనోడు రెండొందల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం చిరస్మరణీయం. గతంలో అంబటి రాయుడు, ఈ మధ్య మహమ్మద్ సిరాజ్ లాంటి తెలుగువారు క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును ఇది గుర్తుతెస్తోంది. అతి సామాన్య స్థాయి నుంచి వచ్చినా ప్రతిభకు తోడుగా పట్టుదలను ఇంధనంగా చేసుకుంటే, ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకోగలరో కళ్ళెదుట కనిపిస్తూ, స్ఫూర్తినిస్తోంది. మునుపు అండర్–19 క్రికెట్ జట్టుకు సారథులుగా దేశానికి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చాంద్, పృథ్వీ షాల వరుసలో ఇప్పుడు యశ్ ధుల్ చేరాడు. ఆ మునుపటి సారథుల లాగానే రాబోయే రోజుల్లో యశ్‌ను కూడా సీనియర్ జట్టులో చూడడం ఖాయం. ఒక్క యశే కాదు... ఈ కుర్రాళ్ళలో పలువురు గతంలో యువరాజ్ సింగ్, రిషభ్ పంథ్లా సీనియర్ల జట్టుకు ఎదిగి, అక్కడ మెరిసే సత్తా ఉన్నవారే. రేపు వీరే భారత క్రికెట్‌కు కొండంత అండ. మొత్తం మీద, భారత సీనియర్ క్రికెట్ జట్టు సరిగ్గా 1000వ వన్డే ఇంటర్నేషనల్ ఆడి గెలవడానికి ఒక్క రోజు ముందు పిల్లలు కొత్త ఆశలు మోసులెత్తేలా చేశారు. అయితే, నేషనల్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నట్టు ‘ఇది క్రికెటర్లుగా వారి సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమే’. ఇలాంటి ప్రతిభావంతులనూ, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మట్టిలో మాణిక్యాలను గుర్తించి, అవసరమైన చేయూతనివ్వడమే ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన పని. క్రికెట్ బోర్డ్ ఎంతో కొంత ఆ పని చేయబట్టే, ఇప్పుడీ ఘనత సాధ్యమైంది. దాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ఆటగాళ్ళకు తదుపరి మార్గదర్శనం చేయాలి. అది జరిగినప్పుడే ఏ రంగంలోనైనా నవ భారత నిర్మాణమవుతుంది. ఆ సుందర స్వప్నం సాకారం కావడానికి పాలకులు ఆలసించకుండా తమ వంతు కృషి చేయాల్సిన అమృతకాలం ఇదే! -
ఫేవరెట్ భారత్
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ప్రపంచకప్‌లో కీలక పోరుకు సన్నద్ధమైంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఫామ్, బలా బలాలపరంగా చూస్తే ఈ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. కంగారూలపై భారత కుర్రాళ్ల గత రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 2013 నుంచి అండర్–19 ప్రపంచ కప్‌లో ఆసీస్‌తో భారత్ ఐదు సార్లు తలపడగా నాలుగు సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటి వరకు భారత బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ రెండు అర్ధ సెంచరీలు సాధించగా, దివ్యాంశ్ సక్సేనా, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా ఆకట్టుకున్నారు. హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ కూడా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ కార్తీక్ త్యాగి నిలకడైన ప్రదర్శన కనబర్చగా, లెఫ్టార్మ్ సీమర్ ఆకాశ్ సింగ్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అథర్వ కూడా టోర్నీలో ప్రభావం చూపించారు. ఆస్ట్రేలియా బృందంలో కెప్టెన్ మెకెంజీ హార్వీ ప్రధాన బ్యాట్స్‌మన్ కాగా ఆల్‌రౌండర్ కానర్ సలీ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే రెండు జట్లలో ప్రధాన పోలికను చూస్తే లెగ్‌స్పిన్నర్లు కీలకంగా మారారు. భారత్ తరఫున సత్తా చాటుతున్న రవి బిష్ణోయ్ 3 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఆసీస్ ఆటగాడు తన్వీర్ సంఘా కూడా 10 వికెట్లు తీశాడు. వీరిద్దరిలో ఎవరు రాణిస్తారనేది ఆయా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయవచ్చు. -
చివరి వన్డేలో భారత్ ఓటమి
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా అండర్–19 జట్టుతో జరిగిన చివరిదైన మూడో అనధికారిక వన్డేలో భారత అండర్–19 జట్టు ఐదు వికెట్లతో ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా యువ భారత్ 2–1 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. ప్రియం గార్గ్ (52; 6 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జొనాథన్ బర్డ్ (88 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) జట్టుకు విజయాన్ని అందించాడు. -
‘జై’శ్వాల్.. ఇరగదీశాడు
ఈస్ట్ లండన్: అండర్-19లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు 8 వికెట్ల ఘన విజయం సాధించింది. బర్త్‌డే బాయ్ యశస్వి జైశ్వాల్ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ముందుగా బంతితో ప్రత్యర్థులను వణికించిన ఈ యువ స్పిన్నర్ తర్వాత బ్యాట్‌తో సత్తా చాటాడు. అర్ధ సెంచరీ చేయడంతో పాటు 4 వికెట్లు పడగొట్టి తన 18వ పుట్టినరోజును తీపిగుర్తుగా మలచుకున్నాడు. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలోనే ఛేదించింది. యశస్వి అజేయ అర్థసెంచరీతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. 56 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జురెల్ 26 పరుగులు చేయగా, ప్రియం గార్గ్ డకౌటయ్యాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 29.5 ఓవర్లలోనే 119 పరుగులకు ఆలౌటైంది. యశస్వి 4 వికెట్లు నేల కూల్చాడు. ఆకాశ్ సింగ్, అంకోలేకర్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. యశస్వి జైశ్వాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 2-0తో భారత్ సొంతమయింది. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను యువ భారత్ చిత్తు చేసింది. నామమాత్రమైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో యశస్విని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది. యశస్వి తాజా ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ఖుషీగా ఉంది. రోడ్డుపై పానీపూరీలు అమ్మే స్థాయి నుంచి ముంబై సీనియర్ జట్టు వరకు ఎదిగిన సంచలన ఆటగాడు యశస్వికి భారీ మొత్తం లభించడం విశేషం. (చదవండి: ఐపీఎల్ వేలంలో కోట్లాభిషేకం) -
తిలక్ వర్మకు చోటు
ముంబై: గత కొంత కాలంగా భారత యూత్ జట్టు సభ్యుడిగా నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మకు మరో అరుదైన అవకాశం లభించింది. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టులోకి అతను ఎంపికయ్యాడు. 2018–19 సీజన్ కూచ్‌బెహర్ ట్రోఫీలో తిలక్ 6 మ్యాచ్‌లలో 86.56 సగటుతో 779 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వన్డే టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా 84.50 సగటుతో 8 మ్యాచ్‌లలో 507 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనే అతను భారత అండర్–19 టీమ్‌లో రెగ్యులర్‌గా మారేందుకు కారణమైంది. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ తిలక్ ఆడాడు. దక్షిణాఫ్రికాలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఇందు కోసం భారత జూనియర్ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రియమ్ గార్గ్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపిక కాగా... యూపీకే చెందిన ధ్రువ్ జురేల్ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. యూపీ సీనియర్ జట్టులో ఇప్పటికే రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ప్రియమ్ 2018–19 రంజీ సీజన్లో 814 పరుగులతో సత్తా చాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సహా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగుతున్న ముంబై ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా ప్రపంచ కప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అండర్–19 ప్రపంచ కప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధిస్తాయి. నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) అండర్–19 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ ఈ సారి గ్రూప్ ‘ఎ’లో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో కలిసి బరిలోకి దిగుతోంది. రక్షణ్‌కు చోటు... ప్రపంచ కప్‌కు ముందే భారత అండర్–19 జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. ముందుగా సఫారీలతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లతో పాటు న్యూజిలాండ్, జింబాబ్వే భాగంగా నాలుగు దేశాల వన్డే టోర్నీ కూడా జరుగుతుంది. ఈ సిరీస్‌ల కోసం సెలక్టర్లు అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేశారు. 16వ ఆటగాడిగా హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ సీటీఎల్ రక్షణ్‌కు ఆ అవకాశం లభించింది. రక్షణ్ ఇటీవల అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడాడు. ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత అండర్–19 జట్టు ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ చంద్ జురేల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ (హైదరాబాద్), యశస్వి జైస్వాల్, అథర్వ అంకోలేకర్, దివ్యాంశ్ సక్సేనా, కార్తీక్ త్యాగి (ముంబై), శుభాంగ్ హెగ్డే, విద్యాధర్ పాటిల్ (కర్ణాటక), కుమార్ కుశాగ్ర, సుశాంత్ మిశ్రా (జార్ఖండ్), రవి బిష్ణోయ్, ఆకాశ్ సింగ్ (రాజస్తాన్), శాశ్వత్ రావత్ (బరోడా), దివ్యాంశ్ జోషి (మిజోరం). -
ఎందుకింత తేడా?
ముంబై: అండర్–19 ప్రపంచకప్ గెలిచేందుకు సుశిక్షిత సేనని సిద్ధం చేసిన కోచ్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. బోర్డు ప్రకటించిన నగదు నజరానాల విషయంలో సమానత్వం లేకపోవడంపై పెదవి విరిచాడు. కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ. 30 లక్షల చొప్పున, కోచ్‌కు రూ. 50 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున పారితోషికాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కోచింగ్ బృందంలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. కానీ ఈ తేడాలేంటో అర్థం కావడంలేదు. సహాయ సిబ్బంది నాణ్యమైన సేవలందించారు. ప్రతి రోజూ జట్టు కోసమే తపించారు. గెలిచేదాకా పట్టు సడలకుండా శ్రమించారు. ఇది ఒక నెలో... రెండు నెలలో కాదు... 14 నుంచి 16 నెలల వరకు జరిగిన సుదీర్ఘ ప్రక్రియ. ఇందులో అలసట ఎరుగని ప్రయాణం చేశారు మావాళ్లు. కుర్రాళ్లకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నారు. అనేక కసరత్తులు చేశారు. జట్టు ప్రణాళికలు, సన్నాహాలు, వ్యూహ రచన అంతా సమష్టిగానే జరిగింది. ఈ సమష్టితత్వమే కుర్రాళ్లు కప్ గెలవడంలో దోహదపడింది’ అని 45 ఏళ్ల ద్రవిడ్ అన్నాడు. బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు ఉన్న అడ్వయిజరీ కమిటీని కాదని ద్రవిడ్ జూనియర్ కోచింగ్‌కు మొగ్గు చూపాడు. బోర్డు కూడా ఆయన నిర్ణయానికి సరేనంటూ రూ. 4 కోట్ల వార్షిక చెల్లింపుతో మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది. -
‘అనంత’ ఓటమి!
అనంతపురం న్యూసిటీ : అండర్-19 బాలిక అంతర్‌జిల్లాల క్రికెట్ టోర్నీలో స్వయం తప్పిదాలతో అనంత జట్టు ఓటమి పాలైంది. లో నెట్ రన్‌రేట్ ‘అనంత’కు ట్రోఫీని దూరం చేసింది. 1.06 నెట్ రన్‌రేట్ (12 పాయింట్లు)తో చిత్తూరు జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. మూడో స్థానంలో కర్నూలు, నాల్గో స్థానంలో నెల్లూరు, ఐదో స్థానంలో వైఎస్సార్ జిల్లా జట్లు నిలిచాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా పద్మజ(చిత్తూరు) నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ హాజరై ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో ఏసీఏ సౌత్‌జోన్ కార్యదర్శి నాగేశ్వరరావు, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, ఏడీసీఏ కార్యదర్శి షాబుద్దీన్, సెలెక్టర్ ధనుంజయరెడ్డి, టోర్నీ పరిశీలకులు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.