ఒకసారి జరిగితే అదృష్టం అనవచ్చు. రెండోసారీ అయితే అనుకోని అద్భుతం లెమ్మనవచ్చు. అదే పదే పదే విజేతగా నిలుస్తుంటే – అది ప్రతిభా సామర్థ్యాలకు ప్రతీక కాక మరేమిటి?! క్రికెట్‌లో 2000, 2008, 2012, 2018 తర్వాత మరోసారి అండర్ –19 ప్రపంచ కప్‌ను భారత్ ఖాతాలో జమ చేసిన కుర్రాళ్ళ ప్రతిభ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోంది. వెస్టిండీస్ గడ్డపై శనివారం జరిగిన అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మన యువ ఆటగాళ్ళు సృష్టించిన చరిత్ర అలాంటిది.
ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తే యువతరం దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకురాగలదనడానికి ఈ తాజా విజయం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. అప్పట్లో 1983లో భారత్ సీనియర్ల బృందం తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్ సాధించినప్పుడు ఆటగాళ్ళకు ఉదారంగా బహూకరించేందుకు క్రికెట్ బోర్డు దగ్గర నిధులు లేవంటే క్రికెట్ వీరాభిమాని గానకోకిల లతా మంగేష్కర్ తన విభావరితో రూ. 20 లక్షల వసూలుకు సహకరించారు. యాదృచ్ఛికంగా ఆమె తుది ఘడియల వేళ ఇప్పుడీ యువ జట్టు ఈ ప్రపంచ కప్‌తో ఆమెకు అంతిమ బహుమతి ఇచ్చినట్టయింది.
ఈ యువ కిశోర బృందం సాధించిన ఈ విజయం ఒకటికి రెండు విధాలుగా చిరస్మరణీ యమైనది. అండర్–19 క్రికెట్‌లో ఇప్పటి వరకు జరిగిన 14 ప్రపంచ కప్ పోటీలలో భారత్‌కు ఇది అయిదో ప్రపంచ కప్. అలా అత్యధిక పర్యాయాలు ఆ ఘనత సాధించిన జట్టుగా భారత్ రికార్డు కెక్కింది. ఇక రెండోది – కోచ్ హృశీకేశ్ కనిత్కర్ మార్గదర్శనంలో అనేక అవాంతరాల్ని తట్టుకొని, వయసుకు మించిన పరిణతితో ఈ జట్టు నిలిచి, గెలిచిన తీరు. ఒక సందర్భంలో క్రికెట్ శిబిరంలో కరోనా కలకలం రేపి, ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. రెండు మ్యాచ్‌లకు గాను కనాకష్టంగా 11 మంది ప్లేయర్లే ఫిట్‌నెస్‌తో మిగిలారు. అయినా సరే ఈ పిన్న వయస్కులు మానసిక స్థైర్యం చూపి, బరిలో పోరాడిన తీరు ప్రేరణనిచ్చే అంశం. సాక్షాత్తూ కరోనా బారిన పడి కోలుకొని మరీ ఉద్విగ్నభరితమైన రీతిలో సెంచరీ కొట్టాడు కెప్టెన్ యశ్ ధుల్.
అతని సారథ్యంలోని ఈ జట్టులో లోయర్ ఆర్డర్ ఆటగాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ పోరాటతత్త్వం నిండినవారే. బ్యాటింగ్, పేస్, స్పిన్ బౌలింగ్ – ఇలా అన్ని విభాగాల్లో సత్తా చూపి, ప్రత్యర్థి జట్లను తిప్పలు పెట్టిన బృందం ఇది. నిజానికి, ఈ టోర్నీలో అగ్రశ్రేణి పరుగుల వీరులు, వికెట్ పడగొట్టిన యోధుల జాబితా తీస్తే – అందులో భారత ఓపెనర్ రఘువంశీ పేరొక్కటే కనిపిస్తుంది. అయితేనేం, కలసికట్టుగా ఆడిన విధానం, విజయాలు సాధించిన వైనం టోర్నీలో భారత్‌ను అప్రతిహతంగా నిలిపింది. ఆతిథ్య దేశమైన వెస్టిండీస్‌లో ఆది నుంచి మన జట్టు దూకుడు చూపుతూనే వచ్చింది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కనిష్ఠంగా 45 పరుగుల తేడాతో, రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చి లక్ష్యసాధన చేయాల్సి వస్తే కనీసం 4 వికెట్ల తేడాతో విజయాలు సాధించింది. తమ లాగే అజేయంగా ఫైనల్‌కు దూసుకువచ్చిన ఇంగ్లండ్‌ను ఫైనల్‌లో మొదట బౌలింగ్‌తో ఇరుకున పెట్టింది. చివరకు 189 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ పరువు దక్కించుకుంది. లక్ష్య ఛేదనలో భారత యువ జట్టు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. మ్యాచ్ ఎటైనా మొగ్గే స్థితిలోనూ బెసగకుండా, కరోనా నుంచి కోలుకున్న ఇద్దరి (నిశాంత్ సింధు, షేక్ రషీద్) హాఫ్ సెంచరీలతో జట్టు గెల్చింది.
వైస్ కెప్టెనైన మన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ తన ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం మరింత సంతోషకరం. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లోనూ కెప్టెన్‌తో కలసి మనోడు రెండొందల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం చిరస్మరణీయం. గతంలో అంబటి రాయుడు, ఈ మధ్య మహమ్మద్ సిరాజ్ లాంటి తెలుగువారు క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును ఇది గుర్తుతెస్తోంది. అతి సామాన్య స్థాయి నుంచి వచ్చినా ప్రతిభకు తోడుగా పట్టుదలను ఇంధనంగా చేసుకుంటే, ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకోగలరో కళ్ళెదుట కనిపిస్తూ, స్ఫూర్తినిస్తోంది. మునుపు అండర్–19 క్రికెట్ జట్టుకు సారథులుగా దేశానికి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చాంద్, పృథ్వీ షాల వరుసలో ఇప్పుడు యశ్ ధుల్ చేరాడు. ఆ మునుపటి సారథుల లాగానే రాబోయే రోజుల్లో యశ్‌ను కూడా సీనియర్ జట్టులో చూడడం ఖాయం. ఒక్క యశే కాదు... ఈ కుర్రాళ్ళలో పలువురు గతంలో యువరాజ్ సింగ్, రిషభ్ పంథ్‌లా సీనియర్ల జట్టుకు ఎదిగి, అక్కడ మెరిసే సత్తా ఉన్నవారే. రేపు వీరే భారత క్రికెట్‌కు కొండంత అండ.
మొత్తం మీద, భారత సీనియర్ క్రికెట్ జట్టు సరిగ్గా 1000వ వన్డే ఇంటర్నేషనల్ ఆడి గెలవడానికి ఒక్క రోజు ముందు పిల్లలు కొత్త ఆశలు మోసులెత్తేలా చేశారు. అయితే, నేషనల్ క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నట్టు ‘ఇది క్రికెటర్లుగా వారి సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమే’. ఇలాంటి ప్రతిభావంతులనూ, దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మట్టిలో మాణిక్యాలను గుర్తించి, అవసరమైన చేయూతనివ్వడమే ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన పని. క్రికెట్ బోర్డ్ ఎంతో కొంత ఆ పని చేయబట్టే, ఇప్పుడీ ఘనత సాధ్యమైంది. దాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. ఆటగాళ్ళకు తదుపరి మార్గదర్శనం చేయాలి. అది జరిగినప్పుడే ఏ రంగంలోనైనా నవ భారత నిర్మాణమవుతుంది. ఆ సుందర స్వప్నం సాకారం కావడానికి పాలకులు ఆలసించకుండా తమ వంతు కృషి చేయాల్సిన అమృతకాలం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment