(గౌతం గంభీర్) : భారత జట్టుకు సంబంధించి అసలు పరీక్ష ఇప్పుడే మొదలు కానుందని నా భావన. ఫామ్‌లో లేని ఆసీస్‌ను, పసికూన అఫ్గన్‌ను, అనిశ్చితితో ఆడే పాక్‌ను, బలహీన బంగ్లాను ఓడించి మనల్ని మనం అభినందించుకున్నాం. సమష్టితత్వంతో ఆడే కివీస్‌తో నేడు తలపడనుండగా, ఆ తర్వాత పదునైన ఇంగ్లండ్, జోరు మీదున్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రత్యర్థి జట్లు గానీ, పరిస్థితులు గానీ మనల్ని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి సవాల్ ఈ రోజు ఎదురు కావచ్చు. ముఖ్యంగా పాండ్యా లేని లోటుతో జట్టు కూర్పు కూడా కీలకం కానుంది.
వరల్డ్ కప్ ముందు ఆసీస్‌తో సిరీస్‌లో పాండ్యా ఆడలేదు. అప్పుడు సూర్యకుమార్ ఆరో స్థానంలో ఆడగా, శార్దుల్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లలో ఒకడిగా బరిలో నిలిచాడు. ఇప్పుడు కూడా దానినే అమలు చేయవచ్చు. సూర్య ప్రత్యేకమైన ఆటగాడు కాగా ధర్మశాల పిచ్ సీమర్లను అనుకూలిస్తే శార్దుల్ కీలకం కాగలడు. ధర్మశాల పిచ్‌కు స్పిన్‌కు అనుకూలంగా కనిపిస్తే నేరుగా పాండ్యా స్థానంలో అశ్విన్‌ను తీసుకోవడం సరైంది. నేటి పోరు భారత బ్యాటింగ్, కివీస్ బౌలింగ్ మధ్య జరగనుంది. రోహిత్ మరోసారి పదునైన లెఫ్టార్మ్ పేసర్‌ను ఎదుర్కోవాల్సి ఉంది.
స్టార్క్, షాహిన్, ముస్తఫిజుర్‌లతో పోలిస్తే బౌల్ట్ చాలా ప్రమాదకారి. అతను చిరునవ్వు మొహాన్ని చూసి మోసపోవద్దు. ఆ ముగ్గురికంటే ఇతని బౌలింగ్‌లో పదును చాలా ఎక్కువ. దూకుడైన ఆటతో రోహిత్ ఈ ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేశాడు. అన్ని ఇన్నింగ్స్‌లలోనూ చివరి వరకు అతను జోరు కొనసాగించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గిల్‌కు కూడా అతను ఇదే విషయం చెప్పాలి. ఆరంభంలో పరుగులు రాకపోతే విసుగు చెందవద్దు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడం ముఖ్యం. పవర్‌ప్లేలోనే భారత్‌ను దెబ్బ తీసేందుకు కివీస్ ప్రయత్నిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment